Business

రోజుకు ₹20కోట్ల నష్టాల మూట

Air India's Daily Losses Are Around 20Crore Rupees

దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మరికొద్ది నెలల్లోనే ఈ ప్రతిష్టాత్మక సంస్థ ప్రైవేట్ పరం కానుంది. ఎయిర్ ఇండియాను అమ్మేయలేకపోతే మూసివేయాల్సింది వస్తుందనేలా ఉంది ఆ సంస్థ పరిస్థితి. అలాంటి ఎయిర్ ఇండియాలో రోజుకు వచ్చే నష్టం ఎంతో తెలిస్తే షాక్ కు గురవ్వాల్సిందే. ఈ సంస్థ నిర్వహణ వల్ల రోజుకు వచ్చే నష్టం కనిష్టంగా 20 కోట్ల రూపాయలు అయితే..గరిష్టంగా అది 26 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. ఎంతో సౌకర్యవంతమైన విమానాలు ఉన్న ఎయిర్ ఇండియా నిర్వహణ లోపాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా నష్టాలు మూటకట్టుకుంటోంది. అవి కాస్తా పేరుకుపోవటంతో సర్కారు ఎలాగైనా ఈ మహారాజాను వదిలించుకోవటానికి రెడీ అయిపోయింది. అది కూడా మూడు, నాలుగు నెలల్లోనే పూర్తి అయ్యే అవకాశం కన్పిస్తోంది. అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎవరి చేతుల్లోకి వెళుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఎయిర్‌ఇండియా కొనుగోలుకు మొగ్గుచూపే సంస్థలు ఈ ఏడాది మార్చి 17 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)కు స్పందించాల్సి ఉంటుంది. ఎయిర్‌ఇండియాను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్‌, హిందూజాలు, ఇండిగో, స్పైస్‌జెట్‌ సహా కొన్ని ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు పోటీ పడవచ్చని ఓ అంచనా. మరోవైపు దేశీ విమానయాన సంస్థలతో కలిసి కొన్ని విదేశీ ఎయిర్‌లైన్స్‌ కూడా సంయుక్త బిడ్ల ద్వారా బిడ్డింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎయిర్‌ఇండియాకు విస్తృతంగా ఉన్న దేశీయ, విదేశీ నెట్‌వర్క్‌లతోపాటు లండన్‌, దుబాయ్‌ వంటి కీలక విదేశీ విమానాశ్రయాల్లో ట్రాఫిక్‌ రైట్స్‌, స్లాట్‌లు, సాంకేతిక సిబ్బంది కలిగి ఉండటంతోపాటు పెద్ద సంఖ్యలో విమానాలు ఉండటంతో కొనుగోలుదారులు టేకోవర్‌కు ఆసక్తి కనబరుస్తున్నారు.