Food

చలికాలం ఈ పండ్లు తీసుకోండి

Eat these fruits in winter-Telugu food and diet news

మనిషికి అవసరమయ్యే కొన్నింటిని ప్రకృతి అమూల్యమైన బహుమతిగా అందిస్తుంది. అలా ఇచ్చే మధురమైన ఆహారమే ఫలాలు. ఒక్కో కాలంలో ఒక్కో రకమైన రంగులో అందంగా కనిపిస్తూ నోరూరిస్తుంటాయి. మన పెరటిలో లభించే పండ్ల నుంచి ప్రత్యేకంగా పండించే వాటి వరకు ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు ఆపిల్‌ పండు కొనాలంటే అమ్మో..! అనుకునే వాళ్లం కానీ, ఇప్పుడు అదీ చవకగానే లభిస్తోంది. ఈ మధ్య స్థానిక పండ్ల రేటేమో చుక్కల్నంటుతున్నాయి. విదేశీ పండ్లే అధికంగా దొరుకుతున్నాయి. పండ్ల సీజన్‌ విచిత్రాలెన్నో..!
**ఏ వాతావరణానికి అవసరమయ్యే ఆహారాన్ని ఆ కాలాల్లో ప్రకృతి ఉచితంగా ప్రసాదిస్తుంది. వృక్షాలు దాచుకునే ఆహార ఫలాలు.. ఒక్కో దశలో ఒక్కో రంగును సంతరించుకుంటాయి. ప్రతి రంగు ఫలం కొన్ని రకాలైన పోషకాలను అందిస్తుంది. శీతాకాలంలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్ని సిట్రస్‌ పళ్లు అందిస్తాయి. పండ్లను తిన్న పక్షులు వాటి గింజలను ఒక చోటు నుంచి మరొకచోటుకి వెదజల్లడం వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పండ్ల మొక్కలు విస్తరించాయి. మన దేశానికి వచ్చిన బ్రిటీషు, పోర్చుగీసు వారు క్యాబేజి, ముల్లంగి, పీర్‌, రాస్ప్‌బెర్రీ వంటి పండ్లు, కూరగాయల్ని ఇక్కడా పండించారు. శీతాకాలంలో లభించే పండ్లు ఎక్కువ మన్నికగా ఉంటాయి.
పొద్దుపొద్దునే చల్లగాలిలో బడికి నడుచుకుంటూ దారి వెంట వెళుతుంటే.. గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న ఉసిరికాయల చెట్టును చూడగానే.. నోరూరిపోతుంది. చెట్టు కొమ్మను దులిపి చేతినిండా కాయలు తీసుకునివెళ్లేవాళ్లం. బ్రేకులో ఉసిరికాయలు తింటుంటే నాకూ ఇవ్వవా అంటూ ఇతర పిల్లలు పోటీ పడుతుంటే.. తలా కొన్నింటిని పంచుకుని పుల్లని రుచిని ఆస్వాదించేవారం. ఇలా పండ్ల రుచిని ఒకరితో ఒకరం పంచుకుంటూ ఇతరులతో స్నేహంగా ఉండేవాళ్లం. ఎన్నో పోషకవిలువలతో పాటు ఔషధ గుణాలున్న ఉసిరికాయలను అమృత ఫలం అంటారు. పిల్లలూ, పెద్దలూ ఖాళీ సమయంలో బుగ్గన పెట్టుకుని ఆస్వాదించే ఈ చెట్లు ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. ఒకప్పుడు తేలిగ్గా, దాదాపు ఉచితంగానే దొరికే ఇవి ఇప్పుడు అరుదుగా దొరికితే ఖరీదు పెట్టి కొనాల్సివస్తోంది. ఊరగాయలకు, ఇతర అవసరాలకు పనికొచ్చే పెద్ద ఉసిరినే వాణిజ్య అవసరాలకు పెంచడం ఎక్కువైంది. సి-విటమిన్‌ పుష్కలంగా లభించే ఈ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
*కల్తీలేని పండు…
శీతాకాలంలో లభించే మరో మధురమైన ఫలం సీతాఫలం. అమృతంలా ఉండే దీని రుచికి అభిమానులెందరో ఉంటారు. వెచ్చగా విందునిచ్చే ఈ ఫలాలు అడవిలో ఎక్కువగా లభిస్తాయి. పోషకాల సమాహారం ఈ పండ్లు. ‘చిక్కని ఆకుల మధ్య ఫక్కున నవ్వే సీతాఫలం పేదల ఆపిల్‌ పండ్లు’ అని ఓ కవి అన్నాడు. ఒకప్పుడు యాపిల్‌ కన్నా తక్కువ ధరకు లభించేది సీతాఫలం. కానీ, వీటి దిగుబడి తగ్గిపోవడం వల్ల రాను రాను వీటి ధర పెరుగుతోంది. ప్రకృతిలో సీతాఫలం ఒక్కపండే కల్తీ కాకుండా ఉన్నది. ఎందుకంటే అన్ని పండ్లు హైబ్రిడైజేషన్‌కు లొంగుతాయి. కానీ, ఈ ఫలం దానికి లొంగకుండా తన అస్థిత్వాన్ని కాపాడుకుంటోందట..! వీటి గింజలు కీటకాల నాశనానికి తోడ్పడతాయి. ఈ చెట్లను అనాలోచితంగా కొట్టేయడం వల్ల పండ్ల సప్లై తగ్గి పేదవాడికి అందకుండా పోతున్నాయి. కొద్ది రోజులు మాత్రమే మార్కెట్లో కనిపిస్తున్నాయి. అడవుల నరికివేత కారణంగా ఈ జాతి చెట్లు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని నిపుణులు అంటున్నారు.
*రేగి.. ఎర్ర ఖర్జూరం…
బోర్డు స్కూలు గేటు ముందు రేగిపళ్లను గిద్ద రెండు, ఐదు రూపాయలకు అమ్ముతుండేవారు. పుల్లపుల్లగా తియ్యగా ఉండే వీటి రుచిని ఆస్వాదించని వారెవరు..! చిన్నగా ఉండే ఈ ముళ్ల చెట్లు శీతాకాలంలో విస్తారంగా కాపు కాస్తాయి. ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లెల్లో భోగిపళ్ల సందడిగా చేసే ఈ రేగిపళ్ల వేడుక పల్లె పండుగ జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. పిల్లల మానసిక రుగ్మతలను తగ్గిస్తుందని ఇలా చేస్తుంటారు. సి-విటమిన్‌ సమృద్ధిగా ఉండే రేగిపండు అనేక రుగ్మతలను నివారిస్తుంది. జామ తర్వాత విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పండు రేగి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఐరన్‌, ఫాస్పరస్‌ వంటి ఖనిజాలను అందిస్తుంది. చర్మ వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది. దీన్ని ఎర్ర ఖర్జూరం అని అంటారు. రేగిపళ్ల రుచి ఇప్పటి చాలామంది పిల్లలకు తెలియడంలేదు. జిగురుగా కనిపించే వీటిని తినడానికి ఇష్టపడని వారూ ఉన్నారు. కానీ, ఇవి అందించే పోషకాలెన్నో ఉన్నాయి. కాబట్టి పిల్లలకు వీటి రుచి అందించడం ఎంతో మేలు చేస్తుంది. పెద్దగా ఉండే రేగిపండ్లను సీమరేగి అంటారు. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ కలిగి ఉంటాయి. అనంతపురంలో గంగిరేగుతో సంకరించిన ఉమ్రాన్‌ రేగు పంటను సాగు చేస్తున్నారు.
