NRI-NRT

వరంగల్ వైద్య కళాశాలకు డా.హనిమిరెడ్డి ₹కోటి విరాళం

NRI Telugu Cardiologist Dr.Lakireddy Hanimireddy Donates 1Crore To Warangal Medical College-వరంగల్ వైద్య కళాశాలకు డా.హనిమిరెడ్డి ₹కోటి విరాళం

ప్రముఖ కార్డియాలజిస్ట్, పలు సంస్థలకు ఇప్పటి వరకు ₹60కోట్లకు పైగా విరాళాలు అందించిన డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఈ రోజు తాను చదువుకున్న వరంగల్ వైద్య కళాశాలకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. డా.హనిమిరెడ్డి వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించారు. ఇప్పటి వరకు ఆయన ఆ కళాశాలకు ₹4కోట్లు రూపాయలు విరాళంగా అందించారు. ఇటీవలే ఆ కళాశాల 60సంవత్సరాలు పూర్తి చేసుకుని డైమండ్ జూబ్లీ వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా డైమండ్ జూబ్లీ భవనం నిర్మాణాన్ని చేపట్టింది. దీని కోసం కోటి రూపాయల విరాళాన్ని డా.హనిమిరెడ్డి నేడు (శుక్రవారం) ప్రకటించారు. ఈ సందర్భంగా కాకతీయ మెడికల్ కళాశాలను సందర్శించారు. డా.హనిమిరెడ్డికి అక్కడి అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రిన్సిపాల్ డా.సుంకరనేని సంధ్యారాణి, కాకతీయ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.టీ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాశాలకు చెందిన పూర్వ విద్యార్ధులు, వరంగల్ పట్టణానికి చెందిన ప్రముఖులు, పురప్రముఖలు, TNI డైరెక్టర్ కిలారు ముద్దుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.