గంగా, శంతనుల అష్టమ పుత్రుడు. ఇతని అసలు పేరు “దేవవ్రతుడు”. వార్ధక్యదశలో శంతనుడు, సత్యవతి సౌందర్యానికి దాసుడై, మన్మథవశవర్తియై, విరహవేదనతో వ్యాకుల శయ్యాగతుడైతే, ఈ సంగతి తెలిసిన “దేవవ్రతుడు” తన తండ్రి ఆనందం కోసం, సుఖసంతోషాల కోసం, స్వసుఖాలను, జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి, “నా జీవితంలో వనితకు, వివాహానికి తావులేదు” అని సత్యవతికి వాగ్దత్తం చేసి, అం అరణాంతం ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అందుకే ఆయన “భీష్ము”డయ్యాడు. కుమారుని త్యాగనిష్ఠకు సంతసించిన శంతనుడు, భీష్మునకు స్వచ్చంద మరణాన్ని వరంగా అనుగ్రహించాడు.
*పితామహుని ప్రతాపం :
కురుక్షేత్ర రణక్షేత్రంలో ధర్మహోమాగ్నికి అధర్మపరులను సమిథులుగా, అవినీతి వర్తనులను హవిస్సుగా, అరివీరుల హాహాకారాల “స్వాహా”కారాలతో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన ఆహ్వ యజ్ఞాన్ని … ఒంటిచేత్తో పదిరోజులు నడిపించిన నిరుపమాన ధనుర్విద్యా పితామహుడు “భీష్ముడు”. భీష్మ ధనుర్విముక్త నిశిత శరాఘాతాలకు, పరమశివుని మెప్పించి పాశుపతం సంపాదించిన పార్ధుడే కాదు, పార్శసారథికూడా నిశ్చేష్టుడయ్యాడు. “ఆహావరంగంలో ఆయుధం పట్టను” అని పల్కిన శ్రీకృష్ణుడే తన ప్రతిజ్ఞను విస్మరించి భీష్మసంహారానికి ఆయుధం పట్టాడు. పరమాత్ముడి చేతనే ప్రతిజ్ఞాభంగం చేయించిన అప్రతిహత పరాక్రమవంతుడు “భీష్ముడు”.
*శరతల్పం :
తన నెరిసి, చూపు మందగించి, జవసత్త్వాల పట్టు తప్పి, వార్ధక్యవార్షికి అవ్వాలితీరాన వున్నా భీష్ముడు … పున్సత్వం నశించిన పానడవులు, శిఖండిని ముందునుంచుకుని పోరుకు తలబడితే, తాను శిఖండి కాలేక అస్త్రసన్యాసం చేసి, గాండీవ ధనుర్విముక్త శరసహశ్రానికి శరతల్పగతుడయ్యాడు. అంతమాత్రాన అర్జునుడు విజయుడయ్యాడనుకుంటే మాత్రం పొరపాటు. అధర్మపక్షాన నిలబడి, ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే “భీష్ముడు” మరణాన్ని స్వాగతించాడు. అదే, తన అసమర్థతకు శిక్ష అని భావించాడు. అంపశయ్యగతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు. అమ్ములు ములుకుల్లా బాధిస్తున్నా, సహిస్తూ, ఆ యుద్ధరంగంలో పీనుగుల గుట్టల మధ్య, క్షతగాత్రుల రోదనలు వింటూ, నక్కల, తోడేళ్ళ, రాబందుల, గుడ్లగూబల అరుపులు ఆలకిస్తూ, ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, యాభై ఎనిమిది రోజులు ఒంటరిగా మరణవేదనను అనుభవిస్తూ, మానవజన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ధర్మరాజు విజయలక్షిని వరించాడు. స్వజనుల రక్తతిలకంతో, అయినవాళ్ళ అశ్రుజలధారలతో హస్తిన సింహపీఠంపై సార్వభౌమునిగా అభిషిక్తుడయ్యానే …, అన్న బాధతో ధర్మజుడు, సంతోషాన్ని మానసిక శాంతిని పొందలేకపోయాడు. వెంటనే శ్రీకృష్ణునితో కలిసి, తన సోదరులను వెంటబెట్టుకుని శరతల్పగతుడైన ఆ “శాంతనవుని” దగ్గరకు వచ్చాడు.
*మహాప్రస్థానం :
ధ్యాన సమాధి స్థితిలోనున్న భీష్ముడు, ఎవరో తన దగ్గరకు వచ్చిన అలికిడికి ఏకాగ్రత సడలి, అలసటతో వాలివున్న కనురెప్పలను భారంగా పైకెత్తి చూసాడు. పాండవులు, శ్రీకృష్ణుడు కనిపించారు. మనరానికి చివరిమెట్టు మీదవున్న అంతిమక్షన్నంలో మాధవుని ముఖారవింద దర్శనం ఆ కురువృద్ధునికి ఆనందం కలిగించింది. భక్తిగా చేతులు జోడించాడు. పాండవులు ఆ జ్ఞాననిధికి పాదాభివందనం చేశారు. మౌనంగానే వారిని ఆశీర్వదించాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి, “పితామహా! సంగ్రామ ఫలమైన విజయలక్ష్మిని వరించానన్న మాటేగానీ, మానసిక విజయాన్ని వరించలేకపోయాను. నాకు మానసిక శాంతి కలిగే మార్గాన్ని ఉపదేశించు. ఈ విశ్వంలో గొప్పదైవం ఎవరు? ఎవరిని కీర్తిస్తే సుఖసంతోషాలు లభిస్తాయి. ఎవరిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి? ఎవరిని శరణుకోరితే ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది?” అని ప్రశ్నించాడు.భీష్ముడు చిరునవ్వుతో ధర్మజుని వైపు చూసి … తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపై నిలిపి, “ధర్మజా! నీ సందేహాలన్నింటికీ నా చివరి సమాధానం, లీలా మానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే” అంటూ చేతులు జోడించి, “జగత్ ఏభుం దేవదేవమనంతం పురుషోత్తమం” అంటూ ప్రారంభించి, “విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు:” అంటూ విష్ణసహస్రనామావళిని వేయి విధాలుగా కీర్తిస్తూ, విశ్వకళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు. అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ “ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు. శ్రీకృష్ణుడు దీవిస్తూ “గాంగేయా! నీ భక్తిపారవశ్యం నాకు ఆనందం కలిగించింది. మాఘశుద్ధ ఏకాదశి తిథిని నీ సంస్మరణదినంగా నీకు కానుక యిస్తున్నాను. మహామహులకు లభించే శాశ్వత పుణ్యలోకాలు నీకు లభిస్తాయి” అని పలికాడు. మాఘశుద్ధ అష్టమి తిథిరోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది. మహాభారత యితిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది.
##############
రాశిఫలం – 05/02/2020
తిథి:
శుద్ధ ఏకాదశి సా.5.51
నక్షత్రం:
మృగశిర రా.11.02
వర్జ్యం:
కలియుగం-5121 ,శాలివాహన శకం-1941 విశేషాలు: సర్వేషాం భీష్మ ఏకాదశి
దుర్ముహూర్తం:
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం:
మ.12.00 నుండి 1.30 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆకస్మిక ధనలాభముంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయ. అన్నింటా విజయానే్న సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి వుంటుంది.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచి వుంటారు. దైవదర్శనం లభిస్తుంది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనంవల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ధనలాభయోగముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఋణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకెళ్తారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఋణప్రయత్నాలు ఫలిస్తాయ. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయ. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.