* తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో అమలు చేయనున్న రబీ రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేసింది. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. 2019-20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు కోసం 12,862 కోట్లు కేటాయించగా.. ఖరీఫ్‌లో రూ.6,862 కోట్లు మంజూరు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.
* భాజపా జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయాధ్యక్షుడిగా నడ్డా ఎన్నిక కావడం గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. భాజపా జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మోదీ పాల్గొని మాట్లాడారు. ‘ప్రజల ఆగ్రహానికి గురై ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు అసహనానికి గురవుతున్నారు. దాన్ని వాళ్లు అధికార పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తూ చూపించుకుంటున్నారు’ అని మోదీ అన్నారు.
* రాజధాని గ్రామాల పర్యటనకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం గేటు వద్దే ఆయన్ను అడ్డగించారు. పవన్‌తో పోలీసు అధికారులు చర్చలు జరుపుతున్నారు. పర్యటనకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పవన్ పర్యటన నేపథ్యంలో భారీగా కార్యకర్తలు, నేతలు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
* తెలంగాణలో పుర ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగించాయి. ఈనెల 22న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 9 నగర పాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయొద్దని.. సభలు, సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేసింది.
* అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టయిన రైతులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెదేపా ఎమ్మెల్సీలు పరామర్శించారు. అమరావతి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారితో మాట్లాడారు. తమను అక్రమంగా అరెస్ట్ చేశారని.. మహిళల్ని కూడా కొట్టారని రైతులు లోకేశ్‌తో చెప్పారు. పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌లో పలువురు రైతులు గాయాల పాలయ్యారని తెలిపారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ రైతులు అధైర్య పడొద్దన్నారు. రైతుల తరఫున తాము పోరాడతామని వారికి హామీ ఇచ్చారు.
* దక్షిణ భారత్‌లో తొలి 222 టైగర్‌షార్క్స్ స్క్వాడ్రన్‌ని వాయుసేన ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాన్ని తంజావూరు వైమానిక స్థావరంలో చేర్చారు. బ్రహ్మోస్ క్షిపణిని మోయగలిగేలా తీర్చిదిద్దిన ఈ విమానానికి వాటర్ కేనన్ సెల్యూట్‌తో స్వాగతం పలికారు. ఈ యుద్ధ విమానం వాయుసేనతో పాటు నావికా దళానికీ సేవలందించే అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణుల్ని మోసుకెళ్లగలదు.
* వివిధ అంతర్జాతీయ పరిణామాలతో ఇటీవల పెరిగిన ఇంధన ధరలు మెల్లగా దిగివస్తున్నాయి. ఇరాన్ కమాండర్ సులేమానీపై అమెరికా దాడి ఫలితంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముడి చమురు ధరను విపరీతంగా పెంచేశాయి. కాగా, ప్రస్తుతం పరిస్థితి చల్లబడిన నేపథ్యంలో గత ఐదు రోజులుగా దేశీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా సోమవారం పెట్రోల్ ధర 10-12 పైసలు తగ్గగా, డీజిల్ ధరలో తగ్గుదల 19-20 పైసలుగా ఉంది.
* అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సోమవారం తాజా వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (886) పాయింట్లతో యథావిధిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఓపెనర్ రోహిత్‌శర్మ (868) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్(829) పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా (764) పాయింట్లతో తొలి స్థానాన్ని కాపాడుకున్నాడు.
* భారత్‌లో తమ వస్తువులను సరఫరా చేయటానికి ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్నామని ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. 2025 కల్లా దేశంలో తమ డెలివరీలు 10,000 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా జరుగుతాయని సంస్థ వివరించింది. ఈ ఎలక్ట్రిక్ డెలివరీ విధానం 2020లో దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణె, నాగ్‌పూర్, కోయంబత్తూర్‌తో సహా 20 భారతీయ నగరాలలో అమలులోకి వస్తుంది.
* బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకొంటున్న విజయ్ మాల్యా కనీసం ఒక్క పైసా కూడా చెల్లించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నారిమన్ పేర్కొన్నారు. మాల్యాకు సంబంధించిన ఓ పిటిషన్ విచారణ నుంచి ఆయన తప్పుకొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఆస్తుల జప్తును ఆపాల్సిందిగా కోరుతూ మాల్యా వేసిన పిటిషన్ విచారణను న్యాయస్థానం విచారణ జరుపుతోంది. దానికి సంబంధించిన విచారణను ప్రస్తుతం చీఫ్ జస్టిస్ బోబ్డేకి బదిలీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ నారిమన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
* భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దిల్లీలోని భాజపా కార్యాలయానికి చేరుకున్న పార్టీ ముఖ్య నాయకులు నడ్డాను అధ్యక్షుడిగా ప్రతిపాదించారు. దీంతో ఆయన ఎలాంటి పోటీ లేకుండా భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు సీనియర్ నాయకులు రాధామోహన్‌సింగ్ అధికారికంగా ప్రకటించారు. గతంలో భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేవలందించిన నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
* లక్ష కోట్ల రూపాయలతో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఐదేళ్లలో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి కన్నబాబు అన్నారు. సినిమా డైరెక్టర్లతో సెట్టింగులు వేయించారని, డిజైన్ల పేరిట నాలుగేళ్ల కాలం వృథా చేశారని ఆయన ఆరోపించారు. దీంతో అమరావతి గ్రాఫిక్స్ సిటీగా మిగిలిపోయిందన్నారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సూపర్ కేపిటల్ వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పింది. గ్రీన్‌ఫీల్డ్, ఉన్న నగరం అభివృద్ధి చేయడం, పాలనా వికేంద్రీకరణ చేయడం వంటి మూడు ఐచ్ఛికాలు ఇచ్చింది’’ అని తెలిపారు.
* రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో భూములు ఇచ్చిన రైతుల్లో 24 మంది చనిపోయారని.. వారి మృతికి సంతాప సూచకంగా సభలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించాలని తెదేపా డిమాండ్ చేసింది. ఈ విషయంలో స్పీకర్ అనుమతివ్వాలని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు కోరారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిపై అసత్య ప్రచారాలు చేసిందని రామానాయుడు ఆరోపించారు. ఏ జీవో ప్రకారం బోస్టన్ గ్రూప్ కమిటీని నియమించారని ఆయన ప్రశ్నించారు.
* ఏపీలో గ్రూప్-1 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు జరగాల్సిన ప్రధాన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్షల తేదీలను వచ్చే సోమవారం ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు తెలిపారు. అభ్యర్థుల కోరిక మేరకే పరీక్షలను వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు.
* ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీఆర్‌డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ చేసిన సిఫార్సులను అప్పటి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఆ రోజు సభలో బలముందని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి అంటే 13 జిల్లాల అభివృద్ధి అని.. 5 కోట్ల మంది అభివృధ్ది చెందాలని ఈ బిల్లును తీసుకొచ్చాం’ అని బొత్స స్పష్టంచేశారు.
* పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేయబోమనే అధికారం రాష్ట్రాలకు లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా స్పష్టం చేశారు. సీఏఏపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్యాంగ పరంగా చూసుకుంటే పార్లమెంటులో ఒకసారి చట్టంగా మారిన తర్వాత దాన్ని కాదనే అధికారం రాష్ట్రాలకు లేదు. కానీ, న్యాయపరంగా మాత్రం దాన్ని వ్యతిరేకించవచ్చు’ అని ఆయన అన్నారు.
* వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఇలాంటి ఉన్నతమైన నిర్ణయం ఉన్నతమైన వ్యక్తులకే వస్తాయని సీఎం జగన్‌ను కొనియాడారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.4 కోట్లకు ఇచ్చి.. తన అనుచరులకు రూ.50 లక్షలకు వందలాది ఎకరాలు చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు.
* నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌ను అంటూ దోషి పవన్ గుప్తా వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దోషి పవన్ గుప్తా వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
* తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్‌లో జరిగిన అభివృద్ధి కళ్లముందే కనిపిస్తోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రోడ్లు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, భూగర్భ డ్రైనేజీ, పార్కులతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. నగర ప్రజలు విజ్ఞులని..అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ స్థానం మజ్లిస్‌కు ఇవ్వబోమని.. ఆ అవసరం కూడా తమకు లేదన్నారు.