Business

ఇక డ్యుటీఫ్రీలో ఒక లీటర్ మాత్రమే

Indian Govt To Restrict Duty Free Liquor Purchase To 1Liter Only

బడ్జెట్‌ 2020లో మందుబాబుల నిషా తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలుచేస్తోంది. ఇప్పటి వరకు ఎయిర్‌ పోర్టుల్లో డ్యూటీ ఫ్రీ షాపుల్లో రెండు లీటర్ల మద్యాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. దీనిని ఒక లీటర్‌కు కుదించాలని కేంద్ర వాణిజ్య వ్యహారాల శాఖ ప్రతిపాదనలను పంపించింది. దీంతోపాటు డ్యూటీ ఫ్రీ షాపుల్లో సిగరెట్ల విక్రయం పై కూడా ఆంక్షలు కఠినతరం చేయనున్నారు. ముఖ్యంగా అత్యవసరం కాని వస్తువుల దిగుమతిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ‘‘అవనసరమైన దిగుమతులకు కళ్లెం వేసేందుకు మా శాఖ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే 200 రకాల వస్తువులను దిగుమతి అవసరం లేనివిగా గుర్తించాము. వీటిపై సుంకాలను పెంచాలని భావిస్తున్నాము’’ అని వాణిజ్య వ్యవహారాల శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. భారత్‌లో తయారీ రంగానికి ఊతం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు వాణిజ లోటును కుదించే అవకాశం ఉంది. వాణిజ్య శాఖ ప్రతిపాదనను అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ ఎయిర్‌పోర్టు ఆపరేటర్స్‌ వ్యతిరేకించింది. ఈ సంఘం ప్రభుత్వానికి పంపిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో మద్యం పరిమితిని 2 లీటర్ల నుంచి 4 లీటర్లకు పెంచాలని కోరింది. ‘‘మేము మలేషియా, సింగపూర్‌, దుబాయ్‌లోని డ్యూటీ ఫ్రీ షాప్స్‌తో పోరాడాల్సి వస్తోంది. ప్రయాణికులు వేరే ప్రదేశాల్లో డ్యూటీఫ్రీ షాపులవైపు మొగ్గితే మేము నష్టపోవాల్సి ఉంటుంది. మన దేశీయులు విదేశాల్లో డ్యూటీఫ్రీ షాపుల్లో కొనుగోళ్లు చేయడం మనకు నష్టదాయకం. అంతేకానీ, భారత్‌లో కొనుగోలు చేస్తే ఆందోళన చెందకూడదు’’ అని చెబుతోంది. దీంతోపాటు డ్యూటీఫ్రీ షాప్స్‌లో బ్యాగేజీ అలవెన్స్‌ను రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచాలని కోరుతోంది. కస్టమ్స్‌ చట్టం 1962 సెక్షన్‌ 58 ప్రకారం ఏర్పాటు చేసిన ప్రైవేటు వేర్‌హౌస్‌ల కింద డ్యూటీఫ్రీ షాపులకు లైసెన్స్‌ ఇస్తారు. ప్రస్తుతం వీటి వ్యాపారం విలువ భారత్‌లో 200 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది 2025 నాటికి 800 మిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని బెంగళూరుకు చెందిన రెడ్‌సీర్‌ కన్సల్టెంగ్‌ సంస్థ పేర్కొంది. భారత డ్యూటీఫ్రీ మార్కెట్లో 80 శాతం మంది దేశీయ కస్టమర్లే ఉండటం విశేషం. విదేశాలతో పోల్చుకుంటే మనది చాలా భిన్నమైన మార్కెట్‌.