తిన్నది అరిగినట్లు లేదనగానే, ‘కొద్దిగా వాము వేడినీళ్లతో కలిపి తీసుకోమని’ ఇంట్లో పెద్దొళ్లు చెబుతుంటారు. చక్రాల (జంతికలు, మురుకులు) వంటి కొన్ని పిండి వంటల్లో వాము వాడటం పరిపాటి. దీనితో వాము జీర్ణశక్తికి మంచిదని చాలామందికి తెలుసు. కానీ అంతకుమించి వాము ఎంతో ఉపయోగకరం. జీలకర్రలా కనిపించే ఇది రూపంలో చిన్నగా ఉన్నా చేసే మేలు చాలా గొప్పది. వామును నీళ్లలో నానబెట్టి, ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే, వాంతులు తగ్గుతాయి. వాము, ధనియాలు, జీలకర్ర మూడింటినీ దోరగా వేయించి, కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి, ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, కడుపునొప్పి తగ్గుతాయి. వామును కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలతో కలిపి ముద్దగా నూరి, దంతాల మూలల్లో పెట్టుకుంటే అన్నిరకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి. వామును బుగ్గన పెట్టుకుని, నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గురగుర శబ్ధాలు తగ్గుతాయి. వాము మూత్రపిండాల్లో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. ప్రసవం తర్వాత స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి చెందుతాయి. జలుబు, మైగ్రెయిన్ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి, మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. గుండె వ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖపాత్ర పోషిస్తుంది.
వాముతో కిడ్నీ రాళ్లు మాయం

Related tags :