ఒక్కనాడు పనికి వెళ్లకపోయినా పూట గడవని కూలీకి రూ.2.59 లక్షలు చెల్లించాలంటూ ఐటీ శాఖ నోటీసులు పంపింది. దీంతో షాక్ తిన్న కూలీ అంత డబ్బు తానెక్కడి నుంచి కట్టేదంటూ లబోదిబోమంటున్నాడు. దినసరి కూలీకి ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపిన ఉదంతం ఒడిశాలో చోటు చేసుకుంది. నాబారంగ్‌పూర్‌లోని పుర్జరిభరంది గ్రామానికి చెందిన సనధర్ గంద్ ఓ దినసరి కూలీ. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. 2014-15 వార్షిక సంవత్సరంలో బ్యాంకులో రూ.1.74 కోట్ల లావాదేపీలు జరిపినందుకు గానూ ఐటీ శాఖ ఆదారులు పన్ను నోటీసులు పంపారు. దీనిపై సనధర గంద్ మాట్లాడుతూ.. ‘నాకంతా అయోమయంగా ఉంది. రూ. 2.59 లక్షలు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపింది. కానీ ఇంత డబ్బు ఎక్కడినుంచి తేవాల’ని ప్రశ్నించాడు. ఇక అదే గ్రామానికి చెందిన ‘పప్పు అగర్వాల్ అనే వ్యాపారి ఇంట్లో ఏడు సంవత్సరాలుగా పని చేస్తున్నాను. ఆ సమయంలో నా భూమి పట్టా అడిగితే ఇచ్చాను. నా ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు కాపీలు అడిగితే ఇచ్చాను. వాటితో ఆయన ఏం చేశాడో నాకు తెలీదు. ఖాళీ పేపర్, భూమి పట్టాలపై నా సంతకం తీసుకుని మోసం చేశాడు’ అంటూ సనధర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే కూలీ గుర్తింపు కార్డుల ఆధారంగా వ్యాపారి బ్యాంకు ఖాతాను తెరిచి, దాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. బ్యాంకు ఖాతాను ఎవరు నిర్వహించారన్నది తమకు అనవరసరమని పేర్కొనటం గమనార్హం.
దినసరి కూలీకి ₹2లక్షల ఐటీ నోటీసు
Related tags :