Movies

కంగనా పైలట్

Kangana Ranaut As Airforce Pilot

తన సినిమా జీవితంలో మైలురాయి చిత్రాల సంఖ్యను పెంచుకొనేలా కంగనా రనౌత్‌ కథల్ని ఎంచుకుంటోంది. ‘మణికర్ణిక’తో సత్తా చాటిన ఆమె తాజాగా విడుదలైన ‘పంగా’తో మరోసారి తనేంటో నిరూపించింది. కబడ్డీ క్రీడాకారిణి పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. మరో పక్క జయలలిత జీవిత కథతో వస్తోన్న ‘తలైవి’లో నటిస్తోంది. ఇప్పుడు మరోసారి నాయికా ప్రాధాన్యమున్న చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేసింది. త్వరలో రోనీ స్రూవాలా నిర్మించనున్న చిత్రం ‘తేజస్‌’లో ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్‌గా తెరపై కనిపించబోతుంది కంగన. ఈ చిత్రానికి శర్వేష్‌ మేవరా దర్శకుడు. ‘‘సైన్యం నేపథ్యంలో సాగే చిత్రాల్లో నటించాలనేది నా చిన్ననాటి కోరిక. సైనికులంటే నాకు ఎంతో గౌరవం. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసే సైన్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటించడం నా అదృష్టం. నా కోసం ఇంత గొప్ప కథను సిద్ధం చేసిన రోనీ సార్‌, శర్వేష్‌లకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని దర్శకుడు చెప్పారు. ‘తలైవి’ చిత్రీకరణ ముగిశాకా ‘తేజస్‌’ కసరత్తులు మొదలుపెడతాను’’అని చెప్పింది కంగన. ఈ ఏడాది జులైలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.