Movies

రజనీకి వీసా నిరాకరించలేదు

Rajinikanth Was Not Denied Srilankan Visa-Authorities Confirm

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వీసాను శ్రీలంక ప్రభుత్వం తిరస్కరించిందని వదంతులు వచ్చాయి. ఈ ఏడాది రజనీ శ్రీలంకలో పర్యటించాలనుకున్నారని, కానీ కొన్ని కారణాల వల్ల అక్కడి ప్రభుత్వం ఆయన వీసాను తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. ఈ వదంతులపై శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్సె కుమారుడు నమల్‌ రాజపక్సె స్పందించారు. తలైవా వీసా తిరస్కరించామన్నది కేవలం వదంతని స్పష్టం చేశారు. తను, తన తండ్రి కూడా రజనీకి అభిమానులమని చెప్పారు. ‘ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను శ్రీలంకలో ప్రవేశించడానికి అనుమతించలేదని వచ్చిన వార్తల్లో నిజం లేదు. శ్రీలంకలోని చాలా మందిలాగే నాకు, నా తండ్రి కూడా రజనీ, ఆయన సినిమాలకు అభిమానులం. రజనీకి నిజంగా శ్రీలంక రావాలని ఉంటే.. ఆపేందుకు ఎటువంటి కారణాలు ఉండవు’ అని నమల్‌ రాజపక్సె ట్వీట్‌ చేశారు. ఇటీవల శ్రీలంక ఉత్తర ఫ్రావిన్స్‌ మాజీ ముఖ్యమంత్రి సీవీ విఘ్నేశ్వరన్‌.. రజనీను కలిశారు. ఆ సమయంలో తలైవాను శ్రీలంక రమ్మని ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. కానీ రజనీతో భేటీ కావడం నిజమేనని, కానీ ఆయన్ను ఆహ్వానించలేదని విఘ్నేశ్వరన్‌ స్పష్టం చేశారు. రజనీలో ఆప్యాయత, నిరాడంబరత తదితర మంచి లక్షణాల్ని చూశానని, అలాంటి ఉత్తమ వ్యక్తితో భేటీ కావడాన్ని ఓ భాగ్యంగా భావిస్తున్నానని తెలిపారు.