మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కోరిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయి 8 నెలలైనా ఆ పని ఎందుకు చేయడం లేదనే ప్రశ్నను వివేకా కుమార్తె ఎన్.సునీత లేవనెత్తారు. తన తండ్రి హత్య కేసు విచారణ సందర్భంగా సీనియరు న్యాయవాది వీరారెడ్డి ద్వారా ఆమె హైకోర్టులో ఈ మేరకు తన వాదనలను వినిపించారు. ‘కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులను మార్చడం, కడపకు కొత్త ఎస్పీ వచ్చాక కేసు నత్తనడకన సాగడం లాంటి పరిణామాలు చూస్తుంటే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో అమాయకులను ఇరికించి అసలైన నేరస్థులను వదిలేస్తారేమో అనే సందేహం కలుగుతోంది’ అని ఆమె కోర్టుకు నివేదించారు. 15 మందిపై తనకు అనుమానాలున్నాయని, అయితే వారిపై నిర్దిష్ట ఆరోపణలు చేయడం లేదంటూ.. వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరుల పేర్లనూ ప్రస్తావించారు. కేసు విచారణ సందర్భంగా దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అన్ని వ్యాజ్యాల్లో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు మంగళవారం ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.
**వ్యాజ్యాలన్నీ కలిపి విచారణ
వివేకా హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు.. లేదా సీబీఐకి అప్పగించాలని ఆయన భార్య వైఎస్ సౌభాగ్యమ్మ, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఇదే అంశంపై తెదేపా ఎమ్మెల్సీ రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి), మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా తాజాగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇవికాక.. వివేకా కుమార్తె ఎన్.సునీత, అల్లుడు ఎన్.రాజశేఖర్‌రెడ్డి మరో వ్యాజ్యం దాఖలు చేశారు. వీటన్నింటిపై జస్టిస్ దుర్గాప్రసాదరావు మంగళవారం విచారణ జరిపారు. ప్రతిపక్ష నేతగా జగన్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్న చంద్రబాబు నాయుడికి, తెదేపా కార్యదర్శికి నోటీసులు జారీచేశారు.
*మాకు అనుమానాలున్నాయి: సునీత
తన తండ్రి వివేకానందరెడ్డి హత్యపై దర్యాప్తు జరుగుతున్న తీరు మీద తమకు అనుమానాలున్నాయని వివేకా కుమార్తె ఎన్.సునీత, అల్లుడు ఎన్.రాజశేఖరరెడ్డి కోర్టులో పేర్కొన్నారు. 2019 మార్చి 15న తన తండ్రి హత్యకు గురయ్యారని, తాము హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకునేసరికే పడకగది, బాత్రూంలోని రక్తపు మరకల్ని శుభ్రం చేశారని చెప్పారు. హత్యకేసుపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటుచేస్తూ నాటి డీజీపీ అదే రోజు ఉత్తర్వులిచ్చారని తమ ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న తన అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వివేకా హత్య వెనుక తెదేపా నేతల హస్తం ఉందని ఆరోపిస్తూ.. దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారన్నారు. ఎన్నికల్లో వైకాపా గెలిచి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్ 2019 జూన్ 13న సిట్‌ను కొత్త అధికారులతో తిరిగి ఏర్పాటుచేశారని చెప్పారు. ఈ సిట్ 1300 మందిని విచారించి, కేసులో సాక్ష్యాలను సేకరించిందని.. కానీ 2019 అక్టోబరులో కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని అన్నారు. సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి, అన్న జగన్ గతంలో దాఖలుచేసిన వ్యాజ్యాలు రెండింటిలో ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్లు దాఖలు చేయలేదని.. అలాగే జగన్ సీఎం అయ్యి 8 నెలలవుతున్నా సీబీఐ దర్యాప్తు కోరలేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.. తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్‌ను ఏర్పాటుచేసి ఉండకూడదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లు భావించాలని తెలిపారు. తమ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా ప్రస్తావించారు.
సునీత అనుమానాలు వ్యక్తం చేసిన పేర్లు..
