Health

కరోనావైరస్‌పై WHO ప్రకటన

WHO Announces On Corona Virus Status

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ్లోబ‌ల్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌ను తాకుతున్న‌ది. దీంతో డ‌బ్ల్యూహెచ్‌వో తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ‌న‌మ్ గెబ్రియాసిస్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. జెనీవాలో డ‌బ్ల్యూహెచ్‌వో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. చైనాలో ఏం జ‌రుగుతున్న‌ద‌న్న అంశ‌మే కాదు, ఈ వైర‌స్ ఇత‌ర దేశాల‌కు కూడా విస్త‌రిస్తున్న‌ద‌ని ఆయ‌న తెలిపారు. ఆరోగ్య వ్య‌వ‌స్థ స‌రిగా లేని దేశాల్లో.. క‌రోనా మ‌రింత ఉదృతంగా మారే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయ‌ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల చైనాలో మృతిచెందిన వారి సంఖ్య 213కు చేరుకున్న‌ది. మ‌రో 18 దేశాల్లో 98 కేసులు న‌మోదు అయ్యాయి. చైనాలోని వుహాన్ సిటీ నుంచి వ‌చ్చిన వారికే ఎక్కువగా ఈ వైర‌స్ సోకిన‌ట్లు తెలుస్తోంది. వైర‌స్ వ‌ల్ల ఇత‌ర దేశాల‌కు ముప్పు ఉంద‌ని గ‌మ‌నించిన నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్‌వో.. గ్లోబ‌ల్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టిస్తుంది.ప్ర‌జా ఆరోగ్యం విష‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ‌తంలో అయిదుసార్లు గ్లోబ‌ల్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. 2009లో స్వైన్ ఫ్లూ వ్యాపించిన‌ప్పుడు గ్లోబ‌ల్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. హెచ్‌1ఎన్‌2 వైర‌స్ వ‌ల్ల సుమారు రెండు ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. అప్ప‌ట్లో స్వైన్ ఫ్లూ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. పోలియో కేసులు ఎక్కువైన‌ప్పుడు 2014లో.. డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. 2016లో జికా వైర‌స్ బీభ‌త్సం సృష్టించింది. బ్రెజిల్‌లో పుట్టిన ఆ వైర‌స్ అమెరికా దేశాల‌ను వ‌ణికించింది. దీంతో జికా వ్యాధి ప‌ట్ల కూడా ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. 2014, 2019 సంవ‌త్స‌రాల్లో.. వెస్ట్ ఆఫ్రికాలో ఎబోలా వ్యాపించింది. ప‌శ్చిమ ఆఫ్రికాలో ఆ వైర‌స్ వ‌ల్ల సుమారు 11వేల మంది మ‌ర‌ణించారు. ఇటీవ‌ల కాంగోలో ఎబోలా వ్యాపించ‌డంతో.. ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు.