చుట్టూ మంచుతో కప్పబడిన అంటార్కిటికా ప్రాంతమది.. ఎక్కడచూసినా మంచు ఫలకాలే.. అక్కడే ఓ సొరంగంలో మంచు కరుగుతూ సన్నగా ప్రవహిస్తున్న చల్లని నీరు.. ఎముకలు కొరికే చలి.. ఇవేవీ లెక్కచేయకుండా ఈత కొట్టేందుకు దిగాడో వ్యక్తి. ఆ మంచు పొరల కిందే 10 నిమిషాల పాటు ఈత కొట్టి ఔరా అన్పించాడు. ఆయనే బ్రిటన్‌కు చెందిన 50 ఏళ్ల అథ్లెట్ లెవిస్ ఫ్యూ. ఆయనీ సాహసం చేసింది రికార్డుల కోసమో, రివార్డుల కోసమో అనుకుంటే పొరపాటే. దీనివెనుక ఓ సామాజిక కారణం ఉంది. ప్రపంచ మానవాళి మనుగడను కాపాడుకోవాలనే దృఢ సంకల్పం దాగి ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్న వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే సమున్నత ఆశయంతోనే ఆయన అంటార్కిటికాలోని సుప్రా గ్లేసియర్ సరస్సులో ఐష్ షీట్ (మంచుపలక) కింద నుంచి ఈదారు. తద్వారా మంచు పలకల కింద ఈత కొట్టిన తొలి మనిషిగా నిలిచి ఔరా అన్పించుకున్నారు. అయితే, ఆ చల్లదనానికి తట్టుకొనేలా ప్రత్యేక ఏర్పాట్లేవీ చేసుకోకుండానే కేవలం స్విమ్మింగ్ సంబంధిత దుస్తులు, టోపీ, కళ్లద్దాలతో మాత్రమే పది నిమిషాల పాటు ఈత కొట్టారు లెవిస్ ఫ్యూ. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులపై అవగాహన కల్పించేందుకే ఈ సాహసం చేసినట్టు ఆయన తన ట్విటర్‌లో వెల్లడించారు. తూర్పు అంటార్కిటికాలోని వాతావరణ పరిస్థితులను తెలిపేందుకే ఇలా చేసినట్టు పేర్కొన్నారు. ‘‘ఇక్కడ మంచు కరిగిపోతుండటాన్ని నేను స్వయంగా గమనించాను. వాతావరణ ఎమర్జెన్సీని ఎదుర్కోబోతున్నామనడంలో నాకెలాంటి సందేహం లేదు. ప్రపంచ నేతలంతా దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలి. కాలం గడిచిపోతోంది. ప్రతిఒక్కరూ ఈ సందేశాన్ని షేర్ చేయండి’’ అంటూ ఫగ్ ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు. దీనికి తోడుగా #COP26 అనే పేరుతో హ్యాష్‌ట్యాగ్ కూడా జత చేశారాయన. అనంతరం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మరో ఫొటోను జతచేస్తూ ఈ స్విమ్మింగ్ సమయంలో తానెదుర్కొన్న అనుభవాన్ని పంచుకున్నారు. అంటార్కిటికా మంచు గడ్డల కింద ఈదడం ఓ అద్భుతమైన, భయానక అనుభవం ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఈ సరస్సులో ఏర్పడిన మంచు పగుళ్ల మధ్య ఈత కొట్టినప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. చీకటితో పాటు మంచు గడ్డల నుంచి అకస్మాత్తుగా తనకెదురైన ముప్పు నుంచి అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడి ఈతను పూర్తిచేసినట్టు ఆయన తెలిపారు. మంచు పలకల కింద ఫ్యూ ఈత ప్రయాణం ఇప్పుడే ఆరంభమైందనీ.. ఆయన తర్వాతి ప్రయత్నం సుప్రా గ్లేసియర్ సరస్సు మొత్తం ఈదిన తొలి వ్యక్తిగా నిలవడమేనంటూ ఇండిపెండెంట్ మీడియా సంస్థ తెలిపింది.
వయస్సు 50. ఉష్ణోగ్రత 0డిగ్రీలు.
Related tags :