Agriculture

ఇవి కోడళ్ల సంఘం స్పెషల్ నూడుల్స్

Pasthapur Daughter In laws make special noodles-telugu agricultural news

చిరుధాన్యాలతో నూడుల్స్, సమోసా సహా 52 పదార్థాలు
‘తక్కువ నీరుతో ఎక్కువ పంటలు పండించవచ్చని మా అత్తల నుంచి తెలుసుకొని పండిస్తున్నాం’ హైదరాబాద్‌కు 116 కిలోమీటర్ల దూరంలోని పస్తాపూర్‌ గ్రామంలో ఒక చోట సజ్జలను నూడుల్స్‌గా తయారు చేస్తున్నారు కొందరు గ్రామీణ మహిళలు. వారిని పలకరిస్తే.. ”మాది కోడళ్ల సంఘం” అన్నారు.”ఎందుకీ సంఘం” అని అడిగితే- ”మా అత్తల దగ్గర ఎవుసం(వ్యవసాయం) చేసే పద్ధతులను వారసత్వంగా తీసుకున్నాం. వాళ్లకు వయసు మీరింది. పొలం పనులు చేయలేకపోతున్నారు, వారి సలహాలతో మేమంతా చిరుధాన్యాలు పండిస్తున్నాం” అన్నారు!పస్తాపూర్‌లో స్వచ్ఛంద సంస్థ డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలోని ‘కమ్యూనిటీ ప్రొడక్షన్ సెంటర్(సముదాయ ఉత్పత్తి కేంద్రం)’లో చిరుధాన్యాలతో గ్రామీణ మహిళలు మొత్తం 52 రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు.వీటితో స్వయం ఉపాధిని పొందుతున్నారు.
**నేపథ్యం
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 61,051 హెక్టార్లు. సాగునీటి వసతి లేదు. తక్కువ నీటితో రాగులు, కొర్రలు, జొన్నలు, ఇతర చిరుధాన్యాలను రైతులు తరతరాలుగా పండిస్తున్నారు. జహీరాబాద్‌ మండలంలోనైతే మొత్తం అపరాలే సాగు చేస్తున్నారు.కరవును ఎదుర్కోవడానికి మెట్టపంటలు పండించినా గిట్టుబాటు కాక రైతులు అప్పుల పాలవుతున్నారు.తమ సంప్రదాయ సాగుపై నమ్మకం కలిగించడానికి, పస్తాపూర్‌(జహీరాబాద్‌ మండలం)లో కాయకష్టం చేసుకొని బతికే మహిళలు కోడళ్ల సంఘంగా ఏర్పడ్డారు.వీరికి డీడీఎస్ తోడుగా నిలిచింది.
*వంటకాలపై శిక్షణ
సుస్థిర జీవనోపాధిపై ఈ సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలోని ఐదు మండలాలకు చెందిన 150 మంది కోడళ్ల సంఘం సభ్యులకు 2017 డిసెంబర్‌ నుంచి నెలపాటు జహీరాబాద్‌ పట్టణ శివారులోని పస్తాపూర్‌లో ఉన్న ఈ కేంద్రంలో శిక్షణ అందించారు.డీడీఎస్ పోషకాహార నిపుణురాలు భార్గవి పర్యవేక్షణలో తృణధాన్యాలతో వైవిధ్యమైన అనేక ఆహార పదార్థాల తయారీని మహిళలు అక్కడ నేర్చుకున్నారు.చిరుధాన్యాలతో కిచిడీ, నూడుల్స్‌, మిఠాయిలు, అప్పడాలు, అరిసెలు, సకినాలు, కేకులు, కారపుబూందీ, సమోసాలు, ఇతర ఆహార పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్‌ చేస్తున్నారు.
*అత్తల నుంచి నేర్చుకున్నాం.. మా కోడళ్లకు నేర్పిస్తాం
తమ ప్రాంతంలో అపరాల సాగు కొత్త కాదని కోడళ్ల సంఘం సభ్యులు శారద, సుకీర్త, స్వప్న చెప్పారు.
”వీటిని మా పూర్వీకుల నుంచి వారసత్వంగా సాగు చేస్తున్నాం. అపరాల సాగు వల్ల ఆకు రాలి, నేల సారవంతమవుతుందని, తక్కువ నీరుతో ఎక్కువ పంటలు పండించవచ్చని మా అత్తల నుంచి తెలుసుకొని పండిస్తున్నాం. రేపు మా కోడళ్లకు కూడా నేర్పిస్తాం. అపరాలతో రకరకాల వంటలు నేర్చుకొని మార్కెట్‌లో అమ్ముతున్నాం, స్వయం ఉపాధి పొందుతున్నాం” అని వారు వివరించారు.అపరాలు పండిస్తూ, వ్యవసాయంలో జీవ వైవిధ్యానికి పునాది వేసిన రైతులు జహీరాబాద్‌ ప్రాంతంలోనే ఉన్నారని, కానీ కనుమరుగవుతున్న చిరుధాన్యాలకు మళ్లీ జవసత్వాలు కల్పించింది కోడళ్ల సంఘమేనని పోషకాహార నిపుణురాలు భార్గవి చెప్పారు.”ఆరోగ్యం పట్ల ప్రజల్లో పెరిగిన అవగాహన వల్ల చిరుధాన్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అపరాలకు కొత్త ఫ్లేవర్‌ జోడించి రెడీమిక్స్‌ వంటకాల తయారీలో శిక్షణ ఇచ్చాం” అని ఆమె పేర్కొన్నారు.
కొర్రలతో అన్నం వండాలంటే రెండు గంటలు నానబెట్టి వండాలని, ఇంత ఓపిక, తీరిక లేని గృహిణుల కోసం, వేడినీళ్లలో వేస్తే ఐదు నిమిషాల్లో కిచిడీ తయారయ్యే రెడీమిక్స్‌లను తయారు చేశామని భార్గవి చెప్పారు. జొన్న రొట్టెలకు భిన్నంగా జొన్నసాస్‌, జొన్న కేక్‌లు, కొర్రలతో మురుకులు, బజ్జీలు, సజ్జలతో సమోసాలు, అటుకులు, మురుకులు, కజ్జికాయలు, పేనీలు చేసి మార్కెట్‌ చేశామని తెలిపారు.
*’మూడు వేల మందికి ఉపాధి’
”రోజూ 25 నుంచి 60 కేజీల వరకు ఆర్డర్లు వస్తున్నాయి. చిరుధాన్యాలతో ఆహారపదార్థాల తయారీ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు వేల మందికి ఉపాధి కలిగింది” అని భార్గవి తెలిపారు.సంగారెడ్డి జిల్లాలో 2,600 మంది పాఠశాల విద్యార్థులకు చిరుధాన్యాలతో తయారుచేసిన మురుకులు సరఫరా అవుతున్నాయి.కోడళ్ల సంఘం ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండటంతో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. గతంలో సగటున ఎకరం విస్తీర్ణంలో సాగుచేసే రైతులు ఇప్పుడు దాదాపు మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు.సంగారెడ్డి జిల్లాలో సుమారు 2,500 మంది రైతులు పండించిన తృణధాన్యాలను ఈ స్వచ్ఛంద సంస్థ వారి పొలాల నుంచి సేకరించి ఈ కేంద్రానికి తరలిస్తోంది.