DailyDose

ఈ ప్రజాపోరు ఆగదు-రాజకీయం

Chandrababu Says Capital Protests Won't Stop-Telugu Political News

* రాజధాని కోసం పోరాటం ఆగదని తెదేపా అధినేత చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. రాయలసీమకు ఎవరు ఏమి చేశారో, ఒక్కసారి చరిత్ర చూసుకోవాలని వైకాపా నేతలకు సూచించారు. కష్టపడి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తే.. వాటిని వెనక్కి పంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్‌ సంస్థపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, ధైర్యముంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ప్రజాధనాన్ని వృథా చేయవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.
*అడ్డంకులు ఎదురైనా అమలుచేస్తాం: బొత్స
మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం దారుణమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…చంద్రబాబు నాయుడు చెప్పినట్టే మండలి ఛైర్మన్‌ వ్యవహరించారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదరైనా, కుట్రలు చేసినా తమ ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పంపిన బిల్లును అడ్డుకోవడం విచారకరమన్నారు. మండలిలో తెదేపా ఎమ్మెల్సీల తీరు అభ్యంతరకరమన్నారు. ఈ పరిణామాల వల్ల కొంత జాప్యం జరగొచ్చు కానీ…అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నది చంద్రబాబు ఆలోచన అని బొత్స ఆరోపించారు
*ప్రభుత్వానివి అనాలోచిత నిర్ణయాలు: అశోకగజపతిరాజు
రాజధాని మార్పు విషయంలో ప్రభుత్వానివి అనాలోచిత నిర్ణయాలని టీడీపీ సీనియర్ నేత అశోకగజపతిరాజు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఎదురైన పరిస్థితులు నిన్న ఎదురైయ్యాయన్నారు. భూములు ఇచ్చిన రైతుల త్యాగానికి అర్ధం లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు మూడో వంతు రాజధాని ఇస్తే స్వాగతించాలా? అని ప్రశ్నించారు. పోలవరం ఆపేసి.. విశాఖకు నీళ్లు ఇస్తామంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. పెట్టుబడిదారులు వస్తే మూడు చోట్ల తిరగాలా? అంటూ అశోకగజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
*ఉలిక్కిపడుతున్న సీఎం జగన్: వర్ల రామయ్య
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతీ విషయానికి ఉలిక్కిపడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి తెలుగువాడి గుండెల్లో రాజధాని మంట రగులుతోందని అన్నారు. న్యాయవాది ముకుల్‌ రోహత్గీకి ప్రభుత్వం రూ. 5 కోట్లు విడుదల చేసిందని, ప్రజల సొమ్ముతో ప్రజలను ఓడించాలని జగన్‌ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్‌ తన సొంత కేసులను కూడా ముకుల్‌ రోహత్గీ వాదించారని, జగన్‌ కేసులకు కూడా కలిపి ముకుల్‌ రోహత్గీకి మొత్తం రూ.5 కోట్ల ప్రజాధనం ఇచ్చారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
* అమెరికా కూడా మత రాజ్యమే భారత్‌ లౌకిక దేశం- రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ శాఖ మంత్రి
భారత్‌లో అన్ని మతాలు సమానం. ఏ మతం పట్లా వివక్ష ఉండదు. అలా చేయాల్సిన అవసరం ఏముంది? అందుకే మనది లౌకిక దేశంగా విరాజిల్లుతోంది. పాకిస్థాన్‌ మత రాజ్యంగా ప్రకటించుకుంది. అమెరికా కూడా మత రాజ్యమే. మన దేశంలో అన్ని మతాల వారు ఓ కుటుంబంలా ఉంటారు.
