మతి స్థిమితం లేని వ్యక్తి చేసిన పని పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. ఆ వ్యక్తి ఏకంగా పెట్రోలింగ్ వాహనాన్నే ఎత్తుకెళ్లి ప్రమాదానికి గురిచేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ వాహనాన్ని తీసుకెళ్లే ధైర్యం ఎవరికి ఉంటుందనే దీమాతో తాళాలు వాహనానికే వదిలేసిన పోలీసులు.. చివరకు కంగారుతో పరుగులు తీయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి నక్కపల్లి ఎస్సై ఏఎస్‌వీఎస్ రామకృష్ణ కథనం ప్రకారం..అమరావతికి వెళ్లే తెదేపా నాయకులు, ఆందోళనకారులను అడ్డుకోడానికి ఉన్నతాధికారుల ఆదేశాలతో నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లో ఉన్న పెట్రోలింగ్ వాహనాల సిబ్బందితో నక్కపల్లి ఎస్సై ఆదివారం రాత్రి కాగిత టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. తమ వాహనాలను పక్కనబెట్టి వీరంతా వాహన తనిఖీలో మునిగిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కొద్దిసేపటికి ఓ వ్యక్తి పాయకరావుపేటకు చెందిన మొబైల్ నడుపుతూ తుని వైపు వెళ్లిపోయాడు. ఈ సమయంలో వాహనం ఎదురుగా ఉన్న కానిస్టేబుల్‌కు చెందిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఈడ్చుకుని వెళ్లిపోయాడు. దగ్గర్లోనే పోలీసులు ఉన్నా, ఈ విషయాన్ని గమనించలేదు. కొద్దిసేపటికి వాహనం లేకపోవడంతో చూసి కంగారు పడ్డారు. దగ్గర్లో ఉన్న దుకాణదారులతో మాట్లాడగా తుని వైపు వాహనం వెళ్లినట్లు తెలుసుకున్నారు. దీంతో తమ వాహనాలతో అదే మార్గంలో వెళ్లారు. గొడిచెర్ల కూడలికి చేరగా, జాతీయ రహదారి పక్కన పెట్రోలింగ్ వాహనం బోల్తా పడిఉండటాన్ని గుర్తించారు. దీన్ని బయటకు తీశారు. వాహనాన్ని తీసుకెళ్లిన వ్యక్తి ఇక్కడే ఉండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తే నిందితుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించి, సంఘటనకు కారణమైన వ్యక్తిని మానసిక వైద్యాలయానికి తరలిస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులైనా వాహన తాళాలను తీయకుండా వదిలేయడం సరికాదని సూచిస్తున్నారు. వాహనం నడిపింది మతిస్థితిమితం లేని వ్యక్తి కావడం.. అతను వెళ్లే సమయంలో రహదారులపై ఎక్కడా జన సంచారం లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. అదే పగటి వేళల్లో అయితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.
అమరావతి పోలీసు పెట్రోలింగ్ వాహనం చోరీ
Related tags :