WorldWonders

ప్రేయసీ….ఎంత పనిచేస్తివి?

Jeff Bezos Girl Friend Ruined Him By Sharing Texts

అపర కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు సంబంధించిన అత్యంత వ్యక్తిగత సమాచారం లీకై ఆయన కాపురంలో చిచ్చుపెట్టింది. ఫలితంగా ఆయన 25ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాల్సి వచ్చింది. బెజోస్‌ స్నేహితురాలు లారెన్‌ షాంజెన్‌ సోదరుడు మైఖెలే ఈ సమాచారాన్ని లీక్‌ చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే అత్యంత రహస్య విషయాలు మైఖెల్‌కు చేరవేసింది ఎవరు..? అంటే స్వయానా బెజోస్‌ ప్రేయసి లారెనే అంటున్నారు మన్‌హట్టన్‌లోని ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా వారి దగ్గర ఉన్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనంలో పేర్కొంది. జెఫ్‌ బెజోస్‌ వ్యక్తిగత సమాచారాన్ని ‘నేషనల్‌ ఎంక్వైరర్‌’ ప్రచురించిన కేసులో ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే కొన్ని సాక్ష్యాలను సేకరించారు. అందులో 2018, మే 10వ తేదీన లారెన్‌ షాంజెన్‌ ఫోన్‌ నుంచి మైఖెల్‌కు కొన్ని మెసేజ్‌లు వెళ్లినట్లు తేలింది. బెజోస్‌కు తనకు మధ్య జరిగిన సరస సంభాషణ(వ్యక్తిగత సంభాషణ)ను లారెన్‌ తన సోదరుడికి పంపించినట్లు ప్రాసిక్యూటర్లు సేకరించిన సాక్ష్యాల్లో ఉందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం వెల్లడించింది. ఆ తర్వాత అదే ఏడాది జులై 3న బెజోస్‌తో సన్నిహితంగా దిగిన ఫొటోలను కూడా లారెన్‌ తన సోదరుడికి పంపించారట. ఇదే సమాచారాన్ని మైఖెల్‌ నేషనల్ ఎంక్వైరర్‌ పత్రికకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇందుకు మైఖెల్‌ 2లక్షల డాలర్లు తీసుకున్నారట. బెజోస్ ఫోన్‌ను సౌదీ హ్యాక్‌ చేసిందని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఇటీవల వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బెజోస్‌పై ఎంక్వైరర్‌ ప్రచురించిన కథనం వెనుక సౌదీ అరేబియా హస్తం ఉండొచ్చని ఆయన సెక్యూరిటీ కన్సల్టెంట్‌ గతేడాదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజా కథనాలతో నేపథ్యంలో బెజోస్‌ వ్యక్తిగత సమాచారం లీక్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలే బెజోస్‌.. లారెన్‌తో కలిసి భారత్‌లో పర్యటించారు. ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ ముందు వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈ సంచలన విషయాలు బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. లారెన్‌తో బెజోస్‌ సంబంధం బయటపడగానే ఆయన భార్య మెకంజీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పాతికేళ్ల బంధానికి స్వస్తి చెబుతూ గతేడాది బెజోస్‌.. మెకంజీ విడాకులు తీసుకున్నారు.