అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల మొదటి రోజు వాడీవేడిగా జరుగుతోంది. పరిపాలన వికేంద్రీకరణపై పెట్టిన బిల్లుపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతుండగా స్పీకర్ కలుగజేసుకుని సమయం మించిపోతోందని.. ముగించాలని కోరారు. ఇంకా సమయం కావాలని చంద్రబాబు కోరారు. ఈలోపు సీఎం జగన్ కలుగజేసుకుని ప్రతిపక్ష నేతపై అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు ఇప్పటికే 50 నిమిషాల సమయం ఇచ్చారని.. ఇంకెంతసేపు కావాలని ప్రశ్నించారు. ప్రస్తుతం తెదేపాకు ఉన్న 21 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఇప్పటికే మాట్లాడారని చెప్పారు. తమకు ఉన్న 151 మందిలో కేవలం ఏడుగురు మాత్రమే మాట్లాడారన్నారు. అయినప్పటికీ ఇంకా సమయం కావాలని చంద్రబాబు అడగడం సరికాదని చెప్పారు. కొంత సమయం ఇచ్చి త్వరగా ముగించేలా చూడాలని స్పీకర్ తమ్మినేనికి సీఎం చెప్పారు. ఆ తర్వాత ఎంత సమయం కావాలని అడగ్గా మరో గంట కావాలని తెదేపా సభ్యులు కోరడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ మీ జాగీరు కాదని.. ఇది అందరిదని వ్యాఖ్యానించారు. కనీసం 30 నిమిషాలైనా కావాలని చంద్రబాబు కోరగా.. స్పీకర్ 15 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు.
గంట అడిగితే పావుగంట ఇచ్చారు

Related tags :