* చంద్రబాబు, లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపినందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు రాజధాని గ్రామాల రైతులు, మహిళలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును గజ మాలతో సత్కరించారు. ‘జై అమరావతి, జై చంద్రబాబు’ అంటూ నినాదాలు చేశారు. లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలిలో అద్భుతంగా పోరాడారంటూ కొనియాడారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీలను రైతులు అభినందించారు. మండలిలో రాజ్యాంగ స్ఫూర్తిని నిలిపారంటూ రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
*శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలకు నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన దౌర్జన్యం విషయంలో తదుపరి కార్యాచరణపై టీడీఎల్పీ భేటీలో చర్చించనున్నారు. తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని టీడీపీ ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ చైర్మన్‌ షరీఫ్‌ తన నిర్ణయం ప్రకటించిన వెంటనే శాసనమండలిలో చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటనలు చోటుచేసుకున్నాయి.
*శాసనమండలిలో జరిగిన పరిణామాలపై తెదేపా సీనియర్‌ నేత, మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సెలెక్ట్‌ కమిటీకి బిల్లు వెళ్లాక ఆర్డినెన్స్‌ ఇవ్వడం అసాధ్యమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు ఇది విరుద్ధమన్నారు. ‘‘నిన్న మేం అడిగిన సెలెక్ట్‌ కమిటీ మండలికి సంబంధించి మాత్రమే. జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ అడగలేదు. జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ అడిగి ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందులో సభ్యులుగా ఉంటారు. నేను సెలెక్ట్‌ కమిటీకి ఛైర్మన్‌గా కూడా పనిచేశా. సెలెక్ట్‌ కమిటీ ఏర్పడ్డాక ప్రజాభిప్రాయం కూడా తీసుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకోటానికి సెలెక్ట్‌ కమిటీకి తగినంత సమయం అవసరం. ఈ ప్రక్రియ ముగియటానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. సెలెక్ట్‌ కమిటీ నిర్ణయానికి కనీస సమయం 3నెలు. దీని అర్ధం 3 నెలల్లోపు ఇమ్మని కాదు. మండలి రద్దుకు మేం ఎప్పుడూ బాధపడం, భయపడం కూడా. నిన్న సభలోకి మంత్రులు తాగి వచ్చారు. లోకేశ్‌ను కొట్టే ప్రయత్నం చేశారు. సభలో ఎప్పుడూ చూడని పరిణామాలను నిన్న మంత్రులు ప్రదర్శించారు’’ అని యనమల తెలిపారు.
*తెరాసకు దీటైన పోటీ ఇచ్చాం-భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
రాష్ట్ర ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని గొప్పలుచెప్పుకున్న తెరాస నేతలు.. పుర ఎన్నికల పోలింగ్ రోజున పెద్దఎత్తున అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఈ దఫా కాషాయజెండా రెపరెపలాడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయిందని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలాగైనా గెలవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఆ పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు ఓటర్లనూ ప్రలోభాలకు గురిచేశారన్నారు.
*భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకున్న ఎంపీ సంజయ్
తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు రెండు రోజుల కిందట ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రతను ఉపసంహరించుకుని వెనక్కి పంపినట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు కరీంనగర్లో నిర్వహించిన పుర ఎన్నికల ప్రచారంలో సంజయ్ మాట్లాడుతూ.. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి వస్తే దానికి కరీంనగర్ పోలీసు కమిషనరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. రెండు రోజుల ముందు ప్రచార సమయంలో రాళ్లదాడి జరిగిందని తెలిసినా ప్రజాప్రతినిధినైన తనను సీపీ ఒక్క మాటా అడగలేదన్నారు. అంతే కాకుండా దాడి జరగలేదంటూ సీపీ ప్రకటన ఇవ్వడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎంపీపై ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవమంటూ పోలీసు కమిషనర్ ఒక ప్రకటనను విడుదల చేశారు.
