Devotional

ఆయప్ప ఆలయం మూసివేత

Sabarimalai Temple Closed-Telugu Devotional News

రెండు నెలల మకరవిళక్కు పూజల తర్వాత శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు మూసేశారు. మంగళవారం తెల్లవారుజామున సంప్రదాయబద్దంగా పూజలు చేసిన ఆలయ పూజార్లు, అయ్యప్ప వంశస్తులు ఆలయాన్ని మూసేశారు. ఈ నెల 15న మకరవిళక్కు ఉత్సవం ముగిసినప్పటికీ భక్తుల దర్శనం కోసం ఆలయాన్ని తెరిచే ఉంచారు. సోమవారం సాయంత్రం వరకు భక్తులను దర్శనానికి అనుమతిచ్చామని, చివరి రోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని దేవస్థానం బోర్డు చెప్పింది. సంప్రదాయాన్ని అనుసరించి తంత్రి మహేశ్‌‌‌‌‌‌‌‌ మోహనురు అభిషేకం, ఉషా నైవేద్యం తదితర పూజా కార్యక్రమాలు చేశారు.ఆ తర్వాత అయ్యప్ప వంశస్తులు ప్రత్యేక పూజలు చేయగా అయ్యప్ప నామస్మరణం మధ్య ఆలయం తలుపులు మూసేశారు. నెలవారి పూజల కోసం ఫిబ్రవరి 13న వారం రోజుల పాటు ఆలయం తెరుచుకోనుంది. కేరళ నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అయ్యప్ప ఆలయానికి వస్తారు.
2.ధార్మిక కార్యక్రమాలకే కల్యాణ మండపాలు-తీర్మానించనున్న తితిదే ధర్మకర్తల మండలి
తితిదే ఆధ్వర్యంలోని కల్యాణ మండపాలను కేవలం ధార్మిక అవసరాలకే వినియోగించాలని ధర్మకర్తల మండలి తీర్మానం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే ధర్మకర్తల మండలి సమావేశంలో విధివిధానాలు రూపొందించి ఆమోదముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా తితిదే ఆధ్వర్యంలో సుమారు 150 కల్యాణ మండపాలను నిర్మించారు. వీటిలో కేవలం ధార్మిక కార్యక్రమాలతో పాటు హిందువుల కల్యాణాలు నిర్వహించాల్సి ఉండగా.. పలు ప్రాంతాల్లో సెక్యులర్, సాంస్కృతిక, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఇది తితిదే నిబంధనలకు విరుద్ధమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ ధార్మిక కార్యక్రమాలు, హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించే వివాహాలకే అనుమతించాలని నిర్ణయించారు.
3.రాజన్న హుండీ ఆదాయం లెక్కింపులో చేతివాటం-రూ.9 వేలు దొంగిలిస్తూ పట్టుబడిన ఉద్యోగి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపులో ఆలయ ఉద్యోగి చేతివాటం ప్రదర్శిస్తూ పట్టుబడిన వైనమిది. మంగళవారం ఆలయ ఆవరణలో హుండీ డబ్బు లెక్కింపు చేపట్టారు. లెక్కింపులో పాల్గొన్న ఆలయ అటెండర్ జి.దేవయ్య రూ.9 వేలు పంచెలో పట్టుకుని తీసుకెళ్తుండగా భద్రత సిబ్బంది చేపట్టిన సోదాల్లో దొరికింది. వాటిని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈఓ కృష్ణవేణి తెలిపారు.
4.1న తిరుమలలో రథసప్తమి వేడుకలు
సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 1న తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో వేడుకలకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. రథసస్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దవుతాయని ధర్మారెడ్డి తెలిపారు. దివ్యాంగులకు, వయోవృద్ధులకు, చంటిబిడ్డలతోపాటు తల్లిదండ్రులకు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించారు.
5.విశాఖలో శ్రీనివాస చతుర్వేద హవనం
తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు విశాఖపట్నం పెందుర్తిలోని శ్రీశారదా పీఠంలో శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహించనున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్నట్లు శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి ఆకెళ్ల విభీషణశర్మ తెలిపారు.
