DailyDose

వినియోగదారులకు అది మేలు చేస్తుంది-వాణిజ్యం

Nirmala Sitaraman On GST - Telugu Business News

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభం నుంచే ఊగిసలాటలో మొదలైన మార్కెట్లు ముగిసే సమయానికి స్వల్ప లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌ 136 పాయింట్లు లాభపడి 39,872 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 11,707 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.50 వద్ద కొనసాగుతోంది. కేంద్రం శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రభావం మార్కెట్ల ఒడుదొడుకులకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్ఎస్ఈలో ఏషియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌, నెస్ట్‌లే, బజాజ్‌, ఇండస్ఇండ్‌ షేర్లు లాభాల్లో పయనించగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ, యస్‌ బ్యాంకు, హీరో మోటర్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.
* డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే వినియోగదారుల సౌలభ్యం కోసం సరికొత్త వెసులు బాటునుకల్పించింది. తన ప్లాట్‌ఫాంలో లావాదేవీలను మరింత సులువుగా జరుపుకునేలా వినియోగదారులకు చాట్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలలో చాట్‌ ఫీచర్‌ను ప్రారంభించింది.
* వివిధ రాష్ట్రాలకు బకాయిపడిన జీఎస్టీ పరిహారాన్ని రెండు విడతల్లో పూర్తిగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తమ రాష్ట్రాలకు జీఎస్టీ వాటా, ఐజీఎస్టీ కింద చెల్లించాల్సిన పరిహారాలు ఇంతవరకూ రాలేదని పలువురు ఎంపీలు సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ వివరణ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని రెండు విడతలుగా చెల్లిస్తామని ఆయన బదులిచ్చారు. జులై 1, 2017 నుంచి జీఎస్టీ అమలుకాగా ఇప్పటివరకూ జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు రూ 2,10,969 కోట్లు విడుదల చేశామని, గత ఏడాది అక్టోబర్‌-నవంబర్‌కు సంబంధించిన జీఎస్టీ చెల్లింపులు బకాయి పడ్డాయని చెప్పారు. రెండు నెలలకు కలిపి ఒకసారి జీఎస్టీ చెల్లింపులు చేపడుతున్నామని, 2019 సెప్టెంబర్‌ వరకూ బకాయిల చెల్లింపులను ఇప్పటివరకూ క్లియర్‌ చేశామని అన్నారు. జీఎస్టీ అమలు సందర్భంగా నూతన పన్ను వ్యవస్థ వల్ల రాష్ట్రాలకు వాటిల్లే పన్ను నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.
*జీఎస్టీ అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నా వినియోగదారులకు మేలే జరిగిందని ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. ఈ పరోక్ష పన్ను విధానం అమలుతో వినియోగదారులకు రూ.లక్ష కోట్ల వరకు ప్రయోజనం చేకూరిందన్నారు. తనిఖీల బెడద తగ్గడంతో రవాణా ఖర్చులూ 20 శాతం వరకు తగ్గాయన్నారు. జీఎ్సటీ అమలుకు ముందుతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఇంటి ఖర్చులు సగటున నాలుగు శాతం తగ్గినట్టు చెప్పారు. అయితే జీఎ్సటీ రిటర్న్ల ఫైలింగ్లో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి సరళీకరించిన కొత్త రిటర్న్లను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు.
*సివిల్ నేరాలుగా పరిగణించే కొన్ని రకాల నేరాలను తొలగించి చట్టాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో కంపెనీల చట్టానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని సవరణలు ప్రతిపాదించారు. పన్ను చెల్లింపుదారులకు వేధింపులు లేకుండా చూడాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ సారథ్యంలోని ఉన్నతాధికార కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కంపెనీల చట్టం లో పొందుపరిచిన 66 నేరాల్లో 23 కాంపౌండింగ్ నేరాలుగా (కొంత జరిమానా చెల్లించి బయటపడే స్వభావం గలవి) పరిగణనలోకి వస్తాయని, వాటిని పునర్వర్గీకరించాల్సివస్తుందని ఆ కమిటీ సూచించింది. ఆ నేరాలను విచారించేందుకు ప్రభుత్వం ఇన్హౌస్ విచారణా యంత్రాంగాన్ని నియమించాల్సి ఉంటుంది.
*ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వె్స్టమెంట్) ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చేసారి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.90,000 కోట్ల వరకు లభిస్తాయని మోదీ సర్కారు అంచనా వేస్తోంది. తద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), ఐడీబీఐ బ్యాంక్లోని వాటాను విక్రయించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
*ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను భిన్న కోణంలో చూడాల్సి ఉంటుం ది. ఇందులో సామాన్యులను ఆకర్షించే మసాలాలు ఏవీ లేవు. జీఎస్టీ రాక ముందు టూత్పేస్టులు, సబ్బులు వంటి వాటి ధరలు పెరిగాయా, తగ్గాయా అనే ఆసక్తి సగటు మనిషికి ఉండేది. కాని గత మూడు, నాలుగు బడ్జెట్లలో ఆ కోణం పూర్తిగా తొలగిపోయింది. బడ్జెట్ అభివృద్ధికి దోహదకారి అవుతుందా, లేదా అన్న కోణం నుంచి మాత్రమే పరిశీలించాలి.