*అమరావతి కోసం త్యాగాలకు సిద్ధం-మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి ప్రజా రాజధాని కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. 3 రాజధానుల నిర్ణయానికి నిరసనగా విజయవాడ సమీపంలోని గొల్లపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం 4 వేల నల్ల బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో 36 రోజులుగా మహిళలు, రైతులు నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. ఆవేదనతో 25 మంది రైతులు, కూలీలు చనిపోతే ముఖ్యమంత్రి, మంత్రులెవ్వరూ పరామర్శకు కూడా వెళ్లలేదని తెలిపారు. సచివాలయానికి మాత్రం ముఖ్యమంత్రి వేరొక మార్గంలో డమ్మీ కాన్వాయ్తో వెళ్తున్నారన్నారు.
*పాత పథకాలకు కొత్త పేర్లు: తులసిరెడ్డి
పాత ప్రభుత్వ పథకాలకు కొత్త పేర్లు పెట్టి నిధులు విడుదల చేయకుండా వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. అమ్మఒడి, మనబడి, నాడు-నేడు, విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ పాత పథకాలేనని తెలిపారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నవరత్నాల్లో మూడోదైన అమ్మ ఒడికి 2019-20 బడ్జెట్లో రూ.6,420 కోట్లు కేటాయించారు. కానీ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయీ విడుదల చేయకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి నిధులు మళ్లించారు.
*షరీఫ్పై బొత్స ఆగ్రహం!
శాసన మండలిలో నిర్ణయం ప్రకటించి బయటకు వచ్చి కారెక్కడానికి వెళ్లే సమయంలో ఛైర్మన్ ఎంఏ షరీఫ్పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. తనకున్న విచక్షణాధికారాలతో బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడంపై నిలదీశారు. దీంతో ఛైర్మన్ మౌనంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన ద్వారానికి అడ్డుగా నిల్చుని ఆగ్రహంతో ఊగిపోతూ షరీఫ్ను దూషించారని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు వివరించారు. ఇదే సమయంలో భద్రతా సిబ్బంది తలుపులు తోసుకుని రావడంతో.. వారి సాయంతో షరీఫ్ కారు వద్దకు వెళ్లగలిగారని వివరించారు.
*29న పీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
పీసీసీ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ సాకే శైలజానాథ్ ఈ నెల 29వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బుధవారం విజయవాడ ఆంధ్ర రత్నభవన్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. శైలజానాథ్తో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ ఎన్.తులసిరెడ్డి, మస్తాన్వలీలు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
*రామగుండంలో భాజపా అభ్యర్థిపై దాడి!
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ 10వ డివిజన్ భాజపా అభ్యర్థి పిడుగు కృష్ణపై సోమవారం అర్ధరాత్రి జరిగిన దాడి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. దాడి చేసిన తెరాస అభ్యర్థిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత సోమారపు సత్యనారాయణ మంగళవారం గోదావరిఖని పోలీసుస్టేషన్ ముందు బైఠాయించారు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. కేసు నమోదు చేయలేదని, తమ పార్టీ అభ్యర్థి గాయపడ్డప్పటికీ కనీస విచారణ చేపట్టలేదని ఆరోపించారు. రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ పోలీసుస్టేషన్ వద్దకు చేరుకుని మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఎదుటి వ్యక్తి అభ్యర్థి కావడంతో అరెస్టుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, నిష్పక్షపాతంగా కేసు విచారణ చేపట్టేందుకు రామగుండం సీఐ కరుణాకర్కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలపడంతో మాజీ ఎమ్మెల్యే ఆందోళన విరమించారు.
*భుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోం: పవన్
వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఏపీకి అమరావతే శాశ్వత రాజధానిగా ఉండాలని, ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో అమరావతి పరిరక్షణ సమితితో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. రైతులు, ఆడపడుచులు, దివ్యాంగులపై కనికరం లేకుండా పోలీసులు లాఠీఛార్జి చేయడం కంటతడి పెట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీఛార్జీలో గాయపడిన వారితో జనసేన కార్యాలయంలో మంగళవారం సమావేశమై వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. ‘‘వైకాపా ప్రభుత్వ చర్యలు సర్వ నాశనానికి దారి తీస్తున్నాయి. మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కరూ నాశనం అయ్యేవరకు జనసేన పని చేస్తుంది. ఈ ప్రభుత్వం కూల్చివేతలతో పాలన మొదలుపెట్టింది.
