* దిల్లిలోని పార్లమెంటు భవనంలో తెదేపాకి కేటాయించిన గదిని మారుస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో తెదేపాకి ఐదో నంబరు గదిని కేటాయించారు. ఈగదిని తాజాగా వైకాపాకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అదే సమయానికి తెదేపాకి 118 వ నంబరు గది కేటాయించారు. ఈనిర్నయంపై తెదేపా ఎంపీలు భాగ్గుమంతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో ఈ విషయమై మాట్లాడటం బాగోదని మిన్నకున్నారు సమావేశాల అనంతరం మీడియా ముందు తమ అభిప్రాయాలను సమావేశాల అనంతరం మీడియా ముందు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని నిర్ణయించారు.
*ఏపీకి మొండి చేయి: విజయసాయి
తాజా బడ్జెట్ చాలా నిరాశ పరిచిందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపించిందన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌లో కొన్ని సానుకూల, ప్రతికూల అంశాలున్నట్లు చెప్పారు. ప్రత్యేకహోదా కోసం ఎదురుచూసినప్పటికీ నిరాశే ఎదురైందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులు విడుదలని కేంద్రాన్ని కోరారు. బడ్జెట్ ప్రసంగంలో వెనుకబడిన 7 జిల్లాల నిధుల ప్రస్తావన లేదని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
* ఈయూ నుంచి వేరుపడిన బ్రిటన్.. 47 ఏళ్ల బంధానికి స్వస్తి
బ్రిటన్ వేరు కాపురం ఆరంభమైంది. ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి విడిపోవాలన్న ప్రజాభీష్టం నెరవేరింది. బ్రిటన్ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలు, భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చింది. మూడున్నర ఏళ్ల క్రితం నిర్వహించిన రెఫరెండంలో 52ు ప్రజలు బ్రెగ్జిట్ వైపే మొగ్గు చూపారు. ఎన్నో అవాంతరాల మధ్య అది చట్టంగా మారడానికి ఇన్నేళ్లు పట్టింది.ఈయూ నుంచి వేరుపడిన తొలి దేశం బ్రిటనే! ఈయూతో 47 ఏళ్ల అనుబంధాన్ని తెగదెంపులు చేసుకోవడం ద్వారా ప్రపంచదేశాలతో సరికొత్తగా వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అమిత స్వేచ్ఛ లభిస్తుంది. ఈయూ నుంచి వేరుపడటం అంతం కాదని, ఇదో కొత్త ఆరంభమని జాన్సన్ స్పష్టం చేశారు. బ్రిటన్ చరిత్రలో మరో నూతనాధ్యాయం మొదలైందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జాన్సన్ పేర్కొన్నారు.
* ఏపీకి నిరాశే ఎదురైంది: బుగ్గన
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ట్యాక్స్ హాలిడేను ఆహ్వానిస్తున్నామని ఏపీ ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. మరోవైపు జీడీపీలో 10 శాతం పెరుగుదల అంచనా ప్రశ్నార్థకమేనని చెప్పారు. సుమారు రూ.8 లక్షల కోట్లు అప్పులున్నాయని కేంద్రం చెబుతోందని, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.1లక్షల కోట్లు ఆదాయం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే కాలంలో అప్పులు మరింత పెరిగి రూ.9 లక్షల కోట్లకు చేరవచ్చన్నారు. బడ్జెట్ ప్రసంగంలో అప్పులు ఎక్కడ నుంచి తెస్తారో సరిగా చెప్పలేదని బుగ్గన అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇచ్చే నిధులపైనే 8 రాష్ట్రాలు ఆధారపడుతున్నాయని బుగ్గన గుర్తు చేశారు.