*పరిక్కాయలు…
శీతాకాలంలో కురిసే మంచు చల్లదనానికి చర్మవ్యాధులు వస్తుంటాయి. దాని నివారణకు అవసరమయ్యే ఆహారాన్ని ప్రకృతే అందిస్తుంది. అవే సిట్రస్‌ ఫలాలు. ఈ కాలంలో పల్లెల్లో రోడ్లపక్కన, పొలాల గట్ల మీద పెరుగుతాయి పరిక్కాయల చెట్లు. ఈ ముళ్ల చెట్లు డిసెంబరు నుంచి మార్చి వరకు ఫలిస్తాయి. వీటిని గింజలతో కలిపి తింటారు. పుల్లపుల్లగా తియ్యగా ఉంటుంది వీటి రుచి. ఈ కాయల్లో విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. ఎటువంటి కెమికల్స్‌ వాడకుండా సహజంగా ప్రకృతి సిద్ధంగా పెరుగుతాయి కాబట్టి ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి. ఈ చెట్ల ఆకులను నూరి గాయాల మీద రాస్తే గాయాలు నివారణ అవుతాయట. ఈ పండ్లు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, పల్లెవాసులకు ఇవి ఎంతో ప్రియంగా దొరుకుతాయి. ఇవే కాదు బొలుసుకాయలు కూడా పల్లెల్లో కనిపిస్తాయి. తియ్యగా ఉండే ఈ పండ్లు శీతాకాలంలోనే పండుతాయి. పట్నంవాసులకు తెలియని ఎన్నో ఫలాలు పల్లెసొంతం. కేవలం శీతాకాలంలో పండే వీటిని బుట్టల్తో తెచ్చి అమ్ముతుంటారు.
ఈ కాలంలో వచ్చే అందుబాటులో ఉండే మరొకపండు కమలా. వీటిలోని విటమిన్లు, మినరల్స్‌ చర్మ వ్యాధులను నివారిస్తాయి. తొక్కతీసుకుని తినే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే ఎంత మోతాదులో ఎరువులను ఉపయోగించాలో చెప్పాల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు క్రిమిసంహారక మందులను ఎక్కువగా వాడుతున్నారు. లోపలి పండులో చాలా తక్కువ రసాయనాలు ఉంటాయి. ఇలాంటి పండ్లు శ్రేయస్కరం. శీతాకాలంలో వచ్చే ద్రాక్ష పళ్లని తలచుకోగానే నోట్లో లాలజలం ఊరుతుంది. ద్రాక్ష సాగు క్రీస్తు పూర్వం ఐదువేల ఏళ్ల కిందటే మొదలుపెట్టారు. మనదేశంలో హిమాలయాల అంచున ఎక్కువగా వీటిని సాగు చేస్తున్నారు. వీటిని పర్షియన్లు మన దేశానికి తీసుకొచ్చారు. 20 శతాబ్దంలో నిజాం వీటిని హైదరాబాదుకు పరిచయం చేశాడు. ప్రస్తుతం వీటిలో వందల రకాల సంకర జాతులు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల గుండె సంబంధిత వ్యాధులు పోతాయంటారు. వీటిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
*విశాఖ ఆపిల్‌…
శీతల ప్రదేశాల్లో మాత్రమే పండే ఆపిల్‌ పండును విశాఖపట్నంలోని లంబసింగిలోనూ పండిస్తున్నారు. ఆంధ్రా కాశ్మీర్‌గా పేరుగాంచిన ఈ ప్రదేశం ఆపిల్‌ పండ్ల పెంపకానికి అనువుగా ఉంది. 2014 నుంచి సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజి (సిసిఎంబి) వారు ఈ పంటను ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రాంతంలోని గిరిజనులకు ఈ మొక్కలనిచ్చి వాటిని ఎలా సాగు చేయాలో అవగాహన కల్పిస్తున్నారు. సముద్రమట్టానికి 3,600 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో శీతాకాలంలో 1 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదౌతాయి. ఈ శీతల ఉష్ణోగ్రతలు ఆపిల్‌ పెరుగుదలకు దోహదపడుతున్నాయి. వివిధ ఉష్ణోగ్రతల్లో ఆపిల్‌ పంటను సాగు చేసేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. హిమాలయాల వంటి శీతల ప్రాంతాల నుంచి వచ్చే ఈ పండ్లు ఒకప్పుడు సామాన్యులకు అందనంత అధిక ధరలో లభించేవి. కానీ, ఈ రోజుల్లో సీతాఫలాల కన్నా చవకగా దొరుకుతున్నాయి. రోజుకో ఆపిల్‌ను తింటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన పని లేదంటారు.
