దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటామోటార్స్ నుంచి పాపులర్ మోడళ్లలో ఒకటైన నెక్సాన్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను తీసుకొచ్చారు. నెక్సాన్ విద్యుత్ వాహనాన్ని మంగళవారం విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 13.99లక్షలు(ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది. గత డిసెంబరులోనే టాటామోటార్స్ ఈ విద్యుత్ కారును ఆవిష్కరించింది. ఈ సందర్భంగా టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. వచ్చే 24 నెలల్లో మరో నాలుగు విద్యుత్ వాహన మోడళ్లను విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో రెండు ఎస్‌యూవీలు, ఒక హ్యాచ్‌బ్యాక్, ఒక సెడాన్ మోడల్ ఉండనున్నట్లు చెప్పారు. జిప్‌ట్రాన్ సాంకేతికతో టాటామోటార్స్ ఈ విద్యుత్ వాహనాలను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. పర్సనల్ సెగ్మెంట్ కింద తీసుకొచ్చిన ఈ నెక్సాన్ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. హై వోల్టేజ్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం, బ్యాటరీ లైఫ్‌ను పెంచుకునే సదుపాయం, అధునాతన భద్రతా ప్రమాణాలు దీని అదనపు ఫీచర్లు. దేశవ్యాప్తంగా 22 నగరాల్లోని 60 అధికారిక టాటామోటార్స్ డీలర్‌షిప్‌ల ద్వారా నెక్సాన్ ఈవీని కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.
విద్యుత్ నెక్సాన్ వచ్చేసింది
Related tags :