* కరోనా కంటే.. జగన్ వైరస్ చాలా ప్రమాదం: నక్కా
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్‌బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ తరహాలో ఏపీకి జగన్ వైరస్ పట్టుకుందని విమర్శించారు. కరోనా వైరస్ కన్నా.. జగన్ వైరస్సే చాలా ప్రమాదకరమన్నారు.తుళ్లూరులో రైతుల ఆందోళనకు నక్కా ఆనంద్‌బాబు మద్దతు తెలిపి మాట్లాడారు. రాజధానిలో మహిళలే ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ప్రశంసించారు. హైకోర్టు తరలిపోతున్నా ఇతర ప్రాంతాల వారికి సిగ్గు రావడం లేదా?, అమరావతి మహిళల పోరాటన్ని చూసైనా సిగ్గు తెచ్చు కోవాలన్నారు. రాష్ట్రం మొత్తం స్పందించి.. అమరావతి కోసం ఉద్యమించాలని కోరారు. పాలకులు గాడి తప్పినప్పుడు… తప్పులు చేస్తున్నప్పుడు మేధావులు స్పందించాలన్నారు. ప్రేక్షక పాత్ర వల్ల రాష్ట్రానికి కీడు జరుగుతుందని చెప్పారు. అమరావతి స్మశాసనం అన్న వాళ్లు ఇప్పటి వరకూ ఎక్కడ కూర్చుని పాలించారో చెప్పాలన్నారు.
* జగన్ వల్లే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రిక్తహస్తం: యనమల
సీఎం జగన్ నిర్వాకాల వల్లే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రిక్తహస్తం చూపారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైసీపీ అవినీతి, అసమర్థ నిర్ణయాలతో ఏపీకి తీరని నష్టం వాటిల్లిందని దుయ్యబట్టారు. కేంద్ర నిధులు రాబట్టే సామర్థ్యం జగన్‌లో కొరవడిందని విమర్శించారు. రాష్ట్రంలో గత 8నెలల్లో అభివృద్ధి పనులన్నీ ఆపేశారని, పోలవరం సహా, ప్రాజెక్టుల పనులన్నీ నిలిపేశారన్నారు. పీపీఏలను రద్దు చేయడం జగన్ మొదటి తిక్కపని అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. దీంతో ఏపీకి వచ్చే పెట్టుబడులన్నీ వెనక్కి పోయాయని, 8 నెలల్లోనే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పోగొట్టారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
* టీడీపీకి మరో షాక్.. కీలకనేత రాజీనామా
టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు కీలకనేత, నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ విక్టర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ప్రశంసలు.. టీడీపీపై విమర్శలు గుప్పించారు. పాలన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుపడటం బాధాకరమన్నారు.కర్నూలుకు హైకోర్టు రావడం ఇక్కడ టీడీపీ నేతలకు ఇష్టం లేదని.. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో కార్యకర్తల సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విక్టర్ చెప్పుకొచ్చారు. కాగా.. రాజీనామా అనంతరం ఆ లేఖను ఫ్యాక్స్ ద్వారా టీడీపీ నేత అధిష్టానానికి పంపినట్లు మీడియాకు వెల్లడించారు.
* జేసి దివాకర్ రెడికి వైకాపా షాక్
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా జేసీ మారారని విమర్శించారు. శనివారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. జేసీ దివాకర్ నీతులు మాట్లాడుతారు కానీ పాటించరని మండిపడ్డారు. ఇంట్లో పనిచేసే పని మనుషుల పేర్లతో త్రిశూల్ సిమెంట్స్‌ను అక్రమంగా పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని మనుషుల షేర్లను జేసీ కుటుంబ సభ్యులు లాగేసుకున్నారని దుయ్యబట్టారు.అదే విధంగా రూ. 200 కోట్ల రూపాయల విలువైన సున్నపురాయి గనులను జేసీ అక్రమంగా విక్రయించారని, జేసీకి ఇచ్చిన త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు ప్రభుత్వం రద్ధు చేయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కొండలను దోచుకోవడంతో జేసీ దిట్ట అని.. ఆయన అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. దివాకర్ రెడ్డిపై బినామీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని, అలాగే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
* కేకేపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుపై తెలంగాణ భాజపా నేతలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకేకు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో కింద ఓటు హక్కు కల్పించారని ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని తెరాస ఖూనీ చేసిందని, కేకేపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి పంపించి కేకేపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తదితరులు రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని రాజ్యసభ ఛైర్మన్ చెప్పారని తెలిపారు.
