మేడారం మహా జాతర విశేషాలతో వీడియోను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో విడుదలైన ఈ వీడియోలో ఆంగ్లం, హిందీలకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ తన గాత్రాన్ని అందించారు. రెండేళ్లకోసారి జరిగే జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా అభివర్ణిస్తూ జాతరవిశేషాలను ఇందులో వివరించారు. జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో జాతర విశేషాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారు మోగాలనే ఉద్దేశంతో ఈ వీడియోను రూపొందించి ప్రచారం చేస్తున్నట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు వెదురు బొంగులను నామమాత్రపు ధరకు ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించింది. ఇందుకోసం వెదురు అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అడవిలో మంటలు చెలరేగకుండా, ఎక్కడ పడితే అక్కడ నిప్పు రాజేయకుండా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ పేర్కొంది. పీసీసీఎఫ్ ఆర్.శోభ, వరంగల్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం.జె.అక్బర్ మేడారంలో పర్యటించి జాతరకు అటవీశాఖ తరఫున ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు మొక్కలను పంపిణీ చేయనున్నట్లు అక్బర్ తెలిపారు.
మేడారం జాతర ప్రచార వీడియోకు బిగ్‌బీ గాత్రదానం
Related tags :