ఓవైపు ఆర్థిక మందగమనం.. మరోవైపు రికార్డు స్థాయిలో పెరిగిన ధరలతో గతేడాది పసిడికి గిరాకీ పడిపోయింది. 2019లో భారత్‌లో బంగారానికి డిమాండ్ 9శాతం తగ్గి 690.4 టన్నులుగా ఉందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూసీజీ) గురువారం తాజా నివేదికలో వెల్లడించింది. 2018లో 760.4 టన్నుల పుత్తడికి గిరాకీ లభించింది. 2019 చివరి నాటికి దేశంలో 10 గ్రాముల పసిడి ధర రూ. 39వేల పైనే ఉంది. 2018తో పోలిస్తే ఇది దాదాపు 24శాతం ఎక్కువ కావడం గమనార్హం. అటు 2019లో పసిడి దిగుమతులు కూడా పడిపోయాయి. 2018లో 755.7 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకోగా.. గతేడాది దిగుమతులు 14శాతం తగ్గి 646.8 టన్నులుగా ఉన్నాయి. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో పాటు రిసైకిల్ చేసిన పుత్తడి విలువ 37శాతం పెరగడంతో దిగుమతులు తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి భారత మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరమ్ తెలిపారు. ‘దేశీయంగా రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు.. బలహీన ఆర్థిక సంకేతాలు గతేడాది పసిడి విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ధన త్రయోదశి లాంటి శుభదినాల్లోనూ కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ ముందు మాత్రం డిమాండ్ కాస్త పెరిగింది’ అని సోమసుందరమ్ చెప్పారు. అయితే 2020లో మాత్రం బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను అంగీకరించడంతో పాటు బడ్జెట్‌లో తీసుకొచ్చే ఆర్థిక సంస్కరణలతో కొనుగోళ్లు పెరగొచ్చని సోమసుందరమ్ అభిప్రాయపడ్డారు. 2020లో 700-800 టన్నుల పసిడికి గిరాకీ లభించొచ్చని అంచనా వేశారు. అయితే బంగారం దిగుమతులపై ప్రభుత్వం విధించిన 12.5శాతం కస్టమ్స్ సుంకాన్ని 10శాతానికి తగ్గిస్తే దిగుమతులు పెరుగుతాయని అన్నారు.
బంగారం ధర పెరిగింది…డిమాండ్ తగ్గింది
Related tags :