* విశాఖలో రౌడీల ఆగడాలు: చంద్రబాబు
అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. విశాఖలో తెదేపా కార్యాలయాన్ని కాగడాలతో చుట్టుముట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అవినీతి, చేతకానితనం, తెలివి తక్కువతనం దేశం మొత్తం తెలిసిపోయిందని దుయ్యబట్టారు. అందరూ తుగ్లక్ అంటుంటే ఉక్రోషం పట్టలేకే దాడులు, దౌర్జన్యాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలోనే అతి పెద్ద ఎఫ్‌డీఐ, కియా కార్ల పరిశ్రమ, గార్మెంట్ ఇండస్ట్రీస్, విండ్, సోలార్ ప్లాంట్లు వంటి అనేక పరిశ్రమలతో రాయలసీమలో వేలాది మందికి ఉపాధి కల్పించిన తాము ద్రోహులమా అని చంద్రబాబు నిలదీశారు. కియా యాక్సిలరీ యూనిట్లు పుణేకు తరిమేసి.. వేలాది ఉద్యోగాలు పోగొట్టిన వైకాపా వాళ్లు ద్రోహులా అని ప్రశ్నించారు. ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో రౌడీలు కాగడాలు పట్టుకు తిరగడమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా కనిపించిన భూములన్నీ కబ్జా చేసేయడం వైకాపా అరాచకాలకు నిదర్శనమన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది తెదేపా ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఇప్పుడు అధికార వికేంద్రీకరణ ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తోంది వైకాపా అని దుయ్యబట్టారు.
*కో-ఆప్షన్ ఇస్తే న్యాయపోరాటమే-సహకార ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముందుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో శుక్రవారం సమావేశం జరిగింది. సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్అలీ, చిన్నారెడ్డి, మర్రి శశిధర్రెడ్డి, కోదండరెడ్డిలతోపాటు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమీటీ కన్వీనర్ జి.నిరంజన్ తదితరులు హాజరయ్యారు. సహకార సంఘాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.
*భాజపా, కాంగ్రెస్ల కుట్రను పసిగట్టే తెరాసకు మద్దతు: తమ్మినేని
రాజకీయంగా భాజపాను తాము ప్రధాన శత్రువుగా భావిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చౌటుప్పల్ పురపాలిక ఎన్నికల్లో ఆ పార్టీ కాంగ్రెస్తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. దీన్ని సీపీఎం వ్యతిరేకించిందని, ఆ రెండు పార్టీల కుట్రను అడ్డుకునేందుకే తెరాసకు మద్దతునిచ్చామని తెలిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చౌటుప్పల్ పుర ఛైర్మన్, ఉప ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం మధ్య జరిగిన ముందస్తు ఎన్నికల ఒప్పందాన్ని తాము ఉల్లంఘించి తెరాసకు మద్దతునిచ్చామని పేర్కొంటూ.. కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆ పార్టీ కార్యకర్తలు దాడిచేసిన చౌటుప్పల్లోని సీపీఎం కార్యాలయాన్ని, సీపీఎం కౌన్సిలర్ల ఇళ్లను ఈ సందర్భంగా ఆయన సందర్శించారు.
*దిల్లీకి వెళ్లిన కమలనాథులు-ఉపరాష్ట్రపతిని కలవనున్న భాజపా నేతలు
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో పాటు ఆ పార్టీ నేతలు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి దిల్లీకి వెళ్లారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని శనివారం ఉదయం కలవనున్నారు. తుక్కుగూడ మున్సిపాల్టీ ఛైర్మన్ ఎన్నిక జరిగిన తీరును వివరించడంతో పాటు.. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన తెరాస ఎంపీ కేశవరావు తుక్కుగూడలో ఎక్స్అఫీషియో ఓటు వేయడంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. సచివాలయంతో సంబంధం లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణానికి (ప్యారడైజ్ నుంచి శామీర్పేట వైపు) రక్షణశాఖ భూములు ఇవ్వడం, తెలంగాణలో ప్రముఖ బౌద్ధ క్షేత్రాల్ని టూరిజం సర్క్యూట్గా ప్రకటించడం వంటి పలు విజ్ఞప్తులతో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు భాజపా నేత ఒకరు తెలిపారు.
