Business

అమరావతి భూముల పరిస్థితి ఎలా ఉంది?

Amaravathi Real Estate Scenario - Feb 2020

అమరావతిలో భూముల పరిస్థితి గతంలో ఎలా ఉంది? ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ప్రాంతంలో రైతుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. రాజ‌ధాని నిర్మాణం కోసం రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ప‌ద్ధ‌తిలో సేక‌రించిన‌ భూములు వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని మంత్రులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌తో మ‌రింత అల‌జ‌డి క‌నిపిస్తోంది.మూడు రాజ‌ధానులు అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్య‌మంత్రి చేసిన ప్రతిపాదన త‌ర్వాత మొద‌లైన నిర‌స‌న‌లు మ‌రింత ఉధృత‌మ‌వుతున్నాయి.అయిదేళ్ల కింద అమ‌రావ‌తి ప్రాంతంలో రైతుల నుంచి ప్ర‌భుత్వం భూములు తీసుకుంటోందంటూ కొందరు ఆందోళ‌న‌లు చేశారు. ఇప్పుడు రైతుల భూములు వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని చెబుతుండ‌డం నిర‌స‌న‌ల‌కు కార‌ణం అవుతోంది.ఈ తరుణంలో గడచిన అయిదేళ్ల కాలంలో అమ‌రావ‌తి ప్రాంతంలో ఏం జ‌రిగింది? భూముల ధరలు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి?
*2014 జూన్ 2న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పున‌ర్‌వ్యవస్థీక‌ర‌ణ చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆరు నెల‌ల‌కు నూత‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తి పేరును ప్ర‌క‌టించారు.జ‌న‌వ‌రి 2015 నుంచి ల్యాండ్ పూలింగ్ ప‌ద్ధ‌తిలో భూస‌మీక‌ర‌ణ చేప‌ట్టారు. ఈ విధానం మీద అప్ప‌ట్లోనే భిన్న స్పంద‌న‌లు వ‌చ్చాయి. మెజార్టీ గ్రామాల్లో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కానీ.. ఉండ‌వల్లి, పెన‌మాక స‌హా ప‌లు గ్రామాల్లో రైతులు ల్యాండ్ పూలింగ్‌ను వ్య‌తిరేకించారు. ఆందోళ‌న‌లు కూడా చేప‌ట్టారు. అప్ప‌ట్లో వైసీపీ, జ‌న‌సేన నేత‌లు వారికి మ‌ద్దతుగా ధర్నాలు చేశారు. బ‌ల‌వంత‌పు భూస‌మీక‌ర‌ణ చేయొద్దంటూ ప్ర‌క‌ట‌న‌లు చేశారు.
*భూముల ధ‌ర‌లే ప్ర‌ధాన కార‌ణం
రాజ‌ధాని నిర్మాణం కోసం సీఆర్డీయే ఏర్పాటు చేసి, 29 గ్రామాల‌ను దాని ప‌రిధిలోకి తీసుకొస్తూ ప్ర‌భుత్వం చేసిన ల్యాండ్ పూలింగ్‌కి కొన్ని గ్రామాల్లో రైతుల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం భూముల ధ‌ర‌ల్లో వ్య‌త్యాస‌మే అని చెప్ప‌వ‌చ్చు.విజ‌య‌వాడ న‌గ‌రానికి ఆనుకుని, జాతీయ ర‌హ‌దారికి స‌మీపంలో ఉన్న తాడేప‌ల్లితో పాటు ఉండ‌వ‌ల్లి వంటి గ్రామాల్లో అప్ప‌టికే భూముల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. 2014లో ప్ర‌భుత్వ రిజిస్ట్రేష‌న్ విలువ గజం రూ. 5 వేల ప్ర‌కారంల ఉండ‌వ‌ల్లిలో ఎక‌రా ధర రూ.24 ల‌క్ష‌లుగా ఉంది. అదే స‌మ‌యంలో విజ‌య‌వాడ‌కు దూరంగా ఉన్న తుళ్లూరు మండ‌లం ప‌రిధిలోని కొన్ని గ్రామాల్లో నాటికి రిజిస్ట్రేష‌న్ విలువ కేవ‌లం రూ.3 ల‌క్ష‌లుగానే ఉంది.నాటి ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌కారం, రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులంద‌రికీ స‌మానంగా కౌలు చెల్లించేందుకు సిద్ధ‌మ‌య్యారు. జ‌రీబు, మెట్ట భూములు అన్న వ్య‌త్యాస‌మే త‌ప్ప మిగిలిన విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. దాంతో నేల‌పాడు వంటి గ్రామాల్లో భూముల ధ‌ర‌లు అమాంతంగా పెర‌గ‌డానికి దోహ‌ద‌ప‌డింది.కానీ, అప్ప‌టికే అత్య‌ధిక ధ‌ర‌లు ఉన్న తాడేప‌ల్లి మండ‌లంలోని కొన్ని గ్రామాల రైతుల‌కు ఎటువంటి ప్ర‌యోజ‌నం క‌నిపించ‌లేదు. ఇలాంటి కార‌ణాలు ప్రధానంగా ప్ర‌భావం చూప‌గా ప‌లు ఇతర అంశాలు తోడుకావ‌డంతో విజ‌య‌వాడ న‌గ‌రానికి చేరువ‌లో ఉన్న గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు అప్పుడు నిరాక‌రించారు. చివ‌ర‌కు సీడ్ యాక్సెస్ రోడ్డు వంటివి కూడా అసంపూర్ణంగా మిగిలిపోవ‌డానికి అది కార‌ణమైంది.నేటికీ రాజ‌ధాని ప‌రిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో నిత్యం పంట‌ల సాగుతో ఒకప్పటి దృశ్యాలే క‌నిపిస్తుండ‌గా, భూములిచ్చిన గ్రామాల్లో మాత్రం దానికి భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.
