DailyDose

జగన్‌తో మరోసారి చిరంజీవి సమావేశం-తాజావార్తలు

Chiranjeevi Meets YS Jagan - Telugu Breaking News Today

*ఏపీ రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన ఊహాగానం హాట్ హాట్గా చక్కర్లు కొడుతుంది. ఈనెల 6న కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు అన్న సమాచారం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలే సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా జగన్ ను స్వయంగా కలిసిన చిరంజీవి తన సినిమా చూడాలని ఆహ్వానించడం అందరికీ గుర్తుంది.
* భారత్‌లో కరోనా వైరస్‌ మూడో కేసు నమోదైంది. కేరళలోని కాసర్‌గఢ్‌లో ఓ వ్యక్తికి వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. కరోనా వైరస్‌ సోకిన బాధితుడు.. ఇటీవల వూహాన్‌ నుంచి కేరళకు చేరుకున్నాడు. అయితే బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కే కే శైలజ ప్రకటించారు. తొలి రెండు కేసులు కూడా కేరళలోనే నమోదు అయ్యాయి. మొదటి ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది.
* కేరళలోని శబరిమల సహా ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే స్పష్టంచేశారు. విచారణ చేపట్టాల్సిన అంశాల క్రోడీకరణ కోసం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఈ అంశంపై వాదనలు వినిపించేందుకు న్యాయవాదులకు సమయం చెబుతామని ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. శబరిమలపై దాఖలైన రివ్యూ పిటిషన్లతో పాటు ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపైనా రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోలేదని సీజేఐ వెల్లడించారు. మత విశ్వాసాలు, వాటిలో జోక్యం చేసుకొనే విషయంలో న్యాయ పరిధిపై మాత్రమే విచారణ ఖరారు చేయనున్నారు.
* కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. సోనియా గాంధీ వయసు 73 సంవత్సరాలు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె సర్వైకల్ క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే సాధారణ హెల్త్ చెకప్ కోసం ఆమె సర్ గంగారాం ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆసుపత్రిలో ఉన్నారని సమాచారం.
* పర్యాటకులు, బిజినెస్ మ్యాన్ కోసం ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లను 24 గంటలు ఓపెన్ చేయాలని ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా పర్యాటకులకు డ్రింకర్స్ వల్ల ఇబ్బంది కలగకూడదని ఆ రాష్ట్ర సర్కార్ ఓ తీర్మానం చేసింది. రాష్ట్రంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో మద్యం తాగడంపై నిషేధం విధించింది.మహారాష్ట్రలోని ప్రాచీన కోటల దగ్గర మద్యం తాగితే 10 వేల రూపాయలు ఫైన్ వేస్తామని ఆ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఆల్కహాల్ తీసుకోకూడదన్న నిబంధనను ఉల్లంఘించిన వారికి జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది.
* కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవి…రానివి ఏమిటో తేలిపోయింది. దీంతో తమ రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనకు రాష్ట్ర అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కార్యాచరణ మొదలయ్యిందని, ఈ నెల మూడో వారంలో బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయని భావిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసినా సహకార ఎన్నికలు ఉండడం…ప్రస్తుతం మేడారం జాతర జరుగుతుండడంతో మూడో వారం వరకు అన్నీ పూర్తవుతాయి. ఆ సమయంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి అందరికీ అనుకూలంగా ఉంటుందని కేసీఆర్‌ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
* టూ వీలర్స్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్‌ ఇస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే ఇద్దరికీ హెల్మెట్‌‌ను పోలీసులు తప్పనిసరి చేశారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే అమలు చేస్తున్నారు. వెనుక కూర్చున్న వ్యక్తులకు హెల్మెట్ లేకుంటే రూ.100 జరిమానా విధించి రశీదు చేతుల్లో పెడుతున్నారు. ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వాహన దారులు భావిస్తుంటే… పోలీసులు మాత్రం అప్పుడే బాదుడు మొదలు పెట్టేశారు.
* ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ పైపలైన్ఒక్కసారిగా లీకైంది. 20 అడుగుల మేర గ్యాస్ ఎగిసింది. స్థానికులు భయాందోళనతో ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేశారు. గ్యాస్లీకేజీ అదుపు చేసేవరకు గ్రామాల్లో గ్యాస్ స్టవ్, పొయ్యిలు వెలిగించరాదని పోలీసులు మైకుల్లో అనౌన్స్ చేశారు.
* విశాఖలోని మధురవాడ వద్ద మిలీనియం టవర్‌-బి నిర్మాణానికి ప్రభుత్వం రూ.19.73 కోట్లు విడుదల చేసింది. టవర్‌-బి నిర్మాణం కోసం ఐటీశాఖకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టవర్‌-ఏ నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. విశాఖ మిలీనియం టవర్స్‌లోనే సచివాలయం కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
* రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లతోసహా అన్నిస్థాయిల్లో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
* కాంగ్రెస్‌ పార్టీ తా‍త్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చిక్సిత అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి ‍ప్రకటన వెలువడాల్సి ఉంది. అయిత పార్టీ వర్గాల మాత్రం సాధారణ చెకప్‌గా చెబుతున్నారు. కాగా ఉదరకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె గతంలో కూడా చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజా ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు హుటాహుటినా ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
* సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 906 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 6 నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న స్క్రూట్నీ జరగనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్, ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరగనుంది.
* ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 48వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
* అమరావతి నుంచి కర్నూలుకు కార్యాలయాలను తరలించడాన్ని సవాల్‌ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అమరావతి నుంచి కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరిస్‌, రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయాలను తరలించాలన్న ప్రభుత్వ ఉత్వర్వులను రైతులు సవాల్‌ చేశారు. కార్యాలయాలు తరలిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం13 చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏ ఛైర్మన్‌తోపాటు సీఆర్డీఏనూ అందులో ప్రతివాదులుగా చేర్చారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.
*విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సావాలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. సోమవారం శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు. శారదా పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజల చేశారు. పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు ప్రదక్షిణ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. గోమాతకు నైవేద్యం సమర్పించారు. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
*రాష్ట్రంలోని 79 వెనుకబడిన కులాల కోసం భూమిని కేటాయించి, అందులో సంబంధిత సంఘాల భవనాలను నిర్మించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పెరిక కులసంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
*నాగార్జున సాగర్లోని ఏపీఆర్జేసీలో చదువుకోవడం తన అదృష్టమని, అక్కడ చదవకపోయి ఉంటే తాను సొంతూరులోనే సేద్యం చేసుకుంటూ ఉండేవాడినని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. సర్వేల్లో పాఠశాల విద్య, ఏపీఆర్జేసీలో కళాశాల విద్య.. ఇవే తనను ఉన్నతస్థానానికి చేర్చాయని ఆయన తెలిపారు. నాగార్జునసాగర్లోని ఏపీఆర్జేసీ పూర్వ విద్యార్థుల సమావేశం హైదరాబాద్లోని బేగంపేట పర్యాటక భవన్లో ఆదివారం జరిగింది.
*ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) అధ్యక్షుడు ఇ.అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం ఛార్జిషీటు జారీచేసింది. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో సుదీర్ఘ సమ్మెకు ఆయన నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆర్టీసీలో కార్మిక సంఘాల స్థానంలో కార్మికులతోనే సంక్షేమ మండలిని ఏర్పాటు చేసింది.
*ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం రెండో రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 3,172 (8.22శాతం), మధ్యాహ్నం 2,123 (6.55శాతం) మంది గైర్హాజరైనట్లు బోర్డు తెలిపింది.
*రైల్వేశాఖను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమన్ (ఎన్ఎఫ్ఐఆర్) జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ఆరోపించారు. దేశంలోని రైల్వే ఉద్యోగులను కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం చూపలేదని ఆయన ఆక్షేపించారు.
*ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ 47 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న రైతులకు 13 జిల్లాల రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. అమరావతి నుంచి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదలనివ్వబోమని, ఎటువంటి ఆందోళనకైనా సిద్ధమని పేర్కొన్నారు.
*కొత్త సంవత్సరం ఆయిల్పాం రైతులకు శుభారంభాన్నిచ్చింది. జనవరి నెలలో టన్ను గెలల ధర రూ.10,809కు చేరగా, ఫిబ్రవరి నెలలో అమాంతం రూ.1,222 పెరిగి కొత్త రికార్డు నెలకొల్పింది.
*యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపురంలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఓపీ సేవలు ప్రారంభం కానున్నాయి. రెండేళ్లుగా నిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఓపీ సేవలు కొనసాగుతున్నాయి.
*బిల్ట్ ఆంధ్రప్రదేశ్ మిషన్ కింద ప్రభుత్వ భూముల వివరాల సేకరణ కొనసాగుతోంది. పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ నగరం చుట్టుపక్కల సుమారు 4వేల ఎకరాల విలువైన సర్కారు భూములున్నట్లు అధికారులు గుర్తించారు.
*ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్.చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాసరావు, ఇతర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
*మఠాధిపతి అధికారాలను రద్దు చేస్తూ జనవరి 28న ఏపీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు జారీ చేయకుండా అధికారాలను రద్దు చేయడం చట్టవిరుద్ధం’ అని తిరుపతి హథీరాంజీ మఠాధిపతి అర్జున్దాస్ మహంత్ స్పష్టం చేశారు.
*ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం 19వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 8, 9 తేదీల్లో విశాఖపట్నంలోని రైల్వే న్యూకాలనీ పరిధిలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం వేదికగా జరగనున్నాయని సంఘం రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. 8వ తేదీ ఉదయం 10గంటలకు కార్యక్రమం ఆరంభమవుతుందని పేర్కొంది. ప్రొఫెసర్ కె.పి.సుబ్బారావు ఆహ్వాన సంఘం అధ్యక్షోపన్యాసం.. జస్టిస్ కొల్సే పాటిల్ ప్రారంభోపన్యాసం చేస్తారని వెల్లడించింది. అనంతరం ‘పౌరసత్వ సవరణ చట్టం పర్యవసానాలు’ అనే అంశంపై హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ పైజాస్ ముస్తాఫా ప్రసంగిస్తారని వెల్లడించింది.