*మత విద్వేషాలతో రాజకీయ లబ్ధికి తెరాస యత్నం-భాజపా ఎంపీలు సంజయ్, అర్వింద్
తెలంగాణలో మతవిద్వేషాలను రగిల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. దిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్తో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తెరాస ఎందుకు వ్యతిరేకిస్తుందో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. పొరుగు దేశాల నుంచి ముస్లింలు తరలివస్తే తమ ఉపాధికి గండి పడుతుందని భారత్లోని ముస్లింలు ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఏఏ, ఎన్ఆర్సీలను అమలు చేస్తామని ప్రకటించారు. సీఏఏను వ్యతిరేకించే తెరాస నేతలతో సహా ప్రతి ఒక్కరూ భవిష్యత్తు తరాల దృష్టిలో దేశద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఆయుష్మాన్భవ ద్వారా దేశంలోని 50కోట్ల మంది లబ్ధి పొందితే.. తెలంగాణలో ఒక్కరికీ అవకాశం దక్కకపోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరే కారణమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుచేస్తే ముస్లింలకు ప్రయోజనం కలుగుతుందని, దాన్ని సైతం పక్కనపెట్టడం ద్వారా ముస్లింలతో పాటు క్రైస్తవులకూ కేసీఆరే ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
*అర్హత వయసు తగ్గిస్తే పింఛన్లు తగ్గడమేంటీ?: చంద్రబాబు
పింఛను అర్హత వయసు ఐదేళ్లు తగ్గిస్తే పింఛనుదార్ల సంఖ్య ఇంకా పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందని.. ఇదేం జగన్మాయ అని చంద్రబాబు ప్రశ్నించారు. 8 నెలల్లో 7 లక్షల పింఛన్లకు కోత పెట్టడం పండుటాకులకు మోసం చేయడమేనని ట్విటర్లో పేర్కొన్నారు. ‘45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం మోసం చేసింది. వికేంద్రీకరణ ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తోంది’ అని చంద్రబాబు విమర్శించారు
*సీఏఏపై మరో స్వాతంత్య్ర పోరాటం
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సి ఉందని సనాతన ధర్మ ప్రచారకులు స్వామి అగ్నివేష్ అన్నారు. పౌరసత్వ బిల్లులను వ్యతిరేకిస్తూ మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ వ్యతిరేక కూటమి ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రజాగర్జన బహిరంగ సభను శుక్రవారం నిర్వహించారు. సభలో అగ్నివేష్ మాట్లాడుతూ.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను ధ్వంసం చేసేలా మోదీ ప్రభుత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు. మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేకు ఆర్ఎస్ఎస్, భాజపా కార్యకర్తలు వారసులయ్యారని విమర్శించారు. కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్ మాదిరిగానే ఏపీలోనూ నల్లచట్టాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
*జర్మనీకి 3 రాజధానులు ఎక్కడివి?
‘జర్మనీకి మూడు రాజధానులున్నాయని బీసీజీ కమిటీ నివేదికలో చెబుతున్నారు. జర్మనీ వాళ్లకు ఈ విషయం తెలిస్తే ప్రభుత్వంపై కేసులేస్తారు’ అని తెదేపా నేత పట్టాభి అన్నారు. జర్మనీకి ఉన్న రాజధాని బెర్లిన్ ఒక్కటేనని పేర్కొన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
*వాల్తేరు క్లబ్పై సానుకూలంగా స్పందించాలి: గంటా శ్రీనివాసరావు
వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథం అవలంబిస్తే మంచిదని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైజాగ్కు ప్రాచీన నామం అయిన వాల్తేరు పేరుతో 1883లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ క్లబ్ వైజాగ్ ప్రజల జీవన విధానంలో మమేకమైందని.. వైజాగ్ బ్రాండ్లో భాగమైందని పేర్కొన్నారు. ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం దీన్ని యథాతథంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
*ఉత్తరాంధ్రపై ఎందుకంత చిన్నచూపు?
మంత్రి ధర్మాన కృష్ణదాస్
ఉత్తరాంధ్రపై తెదేపా నేతలకు ఎందుకంత చిన్నచూపు అని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిలదీశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస దేవస్థాన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శుక్రవారం హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి త్వరలో వారిని కలుస్తారని చెప్పారు.
పార్లమెంటులో మారిన తెదేపా చిరునామా-రాజకీయ
Related tags :