Sports

సానియా మీర్జా బయోపిక్

Sania Mirza's Biopic On Lines-Telugu Sports News

ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ,రాజకీయ ,క్రీడా రంగాలకు చెందిన లెజండ్రీల బయోపిక్‌ల నిర్మాణం వరుస కడుతున్నాయి. ఇంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ల నుంచి బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్, క్రీడాకారులు ధోనీ, సచిన్, ఎన్‌టీఆర్, ఎంజీఆర్, జయలలితల వరకూ జీవిత చరిత్రలు తెరరూపం దాల్చడం చూస్తున్నాం. జయలలిత బయోపిక్‌ నిర్మాణంలో ఉంది. ఇక మరో క్రికెట్‌ క్రీడాకారుడు కపిల్‌దేవ్‌ బయోపిక్‌ నిర్మాణం జరుపుకుంటోంది. అదే విధంగా అథ్లెటిక్‌ క్రీడాకారిణి మిలన్‌సింగ్, బాక్సింగ్‌ క్రీడాకారిణి మెరీకోమ్‌ల జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రాలు విడుదలై కాసుల వర్షం కురిపించాయి. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా, పీవీ సింధు, మహిళా క్రికెట్‌ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌ వంటి క్రీడాకారిణుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. తాజాగా టెన్నీస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా జీవిత చరిత్ర తెరకెక్కనుంది. దీని గురించి సానియానే ఓ భేటీలో స్వయంగా తెలిపింది. తన జీవిత చరిత్ర తెరకెక్కనున్న విషయం నిజమేనని, దీని గురించి కథారచయితతో పలు అంశాలు షేర్‌ చేసుకోనున్నానని సానియా తెలిపారు. చాలా మందికి క్రీడాకారుల ప్రవర్తన, వారి కఠిన శ్రమ, తల్లిదండ్రుల త్యాగం వంటివి తెలియడం లేదని, వారిలో గ్లామర్‌ను మాత్రమే చూస్తున్నారని ఆమె అన్నారు. అందువల్లే తన బయోగ్రప్రీతో తెరకెక్కనున్న చిత్రంలో తానూ భాగం పంచుకోవాలనుకుంటున్నానని అన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఎవరు దర్శకత్వం వహించనున్నారు? తన పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంపై స్పష్టతనివ్వలేదు. అయితే ఇందులో కరీనాకపుర్‌ను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.