ScienceAndTech

ప్లాస్టిక్ రాదారుల నిర్మాణంలోకి రిలయన్స్

Reliance To Build Roads With Plastic Waste

ప్లాస్టిక్‌ వాడకంతో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం సరికొత్త ప్రాజెక్ట్‌ చేపట్టింది ప్రముఖ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. రహదారుల నిర్మాణంలో వృథా ప్లాస్టిక్‌ను వినియోగించేలా ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ సరికొత్త టెక్నాలజీతో జాతీయ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాను సంప్రదించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఇప్పటికే రోడ్ల నిర్మాణంలో కంపెనీ ప్లాస్టిక్‌ను వినియోగించింది. రాయ్‌గఢ్‌లోని రిలయన్స్‌ నాగోఠణే మానుఫ్యాక్చరింగ్‌ సైట్‌ వద్ద దాదాపు 40 కిలోమీటర్ల ‘ప్లాస్టిక్‌ రోడ్‌’ను నిర్మించింది. తారులో 50 టన్నుల వృథా ప్లాస్టిక్‌ను కలిపి ఈ రహదారిని నిర్మించింది. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు తమకు 14-18 నెలల సమయం పట్టిందని కంపెనీ పెట్రోకెమికల్స్‌ బిజినెస్‌ సీవోవో విపుల్‌ షా తెలిపారు. పాలిథిన్‌ బ్యాగ్‌లు, చిరుతిళ్ల ప్యాకెట్లు తదితర సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను రోడ్డు నిర్మాణంలో వినియోగించినట్లు చెప్పారు. జాతీయ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాతో కలిసి ‘ప్లాస్టిక్‌ రోడ్ల’ను నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని విపుల్‌ షా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు కూడా తమ టెక్నాలజీని ఆఫర్‌ చేస్తున్నామన్నారు. ‘ఈ టెక్నాలజీ వల్ల ప్లాస్టిక్‌ను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు తక్కువ ఖర్చులో రోడ్ల నిర్మాణం చేపట్టొచ్చు. కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి 1 టన్ను వృథా ప్లాస్టిక్‌ అవసరమవుతుందని తేలింది. దీని వల్ల కిలోమీటరుకు దాదాపు రూ. లక్ష చొప్పున ఖర్చు ఆదా అవుతుంది’ అని విపుల్‌ షా చెప్పుకొచ్చారు. ఈ రోడ్లు వర్షాలకు కూడా తట్టుకుంటాయని తెలిపారు.