* పార్లమెంట్ ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సీఏఏకి మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన ‘జన జాగరణ్ అభియాన్’ కార్యక్రమంలో ఆదివారం ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘‘సీఏఏని అమలు చేయబోమంటూ రాష్ట్రాలు తీర్మానం చేయొచ్చు. అది కేవలం ఓ రాజకీయ ప్రకటన మాత్రమే. కానీ అవి చట్టం అమలును ఆపలేవు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది’’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.
* తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. ఎన్టీఆర్ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానమే ప్రధాన అజెండాగా ఈ భేటీలో చర్చిస్తున్నారు. సభలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ రాజధాని తరలింపును ప్రక్రియను అడ్డుకునే అవకాశాలపై వ్యూహరచన చేస్తున్నారు.
* ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ భవనంపైకి ఇద్దరు రైతులు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది. తుళ్లూరు, నెక్కల్లు గ్రామాలకు చెందిన కొందరు రైతులు నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నిరసనకు దిగారు. అందులో ఇద్దరు 13 అంతస్తుల భవనంపైకి ఎక్కి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. రాజధాని తరలింపు అంశాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
* గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమరావతికి వ్యతిరేకంగా, అనుకూలంగా వచ్చిన ఓట్ల వివరాలు ఇవాళ సాయంత్రం వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు.
* భారత్‌లో విక్రయాలను నిలిపివేసిన అమెరికా కార్ల తయారీ సంస్థ జీఎం మోటార్స్ ఇండియా ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన గ్రేట్‌వాల్ మోటార్స్ అంగీకరించింది. ఈ ప్రస్తుతం చైనాలో అత్యధికంగా ఎస్‌యూవీలను విక్రయిస్తోంది ఈ సంస్థే. విదేశాల్లో మార్కెట్‌ను విస్తరించేందుకు గ్రేట్‌వాల్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి దీని కొనుగోలు పూర్తికావచ్చని భావిస్తున్నారు. దీనిని కొనుగోలు చేశాక.. భారత్‌లో కూడా గ్రేట్‌వాల్ వాహనాలను విక్రయాలను ప్రారంభించాలని భావిస్తోంది.
* నిర్భయ దోషులను రక్షించేందుకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోందని భాజపా ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగానే వారికి ఉరిశిక్ష పడకుండా రెండేళ్లుగా ఆలస్యం చేసిందని ఆ పార్టీ దిల్లీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. దిల్లీలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2017లో ఉరిశిక్ష విధిస్తే 2019 వరకు సమాచారం ఇవ్వకుండా ఆలస్యం చేశారని తివారీ అన్నారు. ఇప్పటి వరకు న్యాయ ప్రక్రియను అడ్డుకున్న ఆప్ ప్రభుత్వం ఇప్పుడు వారిని రక్షించాలని చూస్తోందని పేర్కొన్నారు.
* పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును రాష్ట్రాలు నిరాకరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఒకసారి చట్టంగా మారిన తర్వాత అమలుచేయాల్సిందేనని.. లేదంటే అది రాజ్యాంగ విరుద్ధ చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చని.. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచొచ్చన్నారు. రాష్ట్రాలు చట్టాన్ని అమలు చేయబోమని మొండికేస్తే తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
* రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెదేపా యువనేత పరిటాల శ్రీరామ్ అన్నారు. ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. అమరావతి ప్రాంతంలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో అసెంబ్లీలో తమకు అనుగుణంగా బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని చెప్పారు.
* ఏపీ రాజధానిలో మరో ఇద్దరి గుండె ఆగింది. అమరావతి పరిధిలోని వెలగపూడికి చెందిన అబ్బూరి అప్పారావు(55) గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి 7 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. మందడం గ్రామానికి చెందిన బెజవాడ సామ్రాజ్యమ్మ గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని అభివృద్ధికి ఈమెస్వచ్ఛంధంగా 20ఎకరాలు ఇచ్చారు. రాజధాని అమరావతి తరలిపోతుందని ఆవేదనతో మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
* మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తీవ్రంగా విఫలమయ్యారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని, సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి తెరాస అనేక సార్లు మద్దతిచ్చిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.
* మావోయిస్టు సాహిత్యం కలిగి ఉన్నారనే కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.చింతకింది కాశీంను నిన్న అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ ఉదయం హైకోర్టు సీజే నివాసంలో హాజరు పర్చారు. ఇటీవలే విరసం కార్యదర్శిగా ఎన్నికైన ఆయనను.. ఐదేళ్ల నాటి కేసులో ఇపుడు అరెస్టు చేయటం అప్రజాస్వామికమంటూ పౌరహక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది.
* రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతులను జగన్ చంపేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో ప్రభుత్వం రైతులను బలి తీసుకుంటుందని మండిపడ్డారు. రాజధాని అమరావతి కోసం జరుగుతున్న రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని లోకేశ్ అన్నారు.
* మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క.. సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ములుగు జిల్లా మేడారం చేరుకున్నారు. సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు.
* సాయిబాబా జన్మస్థానంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో శిర్డీ గ్రామస్థులు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ఆలయ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం భక్తులు భారీ ఎత్తున బాబా దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ‘సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్’ అన్ని ఏర్పాట్లు చేసింది. శిరిడీ సహా చుట్టుపక్క గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.
* దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’లో తాను నటించడం లేదని కన్నడ నటుడు కిచ్చా సుదీప్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో పోలీసు అధికారి పాత్రలో సుదీప్ నటించనున్నారంటూ, జనవరి 20 నుంచి ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నటుడు సుదీప్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు.
* దాదాపు రెండు దశాబ్దాలకు పైగా త్రిపురలో తలదాచుకుంటున్న ‘బ్రూ’ (రియాంగ్) జాతీయులకు ఉపశమనం లభించింది. 23 ఏళ్ల క్రితం మిజోరంలో ఘర్షణలతో పారిపోయి త్రిపురలో నివాసముంటున్న దాదాపు 30 వేలమంది ‘బ్రూ’ జాతీయులకు అక్కడే శాశ్వత నివాసం కల్పించాలని కేంద్రం, మిజోరం, త్రిపుర, బ్రూ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో వీరు త్రిపురలో అన్నిహక్కులు పొందనున్నారు.
* వికారాబాద్ జిల్లా పరిగి బీసీ కాలనీలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక(11)పై అదే కాలనీకి చెందిన సాయి(26) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లిన యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో బాలిక కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆరా తీయగా… విషయం వెలుగుచూసింది. కాలనీ వాసులు యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.