Editorials

తిరువూరు మీదుగా తెలంగాణకు పెద్దఎత్తున అక్రమంగా తరలివెళ్తున్న ఇసుక-TNI ప్రత్యేకం

Illegal Sand Transport Happening Through Tiruvuru To Telananga

నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అవినీతి రహిత పాలన అందిస్తానని అన్నింటీలోనూ పారదర్శకంగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆడంబరంగా ప్రకటించారు. కానీ గత ప్రభుత్వం కంటే దారుణంగా వైకాపా ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లిపోతుంది. అధికార పార్టీ నాయకులు అడ్డదారులో వెళ్తూ అక్రమాలకు తెరలేపారు. కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక కూడా దొరకడంలేదు. దీనికి తోడు మట్టి తోలకం పైనా ఆంక్షలు విధించారు.

కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం నుండి ప్రతి నిత్యం కోట్లాది రూపాయల ఇసుక తెలంగాణకు పెద్ద ఎత్తున తరలివెళ్తోంది. తిరువూరు నియోజకవర్గం నుండి తెలంగాణకు వెళ్ళడానికి దాదాపు పది సరిహద్దు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల గుండా ప్రతి నిత్యం కోట్లాది రూపాయల ఇసుక హైదరాబాద్ కు తెలంగాణలోని ఇతర జిల్లాలకు తరలివెళ్తుంది. పెద్దపెద్ద కంటైనర్లు, లారీలు, టిప్పర్లు ట్రాక్టర్ల ద్వారా పెద్ద ఎత్తున ఇసుక కృష్ణాజిల్లాలోని వివిధ ఇసుక రేవుల నుండి తరలివెళ్తుంది. అధికార పార్టీకి చెందిన నేతల హస్తం ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నట్లు సమాచారం. పలువురు అధికారులు కూడా వీరికి సహకరిస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. గత బుధవారం రాత్రి(29వ తేదీ) తిరువూరు బైపాస్ మీదుగా తెలంగాణకు వెళ్తున్న నాలుగు ఇసుక లారీలను తిరువూరు పోలీసులు పట్టుకున్నారు. ఒక్క రోజులోనే నాలుగు ఇసుక లోడు ఉన్న భారీ వాహనాలు పట్టుబడటం ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది. నెలరోజుల క్రితమే రెండు లారీలు పోలీసులకు పట్టుబడగా వాటిని నామమాత్రపు జరిమానాతో వదిలివేసినట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమది ప్రజల ప్రభుత్వమని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ ప్రజల కష్టాలను గమనించడం లేదని వారు వాపోతున్నారు. ఇసుక రవాణా పారదర్శకం అంటూ ప్రజలకు దానిని అందుబాటులో లేకుండా చేస్తున్నారని భవన నిర్మాణ దారులు ఆందోళన చెందుతున్నారు.

*** మట్టికూడా తోలుకోనివ్వరట …!
ఇసుక దండాలు ఇలా ఉంటే ఇటీవల కోత్తగా గృహాలు నిర్మించుకునే వారికి మట్టి దొరకక కష్టాలు పడుతున్నారు. స్థలాన్ని మెరక చేసుకోవడానికి, గోతులు పూడ్చుకోవడానికి గతంలో స్థానికంగా ఉన్న వెనక పొలాల నుండి చెరువుల నుండి ట్రాక్టర్ ద్వారా గృహ యజమానులు మట్టిని తెచ్చుకునేవారు. గత కొద్ది నెలల నుండి స్థానికంగా ఉన్న రెవెన్యు అధికారులు మట్టి తోలకంపై ఆంక్షలు విధించారు. మైనింగ్ శాఖ వారి అనుమతి తీసుకోవాలని వారు చూపించిన ప్రదేశాల నుండే లారీల ద్వారా మట్టిని తెచ్చుకోవాలని నిబంధనలు విధించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఇసుక పైనా, మట్టిపైనా ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.