* దేశీయ చమురు రంగ దిగ్గజం రిలయన్స్ చమురు రిటైల్ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తోంది. రిలయన్స్‌కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్ పంపుల్లో విక్రయాలు డిసెంబర్ 31నాటికి రెండంకెల వృద్ధిరేటును సాధించాయి. డీజిల్ విక్రయాల్లో 11శాతం వృద్ధిని.. పెట్రోల్ విక్రయాల్లో 15శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం చమురు రిటైల్ పరిశ్రమ వృద్ధిరేటు డీజిల్‌లో 0.2శాతం, పెట్రోల్‌లో 7.1శాతంగా ఉన్నాయి. దీంతో పోలిస్తే రిలయన్స్ భారీ వృద్ధిరేటును సాధించినట్లే లెక్క.
* భారత్‌లో విక్రయాలను నిలిపివేసిన అమెరికా కార్ల తయారీ సంస్థ జీఎం మోటార్స్ ఇండియా ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన గ్రేట్‌వాల్ మోటార్స్ అంగీకరించింది. ఈ ప్రస్తుతం చైనాలో అత్యధికంగా ఎస్‌యూవీలను విక్రయిస్తోంది ఈ సంస్థే. విదేశాల్లో మార్కెట్‌ను విస్తరించేందుకు గ్రేట్‌వాల్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి దీని కొనుగోలు పూర్తికావచ్చని భావిస్తున్నారు. దీనిని కొనుగోలు చేశాక.. భారత్‌లో కూడా గ్రేట్‌వాల్ వాహనాలను విక్రయాలను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే జీఎం ప్లాంట్‌ను కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ మొత్తం విలువ 250 మిలియన్ డాలర్ల నుంచి 300 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా.
‘‘భారత మార్కెట్ చాలా బలమైంది. ఇక్కడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు భారత్ పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. భారత మార్కెట్లో అడుగుపెట్టడం గ్రేట్‌వాల్ మోటార్‌కు గొప్ప ముందడుగు.’’ అని సంస్థ గ్లోబల్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ లీజింగ్షాంగ్ వెల్లడించారు. ప్రస్తుతం చైనాలో ఎస్యూవీ మార్కెట్లో లీడర్‌గా ఉన్న ఈ సంస్థ హవల్, ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్లతో భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఫిబ్రవరిలో జరిగే దిల్లీ ఆటోషోలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం మందకొడిగా ఉండటంతో కొత్త మార్కెట్లలోకి ప్రవేశించి విక్రయాలు పెంచుకోవాలనే వ్యూహాన్ని గ్రేట్‌వాల్ అనుసరిస్తోంది. దీంతో 2026నాటికి ప్రపంచలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించే అవకాశం ఉన్న భారత్‌ను ఎంచుకొంది.
* ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ జీవిత బీమాతో కూడిన మరో ప్రీపెయిడ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. రూ.2లక్షల జీవిత బీమాతో కూడిన రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆదివారం ప్రకటించింది.‘‘రూ.179 ప్లాన్ గడువు 28 రోజులు. 2జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. వీటితో పాటు భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ అందించే జీవిత బీమా ఈ ప్యాక్‌తో పాటు లభిస్తాయి’’ అని ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌ను పరిమితంగా వినియోగించే వారిని, ఫీచర్ ఫోన్లు వినియోగించే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 18-54 వయస్సు కలిగిన వారికి జీవిత బీమా వర్తిస్తుంది. ఇందుకోసం ఎలాంటి పత్రాలు గానీ, వైద్య పరీక్షలు గానీ అవసరం లేదని ఎయిర్టెల్ తెలిపింది. బీమాకు సంబంధించిన పాలసీ పత్రాలను తక్షణమే డిజిటల్ రూపంలో పంపిస్తామని, అవసరమైతే కాగితం రూపంలోనూ అందిస్తామని పేర్కొంది. జీవిత బీమాతో కూడిన ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లకు అనూహ్య స్పందన వస్తోందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వంత్ శర్మ పేర్కొన్నారు.
* అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం రూ.7,416.50 కోట్లుగా నమోదైంది. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఆర్జించిన రూ.5,585.90 కోట్లతో పోలిస్తే లాభంలో 32.8 శాతం వృద్ధి ఉంది. మొత్తం ఆదాయం కూడా రూ.30,811.27 కోట్ల నుంచి రూ.36,039 కోట్లకు పెరిగిందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.12,576.80 కోట్ల నుంచి 19.9 శాతం వృద్ధితో రూ.14,172.90 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం కూడా రూ.4,921.01 కోట్ల నుంచి రూ.6,669.30 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 4.2 శాతం వద్ద స్థిరంగానే ఉంది. సమీక్ష త్రైమాసికంలో మొత్తం రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు 1.42 శాతానికి పెరిగాయి. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో ఇవి 1.38 శాతంగా ఉన్నాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 0.42 శాతం నుంచి 0.48 శాతానికి చేరాయి. మొత్తం కేటాయింపులు రూ.2,211.53 కోట్ల నుంచి రూ.3,043.56 కోట్లకు పెరిగాయి. ఇందులో ఎన్పీఏల కోసమే రూ.2,883.60 కోట్లను బ్యాంకు కేటాయించింది. డిపాజిట్లు 25.2 శాతం వృద్ధితో రూ.10,67,433 కోట్లుగా నమోదుకాగా.. రుణాలు 19.9 శాతం పెరిగి రూ.9,36,030 కోట్లకు చేరాయి.
* బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం లభించింది. తద్వారా ఈ పురస్కారాన్ని అందుకున్న నాలుగో భారత వ్యక్తిగా నిలిచారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జి, మదర్థెరిసాలు గతంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వాణిజ్య, విద్యాపరమైన సంబంధాల బలోపేతంలో కృషి చేసినందుకు గాను మజుందార్ షాకు ఈ పురస్కారం లభించింది. భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ హరిందర్ సింధు ఈ పురస్కారాన్ని కిరణ్ మజుందార్ షాకు అందజేసినట్లు బయోకాన్ సంస్థ ఇక్కడ ప్రకటించింది.