Movies

తాప్సీకి మిథాలీ ధన్యవాదాలు

Mithali Offers Gratitude To Tapsee For Her Biopic

తన జీవితాన్ని వెండితెరపై వీక్షించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నానని భారత మహిళా క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ అన్నారు. తన కథను ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు వయాకామ్‌ 18 సంస్థకు కృతఙ్ఞతలు తెలిపారు. భారత మహిళా క్రికెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా.. ‘శభాష్‌ మిథు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాప్సీ ప్రధాన పాత్రలో రాహుల్‌ డోలకియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో శభాష్‌ మిథుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా… ‘‘నీ అభిమాన క్రికెటర్‌ ఎవరు అని తరచుగా నన్ను అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్లను మీ అభిమాన మహిళా క్రికెటర్‌ అడగండి’’… ఈ స్టేట్‌మెంట్‌ ప్రతీ క్రికెట్‌ ప్రేమికుడిని ఒక్క క్షణం ఆలోచింపజేసింది. నిజానికి వాళ్లు ఆటను ప్రేమిస్తున్నారా లేదా ఆటగాళ్లను ప్రేమిస్తున్నారా అనే ప్రశ్నను తలెత్తించింది. మిథాలీ రాజ్‌ నువ్వు గేమ్‌ ఛేంజర్‌’ అంటూ ఆమె మాటలను ఉటంకిస్తూ తాప్సీ తన పవర్‌ఫుల్‌ లుక్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇందుకు స్పందించిన మిథాలీ రాజ్‌… ‘‘ థాంక్యూ తాప్సీ!!… నువ్వు నా జీవితాన్ని వెండితెరపైకి తీసుకువస్తున్నావు’’ అని ట్వీట్‌ చేశారు. నువ్వు దీన్ని మైదానం అవతల పడేలా కొడతావు అంటూ క్రికెట్‌ భాషలో ఆమె నటనా కౌశల్యంపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా నిర్మాణ సంస్థ వయాకామ్‌18 కు కూడా ధన్యవాదాలు తెలిపారు.