అమరావతి భూముల కొనుగోలు కేసులో ఏపీ సీఐడీ మాజీ మంత్రులపై కేసు నమోదు చేసింది. రాజధాని ప్రాంతంలో దళితుల నుంచి మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, పీ నారాయణ బలవంతంగా భూములు కొనుగోలు చేశారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. దీంతో అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి సీఐడీ విచారణ కీలక మలుపు తిరిగింది. మంత్రులు ఎక్కడ, ఎవరి పేరుతో ఎంత మొత్తంలో భూములు కొనుగోలు చేశారనే అంశం విచారణలో వెలుగులోకి రానుంది.అమరావతిలో దళిత మహిళల నుంచి భూములు కొనుగోలు చేశారని ఎఫ్ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. అయితే వారు ఇష్టంతో కాకుండా బలవంతంగా భూములు కొనుగోలు చేశారని వివరించింది. దీనికి సంబంధించి మాజీ మంత్రులు పుల్లారావు, నారాయణపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నది. వారిద్దరూ నేరపూరిత కుట్ర చేశారని, మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.మరోవైపు ల్యాండ్ పూలింగ్‌పై సీఐడీ విచారణ కొనసాగుతోంది. రాజధాని ప్రాంతంలో 796 తెల్లరేషన్ కార్డుదారులపై కూడా కేసు నమోదు చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారు ఎకరం రూ.3 కోట్లు పెట్టి భూమి ఎలా కొనుగోలు చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో తెల్లరేషన్ కార్డు వారు కొనుగోలు చేసిన భూముల విలువ రూ.300 కోట్ల పై మాటే అని సీఐడీ గుర్తించింది. ఈ మేరకు రేషన్ కార్డుదారులపై కేసు నమోదు చేసి.. నగదు ఎక్కడినుంచి తీసుకొచ్చారనే అంశంపై కూడా ఆరాతీస్తున్నారు.ఆ భూములు ఎవరి కోసం కొనుగోలు చేశారు..? నగదు ఎవరి ఇచ్చారు అనే అంశంపై కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. భూముల కొనుగోలుకు సంబంధించి నాలుగు బృందాలు విచారిస్తున్నాయి. మాజీ మంత్రులపై క్రిమినల్ కేసు, తెల్లరేషన్ కార్డుదారులపై విచారణ కోసం టీమ్స్ పనిచేస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
తెదేపా మాజీ మంత్రులపై సీఐడీ కేసులు
Related tags :