పోటులో అగ్ని ప్రమాదాల నివారణకు థర్మోఫ్లూయిడ్ స్టౌలు
– టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమలలో బూందీ పోటులో అగ్ని ప్రమాదాల నివారణకు త్వరలో 26 థర్మోఫ్లూయిడ్ స్టౌలు ఏర్పాటు చేస్తామని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ బూందీ పోటులో సిబ్బందికి అవగాహన కల్పించేలా మార్గదర్శకాలను రూపొందించామన్నారు.
ఆరోగ్యశాఖాధికారి ప్రతిరోజూ పోటును పరిశీలిస్తారని, ఎస్ఇ-2 ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అధికారుల కమిటీ వారానికి రెండు సార్లు పోటును పరిశీలించి తగిన సూచనలిస్తుందని వివరించారు.
బాణలిలో నెయ్యి నింపేందుకు స్టెయిన్‌లెస్ స్టీల్ రోజ్ ట్యాంకులను వినియోగిస్తామన్నారు.
వసతి కల్పన విభాగంలో మరింత పారదర్శకతను పెంచేందుకు వీలుగా అరైవల్స్, రెఫరల్స్‌ను పూర్తి వివరాలతో కంప్యూటరీకరించాలని సూచించారు.
తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పలు విశ్రాంతిగృహాల్లో 724 డిస్పెన్సర్లను ఏర్పాటుచేశామని, 3 వేల వాటర్ క్యాన్లను పంపిణీ చేశామని వివరించారు
త్వరలో మరిన్ని డిస్పెన్సర్లు, వాటర్ క్యాన్లు అందుబాటులో ఉంచుతామన్నారు.
అనంతరం ఫిబ్రవరి 25 నుండి మార్చి 1వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న వేద విద్వత్ సదస్సు ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సమావేశంలో టిటిడి ఎఫ్ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ జి.రామచంద్రారెడ్డి, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్‌వో శ్రీ మనోహర్, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్ఆర్.రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.