**మూలిగే న‌క్క‌పై తాటికాయ‌
విజ‌య‌వాడ‌, గుంటూరు నగరాల మ‌ధ్య‌లో స్థిరాస్తి రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని క్రెడాయ్ విజ‌య‌వాడ యూనిట్ అధ్య‌క్షుడు ఆర్.స్వామి అన్నారు.”మూడేళ్లుగా మార్కెట్ బాగోలేదు. మొద‌ట‌ నోట్లర‌ద్దు దెబ్బ‌తీసింది. ఆ త‌ర్వాత జీఎస్టీ ప్ర‌భావం చూపింది. ఈ ఎనిమిది నెల‌లుగా ఇసుక కొర‌తతో స‌మ‌స్య‌గా ఉంది. ఇప్పుడైనా కోలుకుంటామ‌నుకుంటే మూడు రాజ‌ధానులంషటూ సీఎం చెప్ప‌గానే కొనుగోలుదారులు వెన‌క్కి పోతున్నారు. మూడు రోజులుగా మొత్తం మార్కెట్ కుప్ప‌కూలిపోయింది. రూ.35 లక్షల నుంచి రూ.40 ల‌క్ష‌ల దాకా ఉండే డ‌బుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కూడా ఇప్పుడు రూ.30 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది. ఇక మంగ‌ళ‌గిరిలోని ప్రైమ్ లోకేష‌న్స్‌లో నిర్మించిన అపార్ట్‌మెంట్లలో కూడా చ‌ద‌ర‌పు అడుగు మొన్న‌టి వ‌ర‌కూ రూ. 6 వేలు ఉండేది. ఈ రోజుకి అది రూ.3,800కి ప‌డిపోయింది. మొత్తంగా 40 శాతం త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాలు రియ‌ల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. విజ‌య‌వాడ డెవ‌ల‌ప‌ర్స్ కోలుకోలేని ప‌రిస్థితి ఏర్పడుతోంది. మూలిగే న‌క్క‌పై తాటికాయ‌ప‌డ్డ‌ట్టుగా ఉంది. ఈ అంశంలో రాష్ట్ర ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేయాలి. కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని” అని ఆర్.స్వామి కోరారు.
*అవినీతి పేరు పెట్టి అమ‌రావ‌తిని చంపేస్తారా?: చంద్ర‌బాబు
రాజ‌ధాని ప్రాంతంగా ఎంపిక చేసిన త‌ర్వాత త‌మ‌ ప్రాంతంలో భూముల ధ‌ర‌లు సునామీలా పెరిగాయ‌ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి ఈశ్వ‌ర్ రెడ్డి చెప్పారు.”రాజ‌ధాని రాక‌ముందే ఉండ‌వ‌ల్లిలో ఎక‌రం కోటిన్న‌ర దాకా ఉండేది. కానీ, మారుమూల ప్రాంతాల్లో చ‌విటి నేల‌కు, సిరులు పండే పొలాల‌కు ఒక‌టే ధ‌ర నిర్ణ‌యించారు. రాజ‌ధాని రాక‌తో మా ప్రాంతంలో భూముల ధ‌ర‌లు అమాంతంగా పెరిగిపోయాయి. మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వం ఇచ్చిన ప్లాట్లు చూస్తే గ‌జం రూ. 65 వేల‌కు కూడా అమ్ముడుపోయింది. గ‌త ప్ర‌భుత్వం చేసిన ప్ర‌చారంతో ఇక్కడ భూముల కొనుగోళ్ల‌కు ఎక్కువ మంది మొగ్గు చూపారు. కానీ, ప్ర‌భుత్వం మార‌డంతో ఆ ధ‌ర‌ల్లో తేడా వ‌చ్చింది. మొన్న‌టి న‌వంబ‌ర్‌లో గ‌జం రూ.40 వేల వ‌ర‌కూ ఉండేది. కానీ, ఇప్పుడు అది రూ. 15 వేల‌కు కూడా అమ్ముడు పోయే ప‌రిస్థితి లేదు. రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి మారిస్తే భూముల ధరల పరిస్థితి సునామీ పోయిన త‌ర్వాత ఎలా ఉంటుందో అలా తయారవుతుందేమో అన్న ఆందోళ‌న అంద‌రిలో క‌నిపిస్తోంది. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న‌ది స్టాండ‌ర్డ్ మార్కెట్ కాదు. ఇక్క‌డ ఒక్క ప‌రిశ్ర‌మ కూడా లేదు. ఉపాధి లేన‌ప్పుడు ఎవ‌రూ కొనుగోలు చేసే అవ‌కాశం లేదు” అని ఈశ్వ‌ర్ రెడ్డి వివ‌రించారు.
*ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు
ఓవైపు రాజ‌ధాని రైతుల భూములు వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వంటి వారు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. మ‌రోవైపు నిపుణుల క‌మిటీ నివేదిక ఆధారంగా నిర్ణ‌యాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో సీఆర్డీయే ప‌రిస్థితి కూడా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.గ‌త నెల‌లో రాజ‌ధానిపై స‌మీక్ష సంద‌ర్భంగా డిసెంబ‌ర్ నుంచి ప‌నులు ప్రారంభిస్తామ‌ని, ఇప్ప‌టికే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేస్తామ‌ని సీఎం అన్నారు. కానీ ఇప్పుడు భిన్న‌మైన ప్ర‌క‌ట‌నలు రావ‌డం, అమ‌రావ‌తిలో నిర్మాణ ప‌నులు మొద‌లుకాక‌పోవ‌డంతో అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.ఈ ప‌రిస్థితిపై సీఆర్డీయే క‌మిష‌న‌ర్ ల‌క్ష్మీ న‌ర‌సింహం బీబీసీతో మాట్లాడుతూ… “ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటాం. సీఆర్డీయే మీద సీఎం స‌మీక్ష జ‌రిపిన స‌మ‌యంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం. త‌దుప‌రి చ‌ర్య‌లకు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావాల్సి ఉంటుంది” అని అన్నారు.
*ప్రస్తుత పరిస్థితి
ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం 2014లో ఉండవల్లిలో ఎకరా రూ. 24 లక్షలుగా ఉంది. 2018 ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వం నూతన రిజిస్ట్రేషన్ ధరలను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజధాని ప్రాంతంలో అప్పటి వరకూ విడివిడిగా రేట్లు ఉండగా.. 2018 ఆగస్టు 1వ తేదీ నుంచి మాత్రం ఒకటే రేటు నిర్ణయించింది. దీంతో రాజధాని పరిధిలోకి వచ్చే 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువ నివాస స్థలాలకు చదరపు గజం రూ.5 వేలు. అంటే ఎకరా రూ.24 లక్షలు అయ్యింది.అయితే, సీఆర్డీఏకు భూములు ఇవ్వని గ్రామాల్లోని భూములను వ్యవసాయ భూములుగానే పరిగణిస్తున్నారు. ఆ భూములకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రేట్లు మాత్రం ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా, ఆ భూమి వైవిధ్యాన్ని బట్టి ఒక్కో విధంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విలువ కనిష్టంగా ఎకరా రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ. 24 లక్షలుగా ఉన్నాయి. మార్కెట్ రేటు మాత్రం వేరుగా ఉంటోంది.మార్కెట్ విలువ ప్రకారం చూస్తే.. ఉండవల్లిలో ఇప్పటికీ గజం రూ. 50 వేలు, ఎకరా రూ. 24 కోట్లు వరకూ ఉందని, తుళ్లూరులో గజం రూ.25 వేలు, ఎకరా రూ.12 కోట్ల వరకూ ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారి జి చిరంజీవి చెబుతున్నారు.2014 ఎన్నికలకు ముందు ఉండవల్లిలో గజం రూ.65 వేలు, ఎకరా రూ.31.2 కోట్లు ఉండగా.. తుళ్లూరులో గజం రూ.45 వేలు, ఎకరా రూ. 21.6 కోట్లుగా ఉండేదని ఆయన వెల్లడించారు.ఎన్నికల ముందైనా తర్వాతైనా విజయవాడ-గుంటూరు వైపు నుంచి వెలగపూడిలోని సెక్రటేరియేట్ వరకూ ఉన్న భూములకు ఒక రేటు, ఆ పైన ఉన్న 12 గ్రామాల్లోని భూములకు మరొక రేటు ఉంటుందని.. ఇప్పుడు ఈ 12 గ్రామాల్లోని భూముల రేట్లు సగానికి సగం పడిపోయాయని చిరంజీవి తెలిపారు.ఇదిగా ఉండగా.. సీఆర్డీయే ప‌రిధిలో భూములిచ్చిన రైతుల‌కు 64,709 ప్లాటుల‌ను కేటాయించారు.అందులో ఇప్ప‌టి వ‌ర‌కూ 61.27 శాతం రైతులు రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు. ఇంకా 25,062 ప్లాట్లు పెండింగులో ఉన్నాయి.కాగా తాజాగా అసైన్డు భూముల‌కు కేటాయించిన ఫ్లాటుల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం గుంటూరు క‌లెక్ట‌ర్ కి ఆదేశాలు జారీ చేసింది. త‌ద్వారా సీఆర్డీయే సేక‌రించిన 2515.62 ఎక‌రాల అసైన్డ్ భూముల‌కు కేటాయించిన ప్లాట్లు ర‌ద్దు కాబోతున్నాయి