DailyDose

భారీగా హోండా విక్రయాలు-వాణిజ్యం

Honda BS6 Sales Cross One Lakh-Telugu Business News

* ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా.. బీఎస్‌ 6 యాక్టివా ద్విచక్రవాహనాల అమ్మకాల్లో లక్ష యూనిట్ల మైలురాయి అధిగమించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. గత సెప్టెంబర్‌లో హోండా తమ సంస్థ నుంచి మొట్టమొదటి బీఎస్‌ 6 వాహనం యాక్టివా 125ని, ఆ తర్వాత ఎస్పీ 125, అనంతరం ఈ ఏడాది ఆరంభంలో యాక్టివా 6జీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. బీఎస్‌ 6 అధునాతన ఇంజిన్లతో ఈ మూడు రకాల ద్విచక్రవాహనాలను సంస్థ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ బీఎస్‌ 6 వాహనాలను విడుదల చేసినప్పటి నుంచి కేవలం నాలుగు నెలల్లో లక్ష యూనిట్లు అమ్మినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ కల్లా బీఎస్‌ 6 వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశించింది. దీంతో ఆ గడువుకు ముందే బీఎస్‌ 6 వాహనాలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకు హోండా సంస్థ సిద్ధమైంది. ఈ వాహనాలు కేవలం పనితీరులోనే కాకుండా మైలేజీ విషయంలోనూ మంచి ఫలితాల్ని ఇస్తాయని సంస్థ తెలిపింది.

* భారత మొబైల్‌ మార్కెట్లో వివో సంస్థ మంచి అభివృద్ధి సాధించింది. కౌంటర్‌పాయింట్‌ అనే సంస్థ భారత ఫోన్‌ మార్కెట్‌పై చేసిన సర్వే ప్రకారం.. ‘2019 నాలుగో త్రైమాసిక ఫలితాల్లో వివో 21శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుని శాంసంగ్‌ను దాటి రెండో స్థానంలో నిలవగా.. శాంసంగ్‌ 19 శాతం మార్కెట్‌ షేర్‌తో మూడో స్థానంలో ఉంది. మరోవైపు షావోమీ 27శాతం మార్కెట్‌ షేర్‌తో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది’ అని వెల్లడించింది.

* చైనా ఒక ‘సైనిక పక్క ఆధునికీకరణ వేగంగా చేసుకొంటూ పోతుండగా.. భారత్‌ మాత్రం నత్తనడకన ఆధునికీకరణ చేస్తోంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వం ఆధునికీకరణ దేశ అవసరంగా పేర్కొంటున్నా.. ఆ మేరకు కేటాయింపులు మాత్రం ఉండటంలేదు. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం నేవీ చీఫ్‌ ఒక అంశాన్ని లేవనెత్తారు. దళాలు తమ ప్రాధాన్యాల ఎంపికలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన గుర్తించారు. వనరులు తగ్గిపోతుండటంతో ఒత్తిడి పెరిగి ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. వాయుసేన పరిస్థితి మరింత ఘోరంగా ఉంది.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలైన అవాక్స్‌(ఎయిర్‌బోర్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌) అమర్చిన విమనాలు భారత్‌ వద్ద నాలుగు ఉండగా.. పాక్‌ వద్ద 10 వరకు ఉన్నాయి. ఇది ప్రమాదకర పరిణామం.

* దిగుమతుల పద్దుకు కళ్లెం వేయాలని ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా చైనా నుంచి 56 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులకు కారణమవుతున్న వస్తువులకు కళ్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఫిబ్రవరి1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి గురిలో ఉన్న వాటిల్లో మొబైల్‌ ఫోన్ల ఛార్జర్లు, పరిశ్రమల్లో వినియోగించే రసాయినాలు, దీపాలు, కలపతో చేసిన ఫర్నిచర్‌, క్యాండిల్స్‌, నగలు, చేతి తయారీ వస్తువులు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం కనుక వీటిపై దిగుమతి సుంకం పెంచితే ముఖ్యంగా మొబైల్‌ ఛార్జర్లను, దిగుమతి చేసుకొంటున్న ఫోన్ల తయారీదార్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతోపాటు ఐకియా వంటి సంస్థలపై ఈ నిర్ణయం ప్రభావం చూపించనుంది. వీటిపై దాదాపు 5శాతం నుంచి 10శాతం వరకు దిగుమతి సుంకం పెంచాలని ఒక ప్యానల్‌ ఇప్పటికే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్‌ ఐసీఐసీఐ అదుర్స్‌ అనిపించింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో స్థాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికరలాభం రెండు రెట్లకు పైగా పెరిగి రూ. 4,146.46కోట్లుగా నమోదైంది. 2018 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ నమోదు చేసిన రూ. 1,604.91కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 158శాతం ఎక్కువ కావడం విశేషం. సమీక్షిస్తున్న మూడో త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం కూడా 17.23శాతం పెరిగి రూ. 23,638.26కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆదాయం రూ. 20,163.25కోట్లుగా ఉంది.

* పెట్రోల్‌ బంకుల్లో గంటల తరబడి వేచిచూసి విసిగి పోతుంటాం కదా! అయితే ఈ సాంకేతికత అమల్లోకి వస్తే ఆ బాధ నుంచి విముక్తి లభించొచ్చు. ఇంధనం నింపుకున్న తర్వాత బిల్లు కట్టడానికి ప్రత్యేకంగా వేచి చూడకుండానే వెళ్లిపోవచ్చు. టోల్‌ ప్లాజా వద్ద రద్దీని తగ్గించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌ తరహాలోనే పెట్రోల్‌ బంకుల్లోనూ ఫాస్ట్‌లేన్‌ అనే విధానాన్ని రూపొందించారు. ముంబయికి చెందిన అంకుర సంస్థ ఏజీఎస్‌ ట్రాన్స్‌సాక్ట్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇప్పటికే ముంబయి, పుణె, థానెలోని హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ పంపుల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు.