Movies

విలక్షణ నటులు గుమ్మడి-వర్ధంతి సందర్భంగా TNI ప్రత్యేకం

A tribute to versatile actor gummadi venkateswara rao

?”కళాప్రపూర్ణ శ్రీ గుమ్మడి”?
? ? ?
“పంచె కట్టులోన ప్రపంచాన మొనగాడు
ఎవడురా ఇంకెవడు తెలుగువాడు.”
హుందాగా మూర్తీభవించిన ఆంథ్రుడుగా, ప్రశాంత వదనంతో ,నిత్యం చిరునవ్వుతో ,తెలుగుదనానికి
నిలువెత్తు చిరునామాగా మనకు కనిపించే మహామనిషి, శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు.
తెలుగు సినిమారంగంలో అతి చిన్న వయసులో అతి పెద్ద పాత్రలు ధరించి అలవోకగా ప్రేక్షకులను మెప్పించిన మహానటులు గుమ్మడి జులై 9 1927 న గుంటూరు జిల్లా తెనాలికి దగ్గరలోని “రావికంపాడు” గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో తల్లిదండ్రులకు మొదటి సంతానంగా జన్మించారు. ఈ మహానటుణ్ని కన్న తల్లిదండ్రులు, బసవయ్య, బుచ్చమ్మ ల పూర్వపుణ్య ఫలము వలన జన్మించిన గుమ్మడి ఇంతటి మహానటుడౌతాడని వారు ఊహించి ఉండరు.
ఉమ్మడి కుటుంబంలో మొదటి సంతానంగా స్థానిక హైస్కూలు విద్య ముగియగానే వారి వ్యవసాయ వృత్తిలోనే గుమ్మడిని కొనసాగించాలని భావించారు. దైవ నిర్ణయమును ఎవరూ మార్చలేరు కదా! వారి పూర్వజన్మ సుకృతము ఊరకనే పోవునా?
శ్రీ గుమ్మడి స్థానిక పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఇతనిని ప్రభావితుని చేసిన వ్యక్తి వారి తెలుగు మాస్టారు జాస్తి శ్రీరాములు చౌదరి. తరగతిలో గుమ్మడి మాట్లాడు విధానము, ఉచ్ఛారణ చూసి అవియే, అతని భవిష్యత్తుకు గట్టి పునాదులని తలచి ఆ విధముగా ప్రోత్సహించెను. తరగతి గదిలో పాఠ్యపుస్తకము తీసుకొని బిగ్గరగా చదవమని అతని వాగ్దాటి, స్వరము, వాచకము, ఇతర విద్యార్ధులను, ఉపాద్యాయులను, అబ్బురపరచేది. ఈ వయస్సులోనే గుమ్మడికి ఆశక్తికరమైన పుస్తక పఠనము బాగుగా అలవడినది. ఈ ఒరవడిలో నడుచుచున్న ఈ బాలునికి కమ్యూనిష్టు భావజాలము నందు ఆశక్తి ఉన్నట్లు తెలిసినది.
పిమ్మట కళాశాల చదువులకు గుంటూరు హిందూ కళాశాలలో చేర్పించుటకు తీసుకొని వెళ్ళగా అప్పటి ప్రిన్సిపాలుతో ఇతనికి రాజకీయము నందు ఆశక్తి మెండు అని మనవి చేసిరి. అప్పుడు ప్రిన్సిపాల్ గారు చిరునవ్వుతో ఇట్టి ఆశక్తి ఉన్న విద్యార్థులు కూడా మాకు అవసరమే అని చేర్చుకొనిరి. గుమ్మడి కళాశాల విద్య ఎక్కువ కాలము సాగినట్లు కనిపించలేదు. ఆ రోజులలోనే నాటకములలోను, సినిమాలలోను, చేరవలెనన్న ఆశక్తి మొలకెత్తినది. గ్రామములోని తోటి విద్యార్థులను, మిత్రులను పోగు చేసి, పద్యము లేని వచన నాటకములు ఆడుచూ నటునిగా, ఆ ప్రాంతము నందు ఈతనికి గుర్తింపు వచ్చెను. ఈ అవకాశము చూచుకొని తన మార్గము వెతుకుతూ మిత్రులతో కలిసి తెనాలిలో రేడియో షాపు ప్రారంభించెను. ఇది నామ మాత్రమే. కళలకు, నాటకాలకు, సినిమా వృత్తులకు ఆలవాలమైన తెనాలిలలో, ప్రముఖులు సందర్శించిన, నప్పుడు వారిని కలుసుకొని సినిమా లలో ప్రయత్నము చేయుటకు అవకాశము కలిగెను.
గుమ్మడి హావభావములు, కంఠస్వరము, గమనించిన పలువురు దర్శకులు వీరు హీరో కన్నా ఇతర పాత్రలకు సరిపోవునని తీర్మానించుకొని ప్రోత్సహించిరి. ఇది 1950 వ సంవత్సరమున జరిగిన ఘటన. గుమ్మడి గారి తొలిచిత్రాలు, అదృష్టదీపుడు, పిచ్చిపుల్లయ్య, అనుకున్న విజయాలు సాథించకపోయినా నటుడిగా ఆయనకు ఒక గుర్తింపు వచ్చినది. మిస్సమ్మ చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించినది మూడు నిమిషములైనా ముక్కోటి ఆంథ్రులను ఆకర్షించిన అవకాశము గుమ్మడికి కలిగినది. ఆ చిత్రములో చిన్న పాత్ర అందులోను గెస్ట్, పారితోషకము అడగకపోయినా శ్రీ నాగిరెడ్డి గారు సవృదయంతో ఇచ్చిన రోజు వారికి అమితానందము కలిగించినది .
తరువాత గుమ్మడి గారు వెనుదిరిగి చూడలేదు. తండ్రిగా , అన్నగా, మామగా, జమీందారుగా, పోలీసు అధికారిగా, ప్రతినాయకునిగా, సాంఘికపాత్రలు, జానపదాలలో రాజుగా మంత్రిగా రాజగురువుగా విభిన్నపాత్రలు, పౌరాణికాలలో బలరామునిగా కర్ణుడిగా, దుర్యోథనునిగా, నటించి నాటి మేటి నటులు శ్రీ ఎన్. టి. రామారావు, శ్రీ నాగేశ్వరరావు, శ్రీ ఎస్, వి రంగారావు గార్లతో సమ ఉజ్జీగా ఉత్తమమైన నటన ప్రదర్శించి “శభాష్ ” అనిపించుకున్న నటుడు శ్రీ గుమ్మడి. ఆ మహానటుడు నటించిన సాంఘిక, జానపద, పౌరాణిక ,చిత్రాలు వివరాలు అందరికీ తెలిసినవే. ఆ వివరాలు వ్రాయడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. మహా మొహమాటస్తుడు కావడంచేత నిర్మాతల నుంచి పూర్తిపారితోషికం తీసుకోని సంఘటనలు చాలా ఉన్నాయి. ఆయన బలహీనతలు, కుటుంబ బాద్యతలు, బాగా తెలిసిన వ్యక్తీ కావడంచే, దర్శకుడుగా కాని., నిర్మాతగా కాని , ప్రయోగాలు చెయ్యలేదు.

Image result for gummadi venkateswara rao

సినీరంగంలో మృదుభాషిగా, సహృదయుడుగా పేరు తెచ్చుకున్న గుమ్మడి పుస్తక ప్రేమికుడు. సమయము దొరికినప్పుడు మంచి పుస్తకాలను చదివే రసజ్ఞుడు. ఇతని అభిరుచిని గమనించి ఈ రస హృదయునికి ప్రఖ్యాతకవి, రచయిత శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక కావ్యమును అంకిత మిచ్చిరి. ఇది సామాన్య విషయం కాదు .
గుమ్మడి వంటి మహానటుని 50సంవత్సరముల సుదీర్ఘ నటనారంగంలో సాధించిన ఘనతకు గుర్తింపుగా,
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు “కళాప్రపూర్ణ బిరుదుతోను, ఆంథ్రప్రదేశ్ ప్రభుత్వము వారు “రఘుపతి వెంకయ్య” అవార్డుతోను సత్కరించిరి. వీరు 3 సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్ గాను, 2 సార్లు నంది అవార్డ్స్ కమిటి సభ్యులుగాను నియమించబడిరి. ఇది మరియే నటుడికి దక్కని గౌరవము.
తెలుగు విశ్వవిద్యాలయము వారు గౌరవ డాక్టరేట్ బిరుదును వారి మహామంత్రి తిమ్మరసు చిత్రిములోని పాత్రను చూచిన తరువాత బహూకరించిరి. మరోమలుపు చిత్రమునకు ఉత్తమ నటుడు అవార్డు దక్కినది. వీరు నటించిన 500 చిత్రములలో 90 శాతము అందరి ప్రశంసలు అందుకొన్నవే..
ఈ మహానటుడు తెలుగు సినిమా రంగంలో తన అనుభవాలను తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు అన్న పేరున పుస్తక రూపములో ప్రచురించిరి. వీరు చివరి సారిగా జనం మధ్య కనిపించినది, మాయాబజార్ చిత్రం రంగులలో విడుదలైన సందర్భంలోనే. అప్పుడు వీరు ఈ మహాద్భుతాన్ని చూడటానికే ఇంకా బ్రతికి ఉన్నానేమో అని వేదాంత ధోరణి లో వారి అభిప్రాయమును వివరించిరి. తనకు వరాలైన గొంతు, ఉచ్చారణ అనారోగ్య కారణంగా దెబ్బతిన్న తరువాత 10 సంవత్సరములు చిత్రసీమకు దూరంగా ఉన్నారు. ఇంతటి ఘనకీర్తిని సంపాదించుకొన్న
మహానటుడు శ్రీ గుమ్మడి 26 జనవకు 2010 న స్వర్గస్తులైనారు.

Image result for gummadi venkateswara rao

Image result for gummadi venkateswara rao

Image result for gummadi venkateswara rao