Fashion

వజ్రాల నాణ్యత ఇలా…

Check your diamond quality this way

మెరిసేదంతా బంగారం కాదు అంటారు. అలాగే ధగధగలాడేవన్నీ వజ్రాలూ కావు. కాబట్టి లక్షల రూపాయల ఖరీదు చేసే వజ్రాల నగలు కొనే సమయంలో ఆ జాతి రాళ్ల నాణ్యత గురించి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే పెట్టుబడి వృథా కాకుండా ఉంటుంది!
**భూగర్భంలో తయారయ్యే వజ్రాలు మలినాలను కలిగి ఉంటాయి. శుద్ధి చేసిన తర్వాత అవి మేలు రకం వజ్రాలుగా రూపం పోసుకుంటాయి. అయితే వాటిలో ఎంతో కొంత ఇంప్యూరిటీలు ఉండిపోతాయి. అయినా మెరుపులో ఏ మాత్రం కొరత ఉండదు. అయితే వజ్రాలలో మిగిలిపోయిన మలినాల ఆధారంగా వాటిని వర్గీకరించి విక్రయిస్తూ ఉంటారు. వాటిలో రకాలు ఇవే!
*వి.వి.ఎస్‌.ఇ:
వెరీ వెరీ స్మాల్‌ ఇంక్లూజన్‌ అంటే… వజ్రంలో కంటికి కనిపించని సూక్ష్మ మరక లేదా మలినం ఉందని అర్థం. ఈ కోవకు చెందిన వజ్రాలు మేలైనవి. మిరుమిట్లు గొలిపే వెలుగులు వెదజల్లగలవు. కాబట్టే ఈ రకం వజ్రాలు ఖరీదు ఎక్కువ. ఒక క్యారట్‌ వి.వి.ఎస్‌.ఇ రకం వజ్రాల ధర 46 వేల నుంచి 48 వేల రూపాయల వరకు ఉంటుంది.
*వి.ఎస్‌.జి.హెచ్‌:
వెరీ స్మాల్‌ ఇంక్లూజన్‌ (జి.హెచ్‌ – లేత పసుపు రంగు) అంటే… వజ్రంలో చిన్న మరక లేదా మలినం ఉందని అర్థం. ఈ కోవకు చెందిన వజ్రాల మెరుపు మొదటి రకం కంటే తక్కువే అయినా, కనిపెట్టగలిగేంత తక్కువగా ఉండదు. ఒక క్యారట్‌ వి.ఎస్‌ రకం వజ్రాల ధర 38 వేల నుంచి 42 వేల రూపాయలు. ఈ రకం వజ్రాల నగల డిజైన్లు ముంబయ్‌ నుంచి దిగుమతి అవుతుంటాయి.
*ఎస్‌.ఐ:
స్మాల్‌ ఇంక్లూషన్‌ అంటే… వజ్రంలో మరక పరీక్షిస్తే కనిపిస్తుంది. ఈ కోవకు చెందిన వజ్రాల రంగు కూడా కొంత తగ్గుతుంది. వీటి ధర క్యారట్‌కు 28 వేల నుంచి 35 వేల రూపాయలు. తక్కువ నాణ్యత కలిగినవి కాబట్టి ఈ రకం వజ్రాలతో తయారయ్యే నగలు భారీవి ఎంచుకోకుండా, ఉంగరాలు, జుంకాలు లాంటి ఫ్యాన్సీ రకం నగలు ఎంచుకోవచ్చు.
*హెచ్‌.ఐ:
హైలీ ఇంక్లూడెడ్‌ అంటే… వీటిలో మలినాలు చాలా ఎక్కువ. ఢిల్లీలో ఈ నగల కొనుగోళ్లు ఎక్కువ. వీటి ధర క్యారట్‌కు 15 నుంచి 25 వేల రూపాయలు.
ఏ కోవకు చెందిన వజ్రాలు అయినా రిటర్న్‌ వ్యాల్యూ నూటికి నూరు శాతం ఉంటుంది. కాబట్టి కొనే సమయంలో తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి.