ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కోత దశలో ఉంది. ఈ సమయంలో అకస్మాత్తుగా వచ్చే వర్షాలు లేదా తుపాన్ల నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతుంటారు. పంటను కోసి కల్లాల్లº ఆరబెట్టే సమయంలో అధిక తేమ వల్ల వరి మొలకెత్తకుండా ఉండేందుకు చేపట్టాల్సిన పద్ధతులను వ్యవసాయాధికారి సూచించారు.
***మొలకెత్తకుండా చేసే పద్ధతులు
వానకు తడిసిన పనలను ఒడ్డుకు చేర్చి, కట్టలుగా కట్టి నిలబెట్టాలి. వీటిపై పది లీటర్ల నీటికి అర కిలో చొప్పున ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసి వడ్లు మొలకెత్తకుండా కాపాడవచ్చు. కల్లంలో తడిస్తే.. నాలుగు కిలోల ఊకకు కిలో చొప్పున ఉప్పు కలిపి క్వింటా వడ్లలో కలిపితే గింజలు మొలకెత్తవు. ఊక లేనప్పుడు.. ఎండుగడ్డిని చిన్న ముక్కలుగా కత్తిరించి వడ్లలో కలపాలి.
***సమగ్ర ధాన్య సంరక్షణ
* ధాన్యాన్ని బాగా ఆరబెట్టాలి. వరిలో 11-12 శాతం, అపరాల్లో 10 శాతం, నూనెగింజల్లో 7-9 శాతం తేమ ఉండేలా ఆరబెట్టి, నిల్వ చేస్తే.. ఆరు నెలల నుంచి ఏడాది వరకు పురుగు పట్టకుండా ఉంటుంది.
* నూర్పిడి యంత్రాలను, రవాణా వాహనాలను వాడే ముందు శుభ్రపరచుకోవాలి.
* వీలైనంత వరకు ధాన్యం నిల్వకు కొత్త సంచులను ఉపయోగించాలి. పాత సంచుల్లో ధాన్యాన్ని నిల్వ చేయాల్సి వస్తే.. లీటరు నీటికి మలాథియన్ 2 మి.లీ. చొప్పున కలిపి సంచులపై పిచికారీ చేసి ఉపయోగించాలి.
* ధాన్యం నిల్వ చేసే గోదాముల్లో పైకప్పు, గోడలు, నేలలో పగుళ్లు, రంధ్రాలు లేకుండా సిమెంట్‌తో పూడ్చాలి. గిడ్డంగుల్లోకి పక్షులు రాకుండా కిటికీలకు వెంటిలేటర్లు, ఇనుప జల్లెడలను అమర్చాలి. ధాన్యపు బస్తాలకు తేమ తగలకుండా ఉండేందుకు.. అడుగు భాగంలో చెక్క దిమ్మెలను ఉంచాలి. బస్తాలను పైకప్పు, గోడలకు తగలకుండా చుట్టూ రెండడుగుల మేర ఖాళీ ఉండేలా నిల్వ చేస్తే.. పర్యవేక్షణకు, మందుల పిచికారీకి అనుకూలంగా ఉంటుంది.
కోతల అనంతరం పంటల సంరక్షణ
Related tags :