6. కదిరి: శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
23.01.2020 వతేది
గురువారము ఆలయ సమాచారం
శ్రీ స్వామి వారి దర్శన వేళలుఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివార దేవతలకు (చుట్టు వున్న ఆలయములకు) నివేదన సమర్పణ..శ్రీస్వామి వారి దర్శనము ఉ.6.00 గంటల నుండి ఉ.7.00 గంటలకు దర్శనము వుండును.. తదుపరి స్వామి వారికి ఆర్జిత అభిషేకము సేవా, సహస్రనామర్చన, అలంకరణ, మహా మంగళహారతి తోపాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు..తిరిగి సర్వదర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.30 వరకు వుండును.. రెండవ మహా గంట నివేదన మ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ.. మ. 12.40 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును.తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికాల నైవేద్యాదులు సమర్పణ మహ మంగళ హారతి, పరివార దేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ..తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును..
రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
ఆర్జిత సేవాల వివరములు
23.01.2020 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్ : 23
23.01.2020 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్ : 5
7. మన ఇతిహాసాలు -దీర్ఘతమ మహర్షి
దీర్ఘతముడు (దేవనాగరి:दीर्घतमस) ఒక పురాతన మహర్షి. ఋగ్వేదంలో తన తాత్విక శ్లోకాల ద్వారా చాలా బాగా ప్రసిద్ధుడు. ఋగ్వేదం సంహితలోని మొదటి మండలము లోని 140 నుండి 164 వరకు గల సూక్తము (శ్లోకాలు) లకు ఇతను రచయిత మరియు ఋగ్వేదం ఆరవ మండల యొక్క ప్రవక్త అయిన ఋషి భరద్వాజుడు, సోదరుడుగా భావిస్తారు.
దీర్ఘతమస్ అనగా శాశ్వత చీకటిలో చుట్టబడింది అని అర్థం.
పుట్టుక
దీర్ఘతమ మహర్షి అతి పురాతన ఋషి కుటుంబములలో ఒకటి అయిన అంగీరసుడు యొక్క వంశస్థుడు. అంగీరసుడు బ్రహ్మ కుమారుడు. ఉచథ్యుడు, బృహస్పతి అంగీరసుని కుమారులు. దీర్ఘతముడు ఉచథ్యుని కుమారుడు. దీర్ఘతమ తల్లి మమత. బృహస్పతి యొక్క శాపం వల్ల ఇతను గుడ్డివాడుగా జన్మించాడు. దీర్ఘతముడు బుద్ధిలో బృహస్పతితో సమానం.
దీర్ఘతమ మహర్షి కూడా ఋషుల యొక్క కుటుంబములలోని గౌతముడు కంటే, అలాగే కక్షీవణుడు, గోతముడు, నోధాలు మరియు వామదేవుడు (ఋగ్వేదం లోని నాల్గవ మండలాన్ని దర్శించిన వాడు) లకంటే, ప్రధానంగా (ముఖ్యంగా) చాలా ముందున్నవాడు.
సంసారం
దీర్ఘతముడు భార్య ప్రద్వేషి. వీరిద్దరి కుమారుడు గౌతముడు.
దీర్ఘతమకు మరో భార్య ఉశిజ వల్ల పదకొండు మంది కుమారులు కలిగారు. వీరి సంతానంలో కక్షీవంతుడు ఋక్సంహితలో కొన్ని సూక్తాలను దర్శించి చాలా ప్రసిద్దుడయ్యాడు.దీర్ఘతముడు అనుగ్రహం వల్ల సుధేష్ణకు కలిగిన అంగ, వంగ, కళింగ, పుండ్ర మరియు శుంగ పుత్రులు తదుపరి ఆయా రాజ్యాలకు రాజులు అయ్యారు. ఆ రాజ్యాలే ప్రస్తుతము భాగల్పూర్, బెంగాల్, ఆంధ్ర, రాజసాహి, తామ్రవిక రాజ్యాలుగా చాలా ప్రసిద్ధమయ్యాయి.
రచనలు
ఋగ్వేదం లోని 1000 శ్లోకాలను ఇతని వంశజులు దర్శించిన వాటిలో దాదాపు 150 దీర్ఘతముడు దర్శించినవే ఉన్నాయి. అతని సొంత శ్లోకాలు అనేక వేద పాఠాలలో మరియు కొన్ని ఉపనిషత్తులలో కూడా తరచుగా దర్శనమిస్తూ ఉంటాయి.
ప్రాముఖ్యం
రాజరిక ప్రారంభ రాజుల్లో రాజు అయిన భరతుడు నకు ప్రముఖ పురోహితుడు లేదా ప్రధాన పూజారిగా దీర్ఘతముడు ఉన్నాడు (ఐతరేయ బ్రాహ్మణం VIII.23). భరతుడు పరిపాలించిన దేశమే ఇప్పుడు భారత దేశము. (దేశం యొక్క సాంప్రదాయ నామం).గా పేరు పెట్టారు.
8. నేటి ఆణిముత్యం
గురువు పలుకులెల్ల గురుతుగా గమనించి
పదిలపరచుకొనుము హృదయమందు
చిన్ననాటీగుర్తు చితమ్ము వీడదు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల
భావము :
గురువు గారు చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా గమనించి హృదయంలో పదిలపరచుకోవాలి.చిన్నవయసులో నేర్చుకున్నది ఏదైనా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది. చిన్ననాటి గుర్తులు త్వరగా చెరిగిపోవు.తెలుసుకొని మసులుకో ఓ తెలుగు బాల.
9 నేటి చిన్నారి గీతం
చదువు
చదువుకో చదువుకో అక్షరాలు నేర్చుకో
కళ్ళున్నా చూడలేని వాస్తవాలు తెలుసుకో
చదువుకుంటే గుండె బలం
చదువుకుంటే బుద్ధి బలం
చదువుకుంటే చీకట్లను
జయించే మహాబలం
నేటి సుభాషితం
ఒక నగరం మంచి చట్టాలతో పరిపాలించబడే కంటే , ఒక మంచి వ్యక్తిచే పరిపాలింపబడుట గొప్పదగును..
10. నేటి సామెత
పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టుబయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురైతే శుభశకునం కాదన్నది ఒక మూఢనమ్మకం. పిల్లి ఎదురైనప్పుడు బయలుదేరవలసిన వాళ్లు ఆగిపోవటం జరుగుతుంటుంది. అలాంటిది పిల్లిని చంకనపెట్టుకుని పెళ్ళికి వెళితే పిల్లితోపాటు ఆ పిల్లిని ఎత్తుకుని వస్తున్న వ్యక్తిని కూడా తిడతారు.అసలు సంగతి పిల్లిలాగా అపశకునకారిలాగా ఉండే వ్యక్తిని పక్కనపెట్టుకుని బయలుదేరితే ఆ వ్యక్తితోపాటు తీసుకెళ్ళిన మంచి వ్యక్తి కూడా మాటపడవలసి వస్తుంది. కనుక ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు, కలిసి తిరిగేటప్పుడు సమాజం వాళ్లు చేసే పనులను హర్షిస్తుందా? నిరసిస్తుందా? అనే విషయాలను గమనించుకుని స్నేహం చేయాలి. ఒకవేళ సమాజం వ్యతిరేకించే వ్యక్తులు గనుక అయితే వారిని వెంటపెట్టుకుని నడవటం మంచిదికాదన్నది ఈ సామెత చెప్పే సత్యం.
11. నేటి జాతీయం
గాడిద పొర్లినట్లు
గాడిద బూడిదలో, మట్టిలో పొర్లుతుంటుంది. దున్నపోతులు, పందులు బురదలో పొర్లుతుంటాయి. అలా పొర్లటం వాటికి అసహ్యం అనిపించదు. పైగా ఆనందాన్నీ అనుభవిస్తుంటాయి. ఎక్కడపడితే అక్కడ పొర్లి మర్యాదను పాడుచేసుకోవటం.
12. శుభోదయం
మహానీయుని మాట
” ఎవ్వరో విలువ ఇవ్వలేదు అని నువ్వు బాధ పడకు.
ఒక్కసారి విలువ ఇవ్వని వాళ్ళకి దూరంగా ఉండి చూడు. నీ విలువేంటో అర్ధం అవుతుంది.”
నేటీ మంచి మాట
కనిపించని దాన్ని చూడడానికి వివేకం కావాలి.”
