NRI-NRT

బెజవాడ KLUలో తానా యంగ్ తరంగ్

TANA Youth Meet In Koneru Lakshmaiah University In Vijayawada

యువతలో సృజన, నైపుణ్యాలతో పాటు సాంస్కృతిక వికాసాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మహిళా విభాగం అధ్యక్షురాలు తూనగుంట్ల్ల శిరీష పేర్కొన్నారు. మొగల్రాజపురంలోని ఓ హోటల్లో గురువారం ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి 3, 4 తేదీల్లో కేఎల్‌ విశ్వవిద్యాలయంలో ‘యంగ్‌ తరంగ్‌’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మాక్‌ పార్లమెంట్‌, జనరల్‌ క్విజ్‌, సోలో, బృంద నృత్యాలు, గానం, ఆంధ్ర సంప్రదాయ వస్త్రధారణ(ఫ్యాషన్‌ షో), మిస్‌ ఆంధ్ర, మిస్టర్‌ ఆంధ్ర పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేఎల్‌ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆర్‌.ఎల్‌.కాంతం మాట్లాడుతూ యువతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తానా మహిళా విభాగం, కేఎల్‌యూ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని చెప్పారు. దీనికి జిజ్ఞాస సంస్థ సహకారం అందిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో కేఎల్‌యూ డీన్‌ పీవీఆర్‌డీ ప్రసాద్‌, జిజ్ఞాస సంస్థ అధినేత భార్గవ్‌, సైకత నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.