అమెరికాలో శాశ్వత నివాసం కల్పించే గ్రీన్‌కార్డుల జారీ నిబంధనలను కఠిన తరం చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతి కల్పించింది. ప్రభుత్వ పథకాలు వినియోగించుకునే వలసదారులకు గ్రీన్‌కార్డులు ఇవ్వకూడదని నిర్ణయిస్తూ గతేడాది అమెరికా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కొత్త నిబంధనలపై స్టే విధిస్తూ న్యూయార్క్‌లోని రెండో యూస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తీర్పు చెప్పింది. తాజాగా దీనిపై అమెరికా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గ్రీన్‌కార్డుల జారీలో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేలా ట్రంప్ ప్రభుత్వానికి అనుమతినిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 5-4ఓట్లతో సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ పథకాలైన ఆహారం, వైద్యం, గృహవసతి వంటి ప్రయోజనాలు పొందుతున్న వలసదారులకు గ్రీన్‌కార్డ్ తిరస్కరించే వీలుంటుంది. అంటే.. ఇకపై శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకునే వలసదారులు తాము ప్రభుత్వ పథకాలపై ఆధారపడుతున్న పబ్లిక్ ఛార్జర్లు కాదని లేదా ప్రభుత్వానికి భారం కావట్లేదని నిరూపించాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రీన్‌కార్డు తీసుకున్న తర్వాత ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటే గనుక.. అప్పుడు కూడా వారి శాశ్వత నివాసాన్ని రద్దు చేసే అధికారం ఉంటుంది. ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ అమలు చేయలేదు. తాజాగా ట్రంప్ సర్కార్ వీటిపై దృష్టి పెట్టి వీటిని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.
అమెరికా ప్రభుత్వ పథకాలు వాడుకూంటే గ్రీన్‌కార్డు ఇవ్వరు
Related tags :