బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకొంటున్న విజయ్ మాల్యా కనీసం ఒక్క పైసా కూడా చెల్లించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నారిమన్ పేర్కొన్నారు. మాల్యాకు సంబంధించిన ఓ పిటిషన్ విచారణ నుంచి ఆయన తప్పుకొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఆస్తుల జప్తును ఆపాల్సిందిగా కోరుతూ మాల్యా వేసిన పిటిషన్ విచారణను న్యాయస్థానం విచారణ జరుపుతోంది. దానికి సంబంధించిన విచారణను ప్రస్తుతం చీఫ్ జస్టిస్ బోబ్డేకి బదిలీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ నారిమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాల్యా పిటిషన్ విచారణ సమయంలోను కేంద్రం తరఫున హాజరైన న్యాయవాది తుషార్ మెహతా కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రుణాలు చెల్లిస్తామని మాల్యా, అతడి కంపెనీలు కొన్నేళ్లుగా చెబుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించింది లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. తనపై ఉన్న మనీలాండరింగ్ కేసు విచారణపై స్టే విధించాల్సిందిగా మాల్యా వేసిన పిటిషన్‌ను గత నెల బాంబే హైకోర్టు కొట్టివేసింది. దాదాపు రూ.9వేల కోట్ల మేర రుణాలను మాల్యా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. దీంతో 2019 జనవరిలో ముంబయిలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
మాల్యా ఒక్క రూపాయి కూడా కట్టలేదు
Related tags :