13. శ్రీరస్తు శుభమస్తు
తేది : 23, జనవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బృహస్పతివాసరే (గురువారం)
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చతుర్దశి
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 49 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 18 ని॥ వరకు చతుర్దశి తిధి తదుపరి అమావాస్య తిధి)
నక్షత్రం : పూర్వాషాడ
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 20 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 21 ని॥ వరకు పూర్వాషాఢ నక్షత్రం తదుపరి ఉత్తారాషాఢ నక్షత్రం)
యోగము : (వ్యాఘాతం ఈరోజు తెల్లవారుఝాము 3 గం ll 40 ని ll వరకు తదుపరి హర్షణం రేపు తెల్లవారుఝాము 2 గం 52 ని ll వరకు)
కరణం : (వణిజ ఈరోజు తెల్లవారుఝాము 1 గం ll 52 ని ll వరకు తదుపరి విష్టి ఈరోజు మద్యాహ్నము 2 గం ll 4 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 27 ని ll )
వర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నము 12 గం॥ 0 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 8 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 1 ని॥ వరకు)
ర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 8 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నము 2 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 37 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నము 1 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 15 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 6 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 16 ని॥ వరకు)
సూర్యరాశి : (మకరము 15.1.2020 తెల్లవారుఝాము 2 గం ll 15 ని ll నుంచి 13.2.2020 సాయంత్రం 3 గం ll 7 ని ll వరకు)
చంద్రరాశి : (ధనుస్సు 21.1.2020 రాత్రి 11 గం ll 44 ని ll నుంచి 24.1.2020 ఉదయం 7 గం ll 40 ని ll వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 38 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 52 ని॥ లకు
మాసశివరాత్రి
14. ఓం నమోవేంకటేశాయ తిరుమల సమాచారం
ఈరోజు గురువారం 23-01-2020 ఉదయం 06 గంటల సమయానికి. తిరుమలలో భక్తుల రద్దీ ……
శ్రీ వారి దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లు మాత్రమే వేచిఉన్న భక్తులు…
సర్వదర్శనం కి సుమారు 4 – 5 గం. సమయం పట్టవచ్చు.
నిన్న జనవరి 22 న 64,244 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹: 3.68 కోట్లు.
నిన్న 16,805 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.
నిన్న 21,767 మంది భక్తులు తలనీలాలు సమర్పించినారు
15. పంచాంగము 23.01.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: హేమంత
మాసం: పౌష్య
పక్షం: కృష్ణ బహుళ
తిథి: చతుర్దశి రా.02:10 వరకు
తదుపరి అమావాశ్య
వా: గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం: పూర్వాషాఢ రా.01:40 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: హర్షణ, వజ్ర
కరణం: విష్టి
వర్జ్యం: ఉ.11:07 -12:44
దుర్ముహూర్తం: 10:34 – 11:20
మరియు 03:05 – 03:50
రాహు కాలం: 01:52 – 03:16
గుళిక కాలం: 09:38 – 11:03
యమ గండం: 06:49 – 08:14
అభిజిత్ : 12:05 – 12:49
సూర్యోదయం: 06:49
సూర్యాస్తమయం: 06:06
వైదిక సూర్యోదయం: 06:53
వైదిక ర్యాస్తమయం: 06:02
చంద్రోదయం: రా.తె.05:24
చంద్రాస్తమయం: సా.04:46
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
దిశ శూల: దక్షిణం
చంద్ర నివాసం: తూర్పు
సుభాష్ చంద్రబోస్ జయంతి
మాసశివరాత్రి
కాళీపూజ
16. రాశిఫలం – 23/01 /2020
తిథి:
బహుళ చతుర్దశి రా.1.43, కలియుగం-5121, శాలివాహన శకం-1941
నక్షత్రం:
పూర్వాషాడ రా.1.14
వర్జ్యం:
ఉ.10.34 నుండి 12.11
దుర్ముహూర్తం:
ఉ.10.00 నుండి 10.48 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం:
మ.1.30 నుండి 3.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆకస్మిక ధన లాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణ మేర్పడుతుంది. స్ర్తిలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆకస్మిక ధన లాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధన లాభంతో, ఋణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శత్రుబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వున్నాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందలెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించుట అన్ని విధాల మేలు. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అనవసర ధన వ్యయంతో ఋణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ధర్మకార్యాలు చేయుట యందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా వుంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగా నుండుటకు ప్రయత్నించాలి.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) పిల్లల వల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా నుండుట మంచిది. అనారోగ్య బాధలధిగమించుటకు ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
17. శుభమస్తు _ నేటి పంచాంగం
తేది : 23, జనవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చతుర్దశి
(ఈరోజు రాత్రి 1 గం॥ 38 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాషాడ
(ఈరోజు రాత్రి 1 గం॥ 09 ని॥ వరకు)
యోగము : హర్షణము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం :(ఈరోజు ఉదయం 12 గం॥ 5 ని॥ నుంచి పగలు 1 గం॥ 43 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 8 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 02 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 48 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 2 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 2 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 5 ని॥ లకు
18. చరిత్రలో ఈ రోజు
23, జనవరి
సంఘటనలు
565: తళ్లికోట యుద్ధము
1556: చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు.
