NRI-NRT

సింగపూర్‌లో రెండు రోజుల సంక్రాంతి

Singapore Telugu Samajam Celebrates Two Day Sankranthi 2020

సీంగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. మొదటిరోజున వామనగుంటలు, దాడి, పచ్ఛీసు, అష్టాచమ్మా, పరమపదసోపానం, గోళీలాట, బొంగరాలు , గాలిపటాలు మొదలగు సంప్రదాయ ఆటలు, ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, సంక్రాంతి లక్ష్మిపూజ , హరిదాసు, గొబ్బిళ్ళ ఆటపాటల కోలాహలంతో ప్రారంభం అయింది. స్ధానిక బాలబాలికలు, యువతీ యువకులు వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. రాజమండ్రి నుంచి విచ్చేసిన గాయనీ గాయకులు నవీన్, భవ్యల సంగీత విభావరి ఉర్రూతలూగించింది. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలను అందించారు. సింగపూర్ తెలుగు 2020 క్యాలెండెర్ ను ఆవిష్కరించారు. సంక్రాంతి తెలుగు పిండివంటలు, వంటకాలతో కూడిన తెలుగు సాంప్రదాయ భోజనం ఆకట్టుకొంది. రెండోరోజు ప్రముఖ శాస్త్రీయ లలిత సంగీత గాయకులు, స్వరకర్త గరికపాటి వెంకట ప్రభాకర్ రాగావధానం సింగపూర్ వాసులను అలరించింది. అనేక రాగాలలో పృచ్ఛకులు అడిగిన అంశాలతో ప్రభాకర్ అలవోకగా గానంతో సమాధానాలు తెలిపారు. రసభావం, తాళప్రక్రియలు, రాగ, భావ మార్పులు, పద్యం, శ్లోకం తదితర అంశాలతో రక్తికట్టించారు. కార్యవర్గం ప్రభాకర్ ని ఘనంగా సన్మానించారు. ఈ అవధాన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నవారికి నరాల సిద్దారెడ్డి, మల్లిక్ పాలెపు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత రెండేళ్ల కార్యక్రమాలను విశ్లేషించి, రానున్న రెండేళ్లు సభ్యుల తోడ్పాటు అందిస్తే సొంత భవనాన్ని రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్రదీప్ సుంకర, శ్రీనివాసరెడ్డి పుల్లన్నగారి, కార్యదర్శి సత్య చిర్ల తదితరులు వేడుకల విజయవంతానికి కృషి చేశారు.