భారత్ సహా ప్రపంచం నలుమూలల్లో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలను, నిపుణులను ఆకర్షించేందుకు బ్రిటన్ ‘అన్‌లిమిటెడ్ ఆఫర్’ ప్రకటించింది. అగ్రశ్రేణి పరిశోధకులు, శాస్త్రవేత్తలు, గణిత నిపుణులకు అపరిమితంగా, వేగవంతంగా వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. వారంతా తమ వద్దే స్థిరపడేలా తోడ్పడాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా వలస నిబంధనలను గురువారం నాటికి రూపొందించి, ఫిబ్రవరి 20 నుంచి అమలు చేయనుంది. ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘శాస్త్రీయ పరిశోధనలకు బ్రిటన్ ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. వీటిని కొనసాగించేందుకు, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు మానవ వనరులపై పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరముంది. ప్రపంచంలోని ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతున్నాం. వారి ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. అగ్రదేశం అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో మరో ముఖ్య దేశం బ్రిటన్ ప్రతిభావంతులకు ఆహ్వానం పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.
శాస్త్రవేత్తలకు బ్రిటన్ రెడ్ కార్పెట్
Related tags :