1950: ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది.
1977: ‘జనసంఘ్‌’, ‘భారతీయ లోక్‌దళ్‌’, కాంగ్రెస్‌ (ఓ), ‘స్వతంత్ర పార్టీ’, ‘సోషలిస్టు పార్టీ’లు కలిసి ‘జనతాపార్టీ’గా ఏర్పడ్డాయి.
జననాలు
863: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936)
1890: హిల్డా మేరీ లాజరస్, ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978)
1893: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ప్రముఖ తెలుగు సాహితీకారులు. (మ.1979)
1897: సుభాష్ చంద్రబోస్, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1945)
1906: ముదిగొండ విశ్వనాధం, ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు మరియు శివపూజా దురంధురుడు. (మ.1984)
1911: జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (మ.2009)
1915: ఆర్థర్ లూయీస్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
1926: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (మ.2012)
మరణాలు
1972: కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు. (జ. 1914)
1978: హిల్డా మేరీ లాజరస్, ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. (జ.1890)
2015: ఎం. ఎస్. నారాయణ, ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. (జ.1951)
2016: ఏ.సి.జోస్ మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌. (జ.1937)
2018: వెంపటి రవిశంకర్‌, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969)
పండుగలు మరియు జాతీయ దినాలు
సుభాష్‌చంద్రబోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం
19. మేడారంలో గుడి మెలిగె..మహాజాతరలో తొలి ఘట్టం
సమ్మక్క సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు వన దేవతల పూజా సామగ్రి శుద్ధి జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర తొలి ఘట్టం విజయవంతమయ్యింది. గిరిజనుల్లో భక్తి భావం వెల్లివిరిసింది. నాలుగు గ్రామాలు జాతర శోభను సంతరించుకున్నాయి. బుధవారం గుడి శుద్ధి పండుగను గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు. పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను పాటించారు. మేడారం, కన్నెపల్లి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో ఉన్న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆలయాలను శుభ్రం చేసి పూజా సామగ్రిని శుద్ధి చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాల మధ్య ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. మేడారం మహా జాతర ప్రారంభానికి రెండు వారాల ముందు గుడి శుద్ధి పండుగను పూజారులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే మేడారం గ్రామస్థులు ఉదయాన్నే లేచి సమ్మక్క గుడి లోపల, బయట నీటితో శుద్ధి చేశారు. అనంతరం పూజారులు సమ్మక్క దేవతకు సంబంధించి రహస్య పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన మునిందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంట్లో సమ్మక్క దేవతకు చెందిన వస్తువులకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు చేశారు. అనంతరం పలువురు ముత్తైదువలు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, హారతులతో గుడికి బయలుదేరారు. వీరి ముందు సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చే పూజారి కొక్కెర కృష్ణ, జలకం పూజారి మల్లెల ముత్తయ్య, ధూపం పట్టే పూజారి కొక్కెర నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ముందు నడవగా డోలు వాయిద్యాలతో పూజారులు గుంపుగా గుడికి బయలుదేరి వెళ్లారు. గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గుడిలోకి వెళ్లారు. తర్వాత ముత్తైదువలు గుడి లోపల పుట్టమన్నుతో గద్దెను అలికి, ముగ్గులు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా అడవి నుంచి తీసుకొచ్చిన గడ్డిని పూజారులు గుడి పైభాగంలో పాత సంప్రదాయం ప్రకారం కప్పారు. సమ్మక్క గుడి లోపల, బయట ముగ్గులు వేసిన అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మేకను బలిచ్చి మొక్కులు సమర్పించారు. ఇదేవిధంగా కన్నెపల్లిలో సారలమ్మ దేవాలయంలో కూడా చేశారు. అక్కడ పూజారులు కాక సారయ్య, కాక కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెంకన్న తదితరుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. కొత్తగూడ మండలంలోని పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు దేవాలయం, కన్నాయిగూడెం మండలంలోని కొండాయి గ్రామంలో గోవిందరాజుల దేవాలయంలో కూడా ఇదే విధంగా గుడి శుద్ధి పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో మేడారం జాతర పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు మునేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వసంతరావు, జనార్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.