WorldWonders

కేరళ కుళాయిలో మద్యం

Liquor In Home Water Connection

కేరళలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్టుమెంటు వాసులకు తాగునీటికి బదులు కుళాయిల్లో మద్యం రావడంతో ఒక్కసారిగా వారు ఖంగుతిన్నారు. మొదట్లో ఒకరి ఇంట్లో అనుకొని పరిశీలించగా మిగతా ఇళ్లలోనూ అలాగే రావడం మొదలైంది. ఇలా మొత్తం 18 కుటుంబాల కుళాయిల్లోనూ రావడంతో అవాక్కవడం వారి వంతైంది. అధికారుల సహకారంతో కారణాలను విశ్లేషించగా ఆసక్తికర కోణం బయటపడింది. స్థానిక ఆబ్కారీ శాఖ చేసిన పొరపాటు ఈ ఘటనకు కారణంగా తెలిసింది. త్రిశ్శూర్‌ జిల్లాలో ఆరేళ్ల క్రితం ఈ అపార్టుమెంట్‌ సమీపంలో బార్‌ ఉండేది. తనిఖీల్లో భాగంగా అక్కడి ఆబ్కారీశాఖ అధికారులు బార్‌పై దాడి చేసి భారీగా స్థాయిలో అక్రమంగా నిలువ ఉంచిన మద్యాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి నిల్వ ఉంచిన దాదాపు 6వేల లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు అధికారులు. అనంతరం విచారణ చేపట్టిన కోర్టు.. పట్టుబడిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయాలని అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఇటీవలే అధికారులు బార్‌ పక్కనే ఒక గుంత తవ్వి దాదాపు 6 గంటల పాటు కష్టపడి ఒక్కో బాటిల్‌లోని మద్యాన్ని ఆ గుంతలో పారబోశారు. అలా భూమిలో ఇంకిపోయిన మద్యం నేల పొరల్లోని నీటిలో కలిసిపోయింది. తాజాగా ఆ ప్రదేశంలో స్థానికులు ఉపయోగిస్తున్న నీటి ట్యాంకుల్లోకి ఈ మద్యం నీరు వచ్చి చేరింది. అదే నీటిని అపార్టుమెంటు వాసులకు సరఫరా చేయడంతో వారు ఓ వైపు ఆశ్చర్యంతో పాటు దీనికి కారణమైన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక మున్సిపల్‌, ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కారకులైన ఆబ్కారీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.