1. వాచ్‌మన్ రంగయ్య, 2. యర్ర గంగిరెడ్డి (మృతునికి అత్యంత సన్నిహితుడు), 3.యూసీఐఎల్ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి (వైఎస్ అవినాష్‌రెడ్డికి సన్నిహితుడు), 4. డి.శివశంకరరెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి, (వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డికి సన్నిహితుడు), 5 పరమేశ్వరరెడ్డి, 6. కసునూరుకు చెందిన దివంగత శ్రీనివాసరెడ్డి, 7. వైఎస్ అనినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, 8. వైఎస్ అవినాష్ రెడ్డి బాబాయి వైఎస్ మనోహర్‌రెడ్డి, 9. వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు, 10 శంకరయ్య సర్కిల్ ఇన్‌స్పెక్టర్, 11. రామకృష్ణారెడ్డి ఏఎస్‌ఐ, 12 ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, 13 మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, 14 ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాధ్‌రెడ్డి (బీటెక్ రవి) 15, పరమేశ్వరరెడ్డి (బావమరిది సురేందర్‌రెడ్డి).
**ఎవరెవరిపై ఏవేం అనుమానాలు..
తన తండ్రి హత్యకేసులో సునీత చేసిన ప్రధాన ఆరోపణలివీ..
*వైఎస్ భాస్కర్‌రెడ్డి:
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయాక భాస్కర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిపాదించగా వివేకానందరెడ్డి వ్యతిరేకించారు.
*వైఎస్ మనోహర్‌రెడ్డి:
బాత్రూం, బెడ్రూంలలోని రక్తపుమరకలను శుభ్రం చేయమని మనోహర్‌రెడ్డి తనకు చెప్పారంటూ యర్ర గంగిరెడ్డి పోలీసులకు చెప్పారు. మేం జైల్లో కలిసినా ఇదే విషయాన్ని చెప్పారు.
*వైఎస్ అవినాష్‌రెడ్డి (కడప ఎంపీ):
ఘటనా స్థలానికి ఉదయం 6గంటలకే చేరుకున్న మొదటి కుటుంబసభ్యుడు. గదులను శుభ్రం చేసేటపుడు అక్కడకు సమీపంలో ఉన్నారు. శంకర్‌ను రక్షించడానికి అవినాష్ ప్రయత్నిస్తున్నారనేది మా విశ్వాసం. కడప ఎంపీగా అధికారులపై ప్రభావం చూపగలరు.వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీత వ్యక్తం చేసిన అనుమానాలు ఇవీ.. (వీరిపై అనుమానాలున్నాయి గానీ, వారిపై నిర్దిష్ట ఆరోపణలు చేయడం లేదని ఆమె చెప్పారు.)
రంగయ్య వాచ్‌మన్: ఘటన జరిగిన రోజు ఇతను మాత్రమే ఇంటివద్ద ఉన్నారు. మార్చి 14వ తేదీ 12.45 (పీ:ఎం) రాజశేఖర్‌కు ఫోన్‌చేసి పులివెందులకు ఎప్పుడు తిరిగివస్తారని అడిగారు. అయితే తర్వాత తాను ఫోన్ చేయలేదని నిరాకరించారు. ఫోన్ చేయమని ఆయనకు ఎవరు సూచించారు? మృతుడు సజీవంగా చివరిసారి చూసిన వ్యక్తి ఆయనే. నిద్రలో ఉన్నాను. ఏమి వినపడలేదు అని చెబుతున్నాడు. గాడ్రెజ్ షెల్ఫ్ స్టీల్ హ్యాండిల్ బద్దలు కొట్టారు. ఆ శబ్దం రంగయ్యకు వినిపించలేదా?
*యర్ర గంగిరెడ్డి:
వివేకానందరెడ్డికి చాలా సన్నిహితుడు. గంగిరెడ్డి, వివేకానందరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారు. గంగిరెడ్డి ఘటనా స్థలానికి ఉదయం ఏడు గంటల ప్రాంతలో వచ్చారు. వివేకా కుటుంబానికి దగ్గరయినా, ఫోన్ చేయలేదు. ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు
*ఉదయ్‌కుమార్‌రెడ్డి :
ఉదయ్, ఈసీ సురేందర్‌రెడ్డి.. మార్చి 14/15వ తేదీ మధ్యరాత్రి డి.శివశంకర్‌రెడ్డిని కలిశారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డికి బాగా సన్నిహితుడు
*డి.శివశంకర్‌రెడ్డి:
వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితుడు. గతంలో నేరచరిత్ర ఉంది. మృతుని స్థానంలో ఎమ్మెల్సీగా పోటీచేయాలని భావించారు. శంకర్‌రెడ్డి సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలపై 2010లో వివేకా నిరసన కార్యక్రమం నిర్వహించారు. మృతుడు బతికిఉండగా ఇంటికి ఎప్పుడు రాలేదు. ఘటన చోటు చేసుకున్నరోజు వివేకా బెడ్‌రూంలో ఉండి లోపలికి ఎవర్ని రానివ్వలేదు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయకుండా నిలువరించలేదు.
