Fashion

మహిళలపై సున్తీ ఆచారాన్ని అరికట్టేందుకు ఐరాస కృషి

UNO Fighting Despearately To Ban Female Genital Mutilation

మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి? దీన్ని నిషేధించాలని ఐక్యరాజ్య సమితి ఎందుకు అంటోంది? ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం, ప్రపంచ జనాభాలో ప్రతి 20 మంది మహిళల్లో (బాలికలు సహా) ఒకరు ‘సున్తీ’ అనే ఆచారానికి బాధితులే.
‘సున్తీ’ చేయడం అంటే మహిళల జననేంద్రియంలో క్లైటోరిస్ అనే భాగాన్ని కత్తిరించడం. దీన్నే ఆంగ్లంలో ‘ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్’ (ఎఫ్‌జీఎం)గా వ్యవహరిస్తున్నారు.ఈ ఆచారాన్ని పాటించే కుటుంబాల్లో చాలావరకు ఊహ తెలియని వయసులోనే (ఆరు, ఏడేళ్లప్పుడే) బాలికలకు ‘సున్తీ’ చేస్తారు. కొందరికి యుక్త వయసొచ్చాక చేస్తారు.శారీరకంగా, మానసికంగా మహిళల్లో జీవితాంతం అది ప్రభావం చూపుతుంది. వారి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది.
ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో 20 కోట్లకు మందికి పైగా ఎఫ్‌జీఎం బాధను అనుభవించిన వారేనని యూనిసెఫ్ అంచనా వేసింది. స్పెయిన్‌లోనూ ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో దాదాపు 18 వేల మంది బాధితులు ఉన్నట్లు తెలిపింది.
*మహిళల్లో సున్తీ: నిషేధానికి ఐక్యరాజ్య సమితి పిలుపు
”స్త్రీ జననేంద్రియం భాగాన్ని కోసివేయడం లేదా చర్మాన్ని తొలగించడాన్ని ఎఫ్‌జీఎంగా వ్యవహరించాలి” అని ఐక్యరాజ్య సమితి నిర్వచించింది.అలా చేయడాన్ని మానవ హక్కుల ఉల్లంఘన చర్యగా ఐక్యరాజ్యసమితి పరిగణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌జీఎం పద్ధతికి ముగింపు పలుకుతూ, 2012 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది.దానిని పూర్తిగా నిర్మూలించేందుకు, అందుకోసం ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు యేటా ఫిబ్రవరి 6ను ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టోలరన్స్ ఫర్ ఎఫ్‌జీఎం’గా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.
**బొహ్రా ముస్లిం సముదాయంలో
కెన్యాలోని బొహ్రా ముస్లిం సముదాయానికి చెందిన ప్రజలు కూడా ఈ ఆచారాన్ని ఎక్కువగా పాటిస్తారు.
“11 ఏళ్ల వయసులో నాకు ఎఫ్‌జీఎం జరిగింది. ప్రతి అమ్మాయికీ అది తప్పనిసరి అని మా నానమ్మ చెప్పింది” అని కెన్యాలోని ఇసియోలో ప్రాంతానికి చెందిన యువతి బిషారా షేక్ చెప్పారు.అలా చేస్తే, జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుందని, బిడ్డకు జన్మనివ్వాలంటే ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనన్న విషయం తర్వాత అర్థమైంది.”నాతో పాటు మరో ముగ్గురు బాలికలకు ఒకేసారి అలా చేశారు. నా కళ్లకు గంతలు కట్టారు. నా చేతులు వెనక్కి మలిచి పట్టుకున్నారు. కాళ్లు వెడల్పు చేసి, నా జననేంద్రియాన్ని కత్తిరించారు. అప్పుడు నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేను. ఆ నొప్పిని భరించలేక విలవిల్లాడాను. తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాను. అయినా బలవంతంగా చేశారు” అని బిషారా చెప్పారు.
**ఖత్నా (ఎఫ్‌జీఎం) ఎలా చేస్తారు?
యోని శీర్షం వెలుపలి భాగాన్ని కోసి వేయడం, లేదా అక్కడి చర్మాన్ని తొలగించడం ‘సున్తీ’ లో భాగమే. ‘సున్తీ’ చేస్తున్నప్పుడు కనీసం మత్తు మందు కూడా ఇవ్వరు. పూర్తి స్పృహలో ఉన్నప్పుడే అమ్మాయిలు తీవ్రమైన నొప్పిని భరించాల్సి ఉంటుంది.బ్లేడ్, కత్తి ఉపయోగించి నాటు పద్ధతిలో ‘సున్తీ’ చేస్తుంటారు. ఆ తర్వాత నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు పసుపు, వేడి నీళ్లు, సాధారణ పైపూత మందును వాడుతారు.”’క్లైటోరిస్’ను తమ సమాజంలో మాంసపు ముక్కగా పిలుస్తారు” అని బొహ్రా ముస్లిం సమాజానికి చెందిన ఇన్సియా దరివాలా పేర్కొన్నారు. క్లైటోరిస్ ఉండడం వల్ల అమ్మాయిల్లో లైంగికవాంఛ పెరుగుతుందని బొహ్రా ముస్లింలు భావిస్తుంటారు.”ఒక ఐస్ ముక్కలా మారిపోతాం. ఎలాంటి భావాలూ ఉండవు. ప్రేమ అనే అనుభూతి ఉండదు. అన్నీ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది” అని ఈజిప్టుకు చెందిన సినీ నిర్మాత ఓమ్నియా ఇబ్రహీం చెప్పారు.ఓమ్నియా కూడా ఎఫ్‌జీఎం బాధితురాలే. “అది జరిగిన తర్వాత మానసికంగా ఎంతగానో కుంగిపోయాను. లైంగికంగా కోరికలు నశించిపోయాయి. దాంతో, ఇక నేను సెక్స్‌కి పనికిరానేమో అని అనుకునేదాన్ని. ఆ బాధ నుంచి బయటపడేందుకు నాకు ఎన్నో ఏళ్లు పట్టింది” అని ఓమ్నియా వివరించారు.చాలా దేశాల్లో ఈ ఆచారాన్ని నిషేధించారు. అయినా, ఇప్పటికీ ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని దేశాల్లో కొనసాగుతోంది.సున్తీని ఆస్ట్రేలియా, కెనెడా, బెల్జియం, యూకే, అమెరికా, స్వీడన్, డెన్మార్క్, స్పెయిన్ తదితర దేశాలు నేరంగా పరిగణిస్తున్నాయి.
యూరప్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఇతర దేశాల నుంచి వలస వెళ్లిన కుటుంబాల్లో ఈ ఆచారం ఉందని యూనిసెఫ్ చెబుతోంది.
*భారత్‌లో ఎందుకు నిషేధం లేదు?
ఎఫ్‌జీఎంపై నిషేధం విధించాలని వేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు దీనిపై ఏం చర్య తీసుకున్నారో చెప్పాలంటూ మహిళా శిశు మంత్రిత్వ శాఖను కోరింది.అయితే, ఎన్‌సీఆర్‌బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో)లో ‘ఖత్నా’కి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని, అందువల్లే ఇలాంటి విషయాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతోందని మంత్రిత్వ శాఖ సుప్రీంకు తెలిపింది.సహీవో, వీ స్పీక్ అవుట్ తదితర స్వచ్ఛంద సంస్థలు భారత్‌లో ఎఫ్‌జీఎంను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి.