మీ వంటింట్లో సోయాబీన్ (సోయా చిక్కుడు) నూనెను వాడుతున్నారా? లేదా సోయాబీన్ ఆయిల్‌తో తయారుచేసిన ఫాస్ట్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఆహారాన్ని ఆవురావురుమంటూ తింటున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. సోయాబీన్ నూనెను తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం వస్తుందని ఇప్పటివరకూ తెలుసు. అయితే, ఈ నూనెను తీసుకోవడం వల్ల మెదడులో జన్యుమార్పులు జరిగి ఆటిజం (బుద్ధిమాంద్యం), అల్జీమర్స్ (మతిమరుపు) వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా – రివర్‌సైడ్ (యూసీఆర్) శాస్త్రవేత్తల బృందం ఎలుకలపై ఈ పరిశోధన నిర్వహించింది. ఈ వివరాలు ‘జర్నల్ ఎండోక్రైనాలజీ’లో ప్రచురితమయ్యాయి. ఈ శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన పూనవ్‌ుజోత్ డియోల్ కూడా ఉన్నారు. సోయాబీన్ ఆయిల్, లినోలెయిక్ ఆమ్లం తగ్గించి శుద్ధీకరించిన సోయాబీన్ ఆయిల్, కొబ్బరి నూనెను పరిశోధకులు వేర్వేరుగా ఎలుకలకు ఆహారంగా ఇచ్చారు. ఆ తర్వాత పరిశోధన ఫలితాల్ని విశ్లేషించారు. సోయాబీన్ ఆయిల్, శుద్ధీకరించిన సోయాబీన్ ఆయిల్‌ను ఆహారంగా తీసుకున్న ఎలుకల మెదడుపై దుష్ప్రభావం ఒకేవిధంగా ఉన్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. సోయాబీన్ నూనెను తీసుకున్న ఎలుకల మెదడులోని హైపోథాలమస్ గ్రంథిపై ప్రభావం పడుతున్నట్టు వారు గమనించారు. శరీరంలోని కీలకమైన జీవక్రియలను ఈ గ్రంథి నియంత్రిస్తుంది. ‘హైపోథాలమస్ గ్రంథి జీవక్రియల ద్వారా శరీర బరువును నియంత్రిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమన్వయపరుస్తుంది. ప్రత్యుత్పత్తి, శారీరక పెరుగుదల, భావోద్వేగాల అదుపులో ఈ గ్రంథి చాలా కీలకం’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన మార్గరెటా తెలిపారు. సోయాబీన్ ఆయిల్ తీసుకున్న ఎలుకల మెదడులోని పలు జన్యువులు సక్రమంగా పనిచేయకపోవడాన్ని తాము గమనించినట్టు పరిశోధకులు తెలిపారు. సోయాబీన్ ఆయిల్ తీసుకోవడం వల్ల ప్రేమ, భావోద్వేగ హార్మోన్‌ను ప్రేరేపించే ఆక్సీటాసిన్ స్రావాలు హైపోథాలమస్ గ్రంథిలో క్రమంగా తగ్గుతున్నాయని వాళ్లు వెల్లడించారు. ఈ నూనె వల్ల మెదడులోని మరో 100కు పైగా జన్యువులపై కూడా ప్రభావం పడినట్టు చెప్పారు. ఈ ఆయిల్ తీసుకోవడం వల్ల జీవక్రియలపై ప్రభావం చూపడమే గాకుండా.. మెదడు కార్యకలాపాలపై కూడా ప్రభావం పడుతున్నదని, ఆటిజం, పార్కిన్సన్(నాడీ వ్యవస్థకు సంబంధించిన జబ్బు) వచ్చే ప్రమాదం ఉన్నట్టు పరిశోధకులు హెచ్చరించారు. సోయాబీన్ ఆయిల్ తీసుకోవడం వల్ల వచ్చే ఈ అనర్థాలు ఇప్పటివరకూ కేవలం ఎలుకల్లో మాత్రమే కనుగొన్నామని,మనుషుల్లో ఇలాంటి ప్రభావమే ఉంటుందని ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు చెప్పారు. సోయా ఆయిల్‌తో పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని వాళ్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలు కేవలం సోయాబీన్ ఆయిల్‌లోనే తాము గమనించామని, సోయామిల్క్, సోయా సాస్, టోఫు, ఇతర సోయా పదార్థాలను తీసుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయని తాము చెప్పలేమని వాళ్లు పేర్కొన్నారు.
సోయానూనెకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
Related tags :