నిర్భయ కేసు నిందితులకు త్వరలో మరణ శిక్షను అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో మరణశిక్ష అమలుకు సంబంధించిన ఆసక్తికర విషయాలివీ…
*తుపాకీతో కాల్చి..
దోషుల్ని తుపాకీతో కాల్చిచంపే విధానాన్ని ఇండొనేసియా, ఉత్తరకొరియా, చైనా, సోమాలియా, తైవాన్, యెమెన్, అమెరికా, యూఏఈల్లో అమలుచేస్తున్నారు.
*విషపు ఇంజక్షన్‌తో
విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపే పద్ధతిని అమెరికాలో ఎక్కువగా అమలుచేస్తున్నారు. ఇది తక్కువ క్రూరమైన విధానమనేది అమెరికా విశ్వాసం. 2013లో చైనా, వియత్నాంలలోనూ ఈ పద్ధతిని పాటించారు.
*కరెంట్ షాక్ ఇచ్చి..
కరెంట్ షాక్ ఇచ్చి.. దోషిని చంపే విధానాన్ని అమెరికా, మరికొన్ని దేశాలు అమలుచేస్తున్నాయి. ఈ పద్ధతిలో సంబంధిత వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టి.. కదలకుండా బంధించి.. కరెంట్ షాక్ ఇస్తారు.
*ఖరీదైన దండన
దోషికి మరణశిక్ష విధిస్తే చాలు.. పెద్దగా ఖర్చేమీ ఉండదనుకుంటాం. కానీ మరణ దండనల విచారణ ఖర్చులు సాధారణ విచారణల కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో మరణ దండనలపై విచారణల కోసమే ఏటా దాదాపు 18.4 కోట్ల డాలర్లు ఖర్చుచేస్తున్నారు. భారత్‌లో సుదీర్ఘకాలం విచారణ కొనసాగుతుంది కాబట్టి.. ఖర్చు తడిసిమోపెడవుతుంది.
*ఉరి తీసి..
భారత్ సహా పలు దేశాల్లో ఉరి తీయడం ద్వారా మరణశిక్షను అమలుచేస్తారు. ఇలాంటి దేశాల్లో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, ఇరాక్, జపాన్, కువైట్, మలేసియా, నైజీరియా, పాలస్తీనా, సూడాన్‌లున్నాయి.
*తల నరికి..
దోషి తలను బహిరంగంగా నరికే పద్ధతిని సౌదీ అరేబియాలో అమలుచేస్తున్నారు. ప్రపంచంలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నది ఈ దేశం ఒక్కటే.
*గిలొటిన్ పద్ధతిలో..
దోషి తలను తెగ నరకడం కోసం గిలొటిన్ పరికరాన్ని ఫ్రాన్స్‌లో వాడేవారు. ఎత్తైన చతురస్రాకారపు ఫ్రేము పైభాగంలో బరువైన, పదునైన బ్లేడు ఉంటుంది. దాన్ని బలంగా కిందికి వదిలినపుడు నిందితుడి తల తెగిపోతుంది. 1977 దాకా ఫ్రాన్స్ లో ఈ పద్ధతి ఉండేది. చివరిసారిగా ట్యునీషియాకు చెందిన హమిదా జందౌబీని గిలొటిన్‌తో చంపారు.
*నీళ్లలో మరగబెట్టి..
ఉజ్బెకిస్థాన్‌లో క్రూరమైన పద్ధతిలో మరణశిక్షను అమలుచేస్తారు. దోషుల్ని మరిగించిన నీళ్లలో పడేసి చంపుతారు. 2002లో ఇలా ఇద్దరు ఖైదీల్ని చంపారు.
*కదిలే వాహనంలో…
చైనాలో కొన్ని చోట్ల కదిలే వాహనంలో మరణశిక్షను అమలుచేస్తున్నారు. జైల్లో మరణదండన అమలుచేసే సౌకర్యాల్లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వాహనాలను వినియోగిస్తారు. ఎలక్ట్రిక్ షాక్ లేదా విషపు ఇంజక్షన్ ద్వారా వాహనంలోనే చంపేస్తారు.
*ఖైదీలకు పెళ్ళిళ్లు
అమెరికాలో మరణశిక్ష పడిన డజన్లకొద్దీ ఖైదీలు జైల్లోనే పెళ్లిచేసుకున్న సందర్భాలున్నాయి. అయితే మరణశిక్ష అమలయ్యేదాకా మాత్రమే ఈ పెళ్లి ఉంటుందన్న ప్రమాణాలు మాత్రం చేసుకోరు.
*చివరిగా ఏం తింటారు
అమెరికాలో మరణశిక్ష పడిన వ్యక్తి చివరి భోజనానికి 40 డాలర్ల వరకు ఖర్చుచేయొచ్చు. అయితే ఎక్కువమంది చీజ్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివాటినే ఆర్డర్ చేస్తుంటారు.
*పిల్లులను దగ్గరుంచుకోవచ్చు
మరణశిక్ష పడిన ఖైదీలు పెంపుడు పిల్లుల్ని దగ్గర ఉంచుకోవడానికి అమెరికాలోని కొన్ని చోట్ల అనుమతిస్తారు. సత్ప్రవర్తన కోసం ఇలా చేస్తారు. అయితే జైలు నిబంధనల్ని ఉల్లంఘిస్తే మాత్రం వాటిని వెనక్కి తీసుకుంటారు.
*మరణం దాకా వెళ్లి..
అమెరికాలోని లూసియానాలో జాన్ థాంప్సోనిస్ అనే వ్యక్తికి హత్యానేరంపై మరణశిక్ష విధించారు. అతనికి మరికొన్ని నిమిషాల్లో మరణశిక్ష అమలుచేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రాసిక్యూటర్లు జాన్‌కు అనుకూలంగా బలమైన సాక్ష్యం తీసుకువచ్చారు. దీంతో అతను నిర్దోషి అని మరో 35 నిమిషాల్లోనే జ్యూరీ తేల్చేసింది. ఆ రకంగా జాన్ ప్రాణాలతో బయటపడ్డాడు.
*ఆంధ్రప్రదేశ్‌లో..
చిలుకలూరి పేట బస్సు దహనం కేసులో నిందితులు విజయవర్దనరావు, చలపతిరావులూ ఇలాగే బయటపడ్డారు. 1997 మార్చి 29వ తేదీ తెల్లవారుజామున వీరిని ఉరితీయాల్సి ఉంది. సుప్రీంకోర్టు చివరి నిముషంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులతో వీరి ప్రాణాలు మిగిలాయి. ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.
ఉజ్బెకిస్థాన్‌లో మరగబెట్టిన నీటిలో ముంచి చంపుతారు

Related tags :