DailyDose

ముకేష్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు-వాణిజ్యం

Supreme Court Cancels Mukesh Petition-Telugu Business News Roundup

*సంచలనం సృస్టించిన నిర్భయ అత్యాచారం హత్య కేసులో దోషిగా ఉన్న ముకేష్ కుమార్ పిటిషన్ ను సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం కొట్టేసింది. ముఖేష్ తమ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరష్కరించిన నేపద్యంలో చివరి అవకాశంగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
* దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. చైనా కరోనా వైరస్‌ ప్రభావంతో గత రెండు రోజులుగా డీలా పడిన మార్కెట్లు బుధవారం మళ్లీ పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 231 పాయింట్లు లాభపడి.. 41,198 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 12,129 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.24 వద్ద కొనసాగుతోంది. బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశాలు ఉందన్న సంకేతాలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈలో టాటా మోటర్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ బజాజ్ ఫిన్‌సర్వ్‌, నెస్ట్‌లే షేర్లు లాభాల్లో పయనించగా.. ఐషర్‌ మోటర్స్‌, యస్‌ బ్యాంకు, టీసీఎస్‌, డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలతో ముగిశాయి.
* కార్ల తయారీ సంస్థ హోండా తన పాపులర్‌ కారుమోడల్‌ హోండా అమేజ్‌లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా తొలి మోడల్‌కారు ‘అమేజ్‌ 2020’ని లాంచ్‌ చేసింది. దీని ప్రారంభధరను. 6.09 లక్షలుగా(ఎక్స్‌ షోరూం, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.
*సాంకేతిక (టెక్) అంకుర సంస్థల్లో ఏటా రూ.100 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టాలని హెచ్డీఎఫ్సీ బోర్డు నిర్ణయించిందని సంస్థ ఛైర్మన్ దీపక్ పరేఖ్ మంగళవారం ఇక్కడ టైకాన్ వార్షిక సదస్సులో చెప్పారు. అంకుర వ్యవస్థను అధ్యయనం చేసి, అనువైన సంస్థలను ఎంచుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిపారు.
*ఎలివేటర్లు, ఎస్కలేటర్ల ఉత్పత్తి సంస్థ జాన్సన్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా హైస్పీడ్, విల్లా లిఫ్టులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ కంట్రీ హెడ్ (మార్కెటింగ్) ఆల్బర్ట్ ధీరవియం మాట్లాడుతూ వైవిధ్యమైన మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో 30-40 అంతస్తుల కోసం హైస్పీడ్ లిఫ్ట్లను ప్రవేశపెట్టామని చెప్పారు.
*బజాజ్ ఆటో సీటీ, ప్లాటినా మోటార్సైకిల్ మోడళ్లలో బీఎస్-6 నిబంధనలకు లోబడిన వెర్షన్లను విపణిలోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.40,794 (ఎక్స్-షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు. బీఎస్-6 సీటీ, ప్లాటినా మోడళ్లలో ఎలక్ట్రానిక్ ఇంజెక్షన్ (ఈఐ) అమర్చారు. బీఎస్-6 సీటీ మోడల్ రెండు ఇంజిన్ వేరియంట్లు 100సీసీ, 110సీసీలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.40,794. ఇక ప్లాటిన్ సైతం 100సీసీ, 110సీసీ హెచ్-గేర్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.47,264. బీఎస్-6 ప్లాటినా ఎలక్ట్రిక్ స్టార్ట్ ధర రూ.54,797గా ఉంది. బీఎస్-4 వేరియంట్తో పోలిస్తే దీని ధర రూ.6,368 అధికం.
*ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల నేపథ్యంలో ఐఆర్డీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. విలీనం కాబోయే బ్యాంకు ఖాతాదారుల గ్రూప్ ఆరోగ్య బీమా పాలసీలను, బీమా కంపెనీలు పాలసీ వ్యవధి పూర్తయ్యే వరకు కొనసాగించాలని సర్క్యూలర్లో ఆదేశించింది. 2021 ఏప్రిల్కు 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. బీమా కంపెనీలు బ్యాంకులతో కలిసి ఇందుకు అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. విలీన బ్యాంకుల పాలసీదార్లను రక్షించేందుకు ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ తెలిపింది.
*దిగ్గజ మదుపరి రాకేశ్ ఝున్ఝున్వాలాపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కన్నేసింది. ఆప్టెక్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై సెబీ నోటీసులు జారీ చేసింది. ఆప్టెక్లో రాకేశ్ ఝున్ఝున్వాలా, ఆయన కుటుంబ సభ్యులకు మెజారిటీ వాటా ఉంది.
*అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి మారుతీ సుజుకీ ఏకీకృత ప్రాతిపదికన రూ.1,587.40 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1.524.50 కోట్లతో పోలిస్తే లాభం 4.13 శాతం పెరిగింది. వ్యయ నియంత్రణ చర్యలకు తోడు కమొడిటీ ధరలు, కార్పొరేటు పన్ను రేట్లు దిగిరావడం కంపెనీ లాభాలు నమోదు చేయడానికి కారణమైందని మారుతీ సుజుకీ తెలిపింది. ఏకీకృ ఆదాయం కూడా రూ.19,680.70 కోట్ల నుంచి 5.29 శాతం పెరిగి రూ.20,721.80 కోట్లకు చేరింది
*దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ నెక్సాన్లో విద్యుత్ వెర్షన్ను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా)గా నిర్ణయించారు. గత డిసెంబరులో కంపెనీ మొట్టమొదటిసారిగా విద్యుత్ నెక్సాన్ను ఆవిష్కరించింది. వచ్చే రెండేళ్లలో నాలుగు విద్యుత్ మోడళ్లను విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో రెండు ఎస్యూవీలు, ఒక హ్యాచ్బ్యాక్, ఒక సెడాన్ మోడల్ ఉంటుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు.
* దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. బుధవారం ఒక్కరోజే వెండి ధర ఏకంగా రూ. 1,083 తగ్గింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజీ ధర రూ. 46,610గా ఉంది. అటు పసిడి కూడా దిగొచ్చింది. రూ. 182 తగ్గడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 41,019 పలికింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో రాత్రికి రాత్రే పసిడి విలువ తగ్గడం ఈ లోహాల ధరలపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీనికి తోడు స్థానికంగా నగల వ్యాపారులు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం కూడా ధరల తగ్గుదలకు కారణమైందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.