*రోజా రంగు పళ్లు…
ఆకారంలోనూ, రంగులోనూ, రుచితోనూ ఆకర్షించే పండు స్ట్రాబెర్రీ. రోజా రంగులో ఉండే ఈ పండునే కాదు, ఈఫ్లేవర్‌లో లభించే ఐస్‌క్రీమ్‌లకు గిరాకీ ఎక్కువే. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ పండును ఇప్పుడు మన దేశంలోనూ పండిస్తున్నారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో స్ట్రాబెర్రీలను పండిస్తున్నారు. 2015లో 3,000 ఎకరాల్లో, 30,000 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేశారు. ఈ మొక్కలను కాలిఫోర్నియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే స్ట్రాబెర్రీలను ఫ్రాన్స్‌, బెల్జియం, మలేషియా, మధ్య ఆసియా దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు.
*పసుపు నక్షత్రం పండు..!
ఆకారంలో నక్షత్రంలా ఉండే పండు స్టార్‌ ఫ్రూట్‌. ఇవి మెత్తగా ఆకుపచ్చ రంగులో పుల్లని రుచిలో ఉంటాయి. ఈ మధ్య మన రాష్ట్రంలో ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. దక్షిణ అమెరికాలో బాగా వాడుకలో ఉన్నాయి. చైనా, తైవాన్‌, శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్తైన్స్‌, మలేషియా, భారత్‌ వంటి దేశాల్లో వీటిని పండిస్తున్నారు. ఇవి 1200 మీటర్ల ఎత్తులో మాత్రమే పెరుగుతాయి. మన దేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌లో వీటిని సాగు చేస్తున్నారు.
*ఆస్ట్రేలియా పండు.. కివి
చూడటానికి సపోటాలా ఉంటుంది కివి. వీటిని న్యూజిలాండ్‌, ఇటలీ, గ్రీస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ మధ్య డెంగీ ఉగ్రరూపం దాల్చినప్పుడు ప్రచారం వల్ల కివీ పండ్ల డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. వీటిని తింటే రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందని పాపులర్‌ చేశారు. దీనిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయని అంటారు. దీనిలో విటమిన్‌-సి పుష్కలంగా దొరుకుతుంది. పండ్లు ఉత్తర చైనాకు చెందినవి. 20వ శతాబ్దంలో వీటిని న్యూజిలాండ్‌కు ఎగుమతి చేశారు. అక్కడి నుంచి ప్రపంచమంతటా ఇవి దొరుకుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్‌, అమెరికాకు వాళ్లు గ్రేట్‌ బ్రిటన్‌, కాలిఫోర్నియాకు ఎగుమతి చేయడంతో అప్పటి నుంచి పాపులర్‌ అయ్యాయి. ప్రస్తుతం ఇటలీ, దక్షిణ ఆఫ్రికా, చిలీ వంటి దేశాల్లో పండిస్తున్నారు.
*మేలైన అంజీర…
మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు… అనే వేమన పద్యం చదువుకునే వారం. ఇప్పుడు అంజీర పండుగా మార్కెట్లో దొరుకుతోంది. ఈ పండ్లు తాజాగా ఉన్నప్పుడు కంటే వడిలిపోయిన తర్వాత పోషకాలు రెట్టింపు అవుతాయి అంటారు. ఇది కూడా ఈ కాలంలో విరివిగా దొరుకుతుంది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఇనుములే కాక శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు ఉంటాయి. ఇది రక్తహీనత నుంచి విడుదల కలిగిస్తుంది. అంజీర పండ్ల యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుదలకు తోడ్పడతాయి. వీటిని అనంతపురంలోని రైతులు అధికంగా పండిస్తున్నారు.
