పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్‌లో పల్లె ప్రగతి, మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరును తెలుసుకొనేందుకు ఆకస్మిక తనిఖీలు, పర్యటనలు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇకపై ప్రతి నెలా విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పల్లె ప్రగతిలో జరిగిన పనుల గురించి అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. 12,751 గ్రామాలకు గాను 12,705 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల కోసం ఇప్పటికే 6,017 ట్రాక్టర్లను కొనుగోలు చేశామని.. మరో 4,534 ట్రాక్టర్లను ఆర్డరిచ్చినట్లు సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. పేదలు ఉండే బస్తీల్లో ఎక్కువ దవాఖానాలు ఏర్పాటు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. వచ్చే నెల రోజుల్లో కొత్త బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని ఆదేశించారు. త్వరలోనే ఈ దవాఖానాల సంఖ్య 350కి పెంచాలని నిర్ణయించినట్లు కేసీఆర్ చెప్పారు. పట్టణాలు, నగరాలు కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరం లోపల, బయట 1.60 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని.. వీటిలో విరివిగా చెట్టు పెంచాలని సూచించారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ బడ్జెట్లలో 10 శాతం నిధులు పచ్చదనం పెంచేందుకు వినియోగించాలని కేసీఆర్ సూచించారు.
బస్తీ దవాఖానాల సంఖ్య పెంచాలి
Related tags :