*ఉద్యమానికి మద్దతు: శైలజానాథ్
అమరావతి రైతులు, మహిళలు, ప్రజలు, ప్రజాప్రతినిధులపట్ల పాశవికంగా ప్రవర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ చెప్పారు. ఆ రోజు అమరావతికి ఎందుకు మద్దతిచ్చారో, ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారో సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా ఉద్యమంలో కాంగ్రెస్ పాల్గొంటుందని చెప్పారు.
*రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాఉద్యమాలు: చాడ
బాగ్లింగంపల్లి, న్యూస్టుడే: సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను కేంద్రం వెనక్కి తీసుకునే వరకు బలమైన ప్రజా ఉద్యమాలు చేపట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని ఈ నెల 23న నేతాజీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాల ఎదుట ప్రదర్శనలు, 30న గాంధీజీ వర్ధంతి నేపథ్యంలో మానవహారాలు చేపడతామన్నారు.
*జగ్గారెడ్డిపై హక్కుల కమిషన్కు ఫిర్యాదు
రాష్ట్ర మంత్రి హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి(జగ్గారెడ్డి)పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో ఆయన మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని శ్రీరాములు.. కమిషన్ ఛైర్మన్ చంద్రయ్య దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారన్నారు. మంత్రికి, తెలంగాణ సమాజానికి జగ్గారెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని శ్రీరాములు డిమాండ్ చేశారు. కమిషన్ ఛైర్మన్ను కలిసిన ప్రతినిధి బృందంలో సంఘం ప్రధాన కార్యదర్శి కరుణాకర్రెడ్డి తదితరులున్నారు.
*భూదందా కోసమే తరలింపు: కన్నా
సచివాలయాన్ని విశాఖకు తరలించడం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కాదని.. విశాఖలో భూదందా కోసమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇడుపులపాయకు రూ.1400 కోట్లు ఇచ్చిన వ్యక్తి ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ఆ నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇడుపులపాయకు ఇవ్వడానికి అవేమైనా ఆయన తాత సొమ్మా? అని కన్నా ప్రశ్నించారు. 2019లో తెదేపాకు వ్యతిరేకంగా ప్రజలు ఎలా మౌనంగా తీర్పు ఇచ్చారో అలానే 2024లో ఆ కసిని వైకాపాపై చూపబోతున్నారన్నారు. అమరావతిలో మిగులు భూములు కావాలని రైతులు కోరితే వెనక్కి ఇవ్వచ్చని ఆయన ఓ ప్రశ్నకు జవాబిచ్చారు.
*జగన్పై వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నెల్లూరు జిల్లా కోవూరు వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తిట్టిన వాళ్లకే జగన్ మంత్రి పదవులు ఇచ్చారంటూ ఆయన చెప్పిన మాటల దృశ్యాలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజకీయంగా కలకలం రేగింది. కోవూరుకు చెందిన కొందరు తెదేపా నాయకులు వైకాపాలో చేరడాన్ని నిరసిస్తూ 5 రోజుల క్రితం ఊటుకూరుకు చెందిన వైకాపా శ్రేణులు నెల్లూరులోని ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఏళ్ల తరబడి పార్టీలో పని చేస్తున్న తమకు అన్యాయం చేయొద్దని వాపోయారు. దాంతో ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ తాను తప్పక అండగా ఉంటానని హామీ ఇచ్చారు
*కిరణ్తో శైలజానాథ్, తులసిరెడ్డి భేటీ
ఏపీసీసీ అధ్యక్షుడు ఎస్.శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి.. మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని కిరణ్ నివాసంలో ఈ భేటీ జరిగింది.