* ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ.. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో లిస్టింగ్‌కు వచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎల్‌ఐసీ వాటాలు విక్రయిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, లిస్టింగ్‌కు ప్రస్తుతమున్న ప్రకియను అనుసరిస్తామని, అందుకోసం కొన్ని చట్ట సవరణలు అవసరమని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో లిస్టింగ్‌కు రావొచ్చని తెలిపారు.
* కేంద్ర బడ్జెట్‌లో ఈసారి ప్రధానమంత్రి రక్షణ కోసం ఉండే ప్రత్యేక రక్షణ బృందాని(ఎస్పీజీ)కి కేటాయించాల్సిన నిధులను మరింత పెంచారు. గతేడాది బడ్జెట్లో ఇందుకోసం రూ.540 కోట్లు కేటాయించగా.. ఈ సారి దాదాపు రూ.600కోట్లు కేటాయించారు. అంతకు ముందు ఏడాది రూ.420 కోట్లు ఉండగా దాన్ని గతేడాది బడ్జెట్‌లో రూ.540 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా 3వేల మంది ప్రత్యేక భద్రతా సిబ్బందితో రక్షణ పొందుతున్నారు.
* స్థోమత గల చిన్న నగరాలకూ విమాన ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అమలు చేస్తున్న ఉడాన్ పథకాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం రాబోయే అయిదేళ్లలో 100 నూతన విమానాశ్రయాలు నిర్మించాలని తలపెట్టింది. రెండు, మూడో అంచె నగరాలకూ ఇందువల్ల విమానాలు నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. విమానాల అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున, దేశాన్ని విమానాల లీజ్‌కు కేంద్రంగా తీర్చిదిద్దాలని కూడా ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి విదితమే. దేశీయంగా ప్రస్తుతం విమానాల సంఖ్య .. సుమారు 600 కాగా. ఆర్థిక సర్వే అంచనా ప్రకారం 2024కు విమానాలు.. 1200కు చేరే అవకాశం ఉంది.
* చిన్న ఎగుమతిదార్ల కోసం ప్రభుత్వం సరికొత్త బీమా పథకాన్ని ప్రకటించింది. బీమా కవరేజీని పెంచుతూ, ప్రీమియాన్ని తగ్గిస్తూ నిర్యత్ రిన్ వికాస్ యోజన(నిర్విక్)ను బడ్జెట్లో ప్రకటించారు.
ఇవీ ప్రయోజనాలు
* ఎగుమతి రుణ బీమా పథకం(ఈసీఐఎస్)గా కూడా పిలిచే ఈ పథకం కింద 90 శాతం అసలు, వడ్డీకి కవరేజీ లభిస్తుంది. 7.6 శాతం వడ్డీకే రుణాలు కూడా లభిస్తాయి.
* ఎగుమతిదార్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు విశ్వాసాన్ని కల్పిస్తుంది. అందుబాటు ధరలో రుణాలు లభిస్తాయి. ఎగుమతిదార్లకు సరిపోయేంత ఎగుమతి రుణాలు వస్తాయి.
* 3.5 శాతం వడ్డీ రేటు వద్ద డాలర్లలో నిధులు లభిస్తాయి. ప్రస్తుతం ఈ రేటు 4-5 శాతంగా ఉంది.
కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల స్థాయిల్లో ఎగుమతిదార్లకు సుంకాలు, పన్నులను డిజిటల్ రూపంలో రిఫండ్ చేయనున్నట్లు ప్రతిపాదించారు.
* అంకురాల వృద్ధికి పన్ను ప్రోత్సాహకాలతో పాటు, పెట్టుబడుల అనుమతుల కేంద్రం ఏర్పాటు తదితరాలను బడ్జెట్లో ప్రతిపాదించింది. అంకురాన్ని ఏర్పాటు చేసిన మొదట్లో నిధులను సమకూర్చడం, ఆలోచన స్థాయిలోనూ తోడ్పాటునందించడానికి నిధి ఏర్పాటునూ ప్రకటించారు.
* ప్రభుత్వంలోని అన్ని మౌలిక రంగ ఏజెన్సీలు అంకురాలతో కలిసిపనిచేయాలి.
* ‘పన్ను చెల్లింపులను అయిదేళ్ల పాటు లేదా కంపెనీని వీడినపుడు లేదా కంపెనీ అమ్మకానికి గురైనపుడు..ఏది ముందైతే అది ప్రాతిపదికన అప్పటిదాకా చెల్లింపులను వాయిదా వేయడానికి అనుమతి ఇస్తున్నట్లు’ మంత్రి తెలిపారు.
* టర్నోవర్ రూ.25 కోట్లు ఉన్న అంకురాలకు ఏడేళ్లలో వరుసగా మూడేళ్ల పాటు లాభాలపై 100 శాతం మినహాయింపును ఇస్తున్నారు. తాజాగా టర్నోవరు పరిమితిని రూ.100 కోట్లకు పెంచడం ద్వారా పెద్ద అంకురాలకూ దీన్ని అందించనున్నారు. ప్రారంభంలో ఈ మినహాయింపును పొందడానికి సరైన లాభాలు కూడా వాటికి రావు కాబట్టి ఈ అర్హత గడువును ఏడేళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతున్నట్లు సీతారామన్ తెలిపారు.