*గులాబీ పండ్లు…
డ్రాగన్‌ ఫ్రూట్‌… పేరే విచిత్రంగా ఉంది కదా..! కానీ వీటిని మన దేశంలో పండించేందుకు ఉద్యానవన శాఖ అదికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇవి మధ్య అమెరికాకు చెందిన మెక్సికోకు చెందినవి. వీటిని చైనాలో డ్రాగన్‌ ఫ్రూట్స్‌ అని, అమెరికాలో అమెరికన్‌ బ్యూటీ అని అంటారు. వీటిని పండించేందుకు విస్తారంగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం గుజరాత్‌, కర్నాటక, మహారాష్ట్రలో పండిస్తున్నారు. ఇవి కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయని అంటారు. ఒకసారి పండితే కాయలు కాయడం మొదలయ్యాక 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. కర్నాటకలో వెయ్యి ఎకరాల్లో పండిస్తున్నారు. అంతేకాదు, ఎలా పండించాలో కౌన్సిలింగ్‌ కూడా ఇస్తున్నారు. తెలంగాణలోని జీడిమెట్లలో గులాబీ పండుగా వీటిని పండించేందుకు ఉద్యానవనశాఖ ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పండ్ల పెంపకం మనరాష్ట్రంలోనూ ప్రోత్సహిస్తే పండ్ల రైతులకు ఎంతో మేలు. పండ్లను ధరపరంగా కాకుండా వాటిలో ఉండే పోషకాలను బట్టి వాటికి విలువనివ్వాలి. ఈ మధ్య మనం తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నింటినీ ఫ్యాషన్‌గా వాడేందుకు అలవాటు పడిపోయాం. అడవిలో దొరికే తాజా పండ్లను సేకరించి బుట్టలో పెట్టుకుని పట్టణాల్లో తిరిగి అమ్మే వాళ్ల దగ్గర వీటిని కొనం. తక్కువ ధరకు ప్రకృతిసిద్ధంగా లభించే వాటిని కొనడానికి అనాసక్తి చూపుతాం. అదే ప్యాకింగ్‌ల్లో పెట్టి షోరూమ్‌ల్లో అమ్మే వాటిని ఎక్కువ ధర ఇచ్చైనా కొనడానికి సిద్ధపడతాం. ఇలాంటి ధోరణి మార్చుకోవాలి. మార్కెటింగ్‌ మాయలో భాగంగా ఈ పండ్లను తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారని ఇచ్చే ప్రకటనలకు పడిపోతుంటాం. కానీ, కష్టపడి రైతన్న తెచ్చిన స్థానిక పండ్లను తినడానికి కాస్త అనాసక్తి కనపరుస్తాం. విదేశాల పండ్లను తినాలి. అలాని స్థానిక పండ్లను నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని పిల్లలకూ పరిచయం చేయాలి.
* స్టార్‌ ఫ్రూట్‌ను ఇండోనేషియాలోని టిమర్‌ ద్వీపంలో వెయ్యి సంవత్సరాల క్రితం కనుగొన్నారట. ఆగేయాసియా వ్యాపారులు మన దేశానికి పరిచయం చేశారు.స్ట్రాబెర్రీలను మొదట ఫ్రాన్స్‌లో పండించేవారు. బ్రిటీష్‌ పాలనలో ఆస్ట్రేలియా నుంచి స్ట్రాబెర్రీలను మనదేశానికి తీసుకువచ్చారు.ప్రపంచవ్యాప్తంగా పదివేల రకాల ద్రాక్ష పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇవన్నీ సంకరజాతులకు చెందినవి. గింజ లేకుండా ద్రాక్షను తయారు చేసే క్రమంలో వీటిని తయారు చేశారు.మనదేశంలోని పండే మామిడి, సపోటా, లిచి, ద్రాక్ష, అరటి వంటి పండ్లను ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నారు. జాతీయ హార్టికల్చర్‌ డేటా ప్రకారం మన దేశంలో 2015-16లో 6.3 మిలియన్‌ హెక్టార్ల భూమిలో కోట్ల మెట్రిక్‌ టన్నుల పండ్లను ఉత్పత్తి అయ్యాయట. 2019లో రూ. 4817. 35 కోట్ల విలువైన పండ్లను ఎగుమతి చేశారు. వీటిలో ద్రాక్ష, దానిమ్మ, మామిడి, అరటి అధికంగా ఉన్నాయి. ప్రధానంగా యుఎఈ, నెదర్లాండ్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మలేషియా, శ్రీలంక, ఒమన్‌, ఖతార్‌ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.