*పరమేశ్వరరెడ్డి:
స్థానిక నేత. నేరచరిత్ర ఉంది. పలుకేసుల్లో నిందితుడు. హత్య జరిగిన రోజు తాను ఎక్కడో ఉన్నట్లు సాక్ష్యాలను సృష్టించారు. ఎక్కడో ఉన్నట్లు సాక్ష్యాలు సృష్టించాల్సిన అవసరం ఏముంది. నేర ప్రణాళిక ఆయనకు ముందే తెలుసా?
*దివంగత శ్రీనివాసరెడ్డి:
పరమేశ్వరరెడ్డితో వ్యాపార సంబంధాలున్నాయి. ఘటనకు సంబంధించిన ఆధారాల్ని బయటపెట్టడంలేదుసీఐ *శంకరయ్య:
ఉదయం 7.10కి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎం.కృష్ణారెడ్డి అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేయమని కోరారు. కానీ శంకరయ్య సహజమరణం అంటూ వాదనలకు దిగారు. నా భర్త జోక్యంతో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడానికి సీఐ ఎందుకు ఇష్టపడలేదు? సహజమరణం కాదని హిదయతుల్లా చెప్పారు. పడిపోవడం వల్ల రక్తం చింది ఉండవచ్చని ఆతన్ని ఒప్పించే యత్రం చేశారు. ఇతరులు కూడా కిరాతక హత్య అని చెప్పినా సీఐ తిరస్కరించారు.
*ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి:
సిట్ ఏర్పాటు అయ్యేంత వరకు దర్యాప్తు చేశారు. తర్వాత ఈయన్ని సాక్షిగా తీసుకున్నారు. దర్యాప్తుచేసిన వ్యక్తిని సాక్షిగా ఎలా తీసుకుంటారు? అనుమానాస్పదుడైన డి.శివశంకర్‌రెడ్డికి మంచి స్నేహితుడు.
*ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి:
అవినాష్‌రెడ్డికి బందువు. ఉదయ్‌కుమార్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డిలు మార్చి 15వ తేది ఉదయం శంకర్‌రెడ్డి ఇంటికెళ్లారు. ఉదయ్‌కు సన్నిహితుడు. ఆగస్టు 31న అవినాష్‌రెడ్డి, శివశంకరరెడ్డిలతో కలిసి డీజీపీని కలిశారు. తర్వాత దర్యాప్తు నెమ్మదించింది.
*ఆదినారాయనరెడ్డి(మాజీ మంత్రి):
ఘటన చోటుచేసుకున్నప్పుడు మంత్రిగా ఉన్నారు. మృతునికి, ఆదినారాయణరెడ్డికి రాజకీయ వైరం ఉంది. పరమేశ్వరరెడ్డి.. ఆదినారాయణరెడ్డిని కలిసేవారు. పరమేశ్వరరెడ్డి తెదేపా వ్యక్తుల్ని మార్చి 14న సాయంత్రం కలిశారు. వాళ్లు ఏమైనా హత్యకు పథక రచన చేశారా? తెదేపా గెలిస్తే పరమేశ్వరరెడ్డిని రక్షించదలిచారా?
ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్ బీటెక్ రవి: 2016లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివశంకర్‌రెడ్డి సాయంతో వివేకాపై గెలుపొందారు. శివశంకర్‌రెడ్డి, రవి.. ఆదినారాయణరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. హత్య గందరగోళానికి దారితీస్తుంది. వైకాపా నేతల్ని అరెస్ట్ చేస్తారు అనేది వారి అభిప్రాయం కావొచ్చు.
*ఎం.సురేంద్రరెడ్డి:
పరమేశ్వరరెడ్డి బావమరిది. ఆసుపత్రిలో ఉన్న సురేంద్రరెడ్డి ఫోన్ తీసుకొని ఉదయం 3.40 గంటల ప్రాంతంలో పరమేశ్వర్‌రెడ్డికి ఏదో వివరాలు చూపారు. అదే సమయంలో ఉదయ్‌కుమార్ కూడా ఇల్లు వదిలి బటయకు వెళ్లారు. ఆ వివరాలు చూపే చర్య.. హత్య పతకం పూర్తయినట్లుగా వారు భావించినట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకా హత్యకేసులో మరో కీలక మలుపు
Related tags :